పొదుపు చర్యలపై ఈజిప్టు తరహాలో ఉద్యమిస్తున్న స్పెయిన్ యువత


Spain protests

స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఆందోళనకారుల బైఠాయింపు ఏడోరోజు

ఇప్పటికే మూడు దేశాలను, గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్, బలితీసుకున్న యూరప్ అప్పు సంక్షోభం స్పెయిన్‌ను అతలాకుతలం చేస్తోంది. బడ్జెట్ లోటు తగ్గించడానికి స్పెయిన్ ప్రభుత్వం వరుసగా ప్రవేశపెడుతున్న పొదుపు చర్యలు స్పెయిన్ ప్రజలను వీదులపాలు చేస్తున్నది. యూరోపియన్ యూనియన్‌లోనే అత్యధికంగా స్పెయిన్‌లో 21.3 శాతం నిరుద్యోగం ఉంది. పొదుపు విధానాల పుణ్యమాని ఇది ఇంకా పెరుగుతోంది. యువతలో నూటికి 45 మంది నిరుద్యోగులుగా ఉన్నారు. పరిస్ధితి ఇలా ఉంటే ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును పెంచి నిరుద్యోగుల ఆశలపై నీళ్ళు చల్లింది. దీనితో ఆగ్రహం చెందిన స్పెయిన్ యువకులు గత వారం రోజుల నుండి రాజధాని మాడ్రిడ్ తో పాటు అనేక పట్టణాల్లో ఆందోలనలు నిర్వహిస్తున్నారు. తమ ఆందోళనలను వారు ఈజిప్టు ఆందోలనలతో పోలుస్తూ తమ డిమాండ్లు నెరవేరే దాకా ఆందోళనలను విరమైంచేది లేదని ప్రతిన బూనుతున్నారు.

వారం రోజుల క్రితం అకస్మాత్తుగా ప్రారంభమైన ఆందోళన మాడ్రిడ్ నగర కేంద్రంలో బైఠాయింపుగా మారింది. రోజూ రాత్రిళ్ళు వందలమంది ప్రధాన కూడలిలో బైఠాయిస్తున్నారు. మరింత మెరుగైన జీవన పరిస్ధితులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పొదుపు పేరుతో ప్రజలకు ఇస్తున్న సదుపాయాలను పూర్తిగా రద్దు చేయడాన్ని నిరసిస్తున్నారు.  అత్యధికంగా 4.9 మిలియన్ల మంది నిరుద్యోగులుగా ఉండడంతో స్పెయిన్‌లో నిరసన, అసమ్మతి హెచ్చుపాళ్ళలో పేరుకుపోయింది. మాడ్రిడ్ నగరంలో ప్రధాని కూడలిని ఆక్రమించి ఉన్న 25,000 మంది ఆందోళనకారులని వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వం కోరింది. ప్రదర్శనలు, బైఠాయింపుపై విధించిన నిషేధాన్ని నిరసనకారులు తిప్పికొడుతూ అక్కడే కొనసాగారు.

ఆదివారం స్ధానిక ఎన్నికలు జరగనున్నాయి. స్పెయిన్ చట్టం ప్రకారం ఎన్నికల ముందు రోజు ప్రదర్శనలు నిషేధం. అందువలన శుక్రవారం అర్ధ రాత్రికల్లా నిరసనకారులు కూడలిని విడిచిపెట్టి వెళ్ళాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. నిషేధాన్ని గుర్తు చేసింది. అయితే ఆందోలనకారులు నిషేధాన్ని ఉల్లంఘిస్తూ బైఠాయింపును శనివారం కూడా కొనసాగించారు. పోలీసులు పెద్ద మొహరించినప్పటికీ వారు నిరసనకారులపై చర్యలకు దిగలేదు. శుక్రవారం అర్ధ రాత్రి దాటే సమయంలో ఆందోళనకారులు చేతులతో తమ నోళ్ళను మూసి ఉంచి నిరసన తెలిపారు. అర్ధ రాత్రి దాటాక నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ విజయధ్వానాలు చేస్తూ ఉత్సాహంతో కేకలు వేశారు. అయితే స్పెయిన్ ప్రధాని జోస్ లూయిస్ రోడ్రిగెజ్ జపటీరో ఆందోళనకారుల పట్ల సానుభూతితో ఉన్నట్లుగా కనిపిస్తోంది. పోలీసులు నిషేధాన్ని అమలు చేయడానికి విరుచుకుపడవచ్చని అంతా భావించినప్పటికీ అలాంటిదేమీ జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ప్రదర్శకులు ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన జీవన పరిస్ధితులు కావాలంటున్నారు. నిజాయితీతో కూడీన ప్రజాస్వామిక వ్యవస్ధ కావాలంటున్నారు. “ప్రజారోగ్యం, విద్యా సౌకర్యాలు లేకుండా మేము గడపాలని వారు కోరుతున్నారు. ఓ పక్క మాలో సగం మందికి ఉద్యోగాలు లేకుండా ఉంటే మరోపక్క పదవీ విరమణ వయస్సును పెంచారు” అని ఓ ప్రదర్శకురాలు ఆగ్రహం వ్యక్తం చేసిందని బిబిసి తెలిపింది. “మాకున్న కొంచెం ప్రభుత్వ సంక్షేమాన్ని కూడా దాడి చేసి లాక్కున్నారు” అని ఆమె ఆగ్రహించింది. “ఓ సమస్యను పరిష్కరించడానికి మరో సమస్యను సృష్టించాలని పోలీసులు కోరుకోవడం లేదు” అని ఇంటీరియర్ మంత్రి పోలీసుల సంయమనం పై వ్యాఖ్యానించాడు. అధికారిక సోషలిస్టు పార్టీ ఆదివారం జరగనున్న స్ధానిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడనున్నదని అంచనా వేస్తున్నారు.

స్పెయిన్ లో అధికారంలో ఉన్నది సోషలిస్టు పార్టీ. గ్రీసులో కూడా సోషలిస్టు పార్టీగా చెప్పుకుంటన్న పార్టీయే అధికారంలో ఉంది. రేప్ ప్రయత్నం నేరంపై అమెరికాలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు కూడా ఫ్రాన్సులో సోషలిస్టు పార్టీ నాయకుడుగా చెబుతున్నారు. ఫ్రాన్సులో అనేక సంవత్సరాలపాటు ఫ్రాంకోయిస్ మిట్టరాండ్ నేతృత్వంలోని సోషలిస్టు పార్టీ అధికారం చెలాయించింది. యూరప్ లో వ్యాపీంచి ఉన్న ఈ పార్టీలు పేరుకే సోషలిస్టు పార్టీలు తప్ప సోషలిస్టు విధానాలపట్ల గౌరవం తర్వాత సంగతి అసలు అవగాహనే లేదనడంలొ అతిశయోక్తి లేదు. వీరి వైఫల్యాలను సోషలిస్టు వైఫల్యాలుగా చిత్రించబూనుకోవడం వాస్తవ విరుద్ధం. వారి విధానాలు పక్కా పెట్టుబడి దారీ విధానాలే. కనుక వారి వైఫల్యాలన్నీ పెట్టుబడీదారీ వైఫల్యాలే తప్ప మరొకటి కాదు.

వ్యాఖ్యానించండి