ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ యుద్దం చేస్తున్న అమెరికా సైన్యం పాకిస్ధాన్ భూభాగంలో తలదాచుకుంటున్న తాలిబాన్ మిలిటెంట్లను అంతమొందించడానికి మానవ రహిత డ్రోన్ విమానాలను అధిక సంఖ్యలో వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డ్రోన్ దాడులు పాకిస్ధాన్ సార్వభౌమత్వాన్ని ధిక్కరించడమేనని, కనుక వాటిని మేము అనుమతించబోమనీ పాకిస్ధాన్ సైన్యంతో పాటు, పాక్ ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు ప్రకటనలు చేస్తాయి. అయితే వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్స్ కేబుల్స్ ద్వారా వెల్లడైన సమాచారం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉండడం ఇప్పుడు తాజా సంచలనంగా మారింది. వాస్తవానికి ఫెడరల్ పాలనలో ఉన్న గిరిజన ప్రాంతాల్లోని మిలిటెంట్లతో పోరాడిన పాక్ సైన్యంతో, 2009 నుండే అమెరికా సైనికులను చొప్పించి గూఢచర్య సమాచారం సేకరించడానికి పాక్ సైనికాధికారులు అనుమతించారని వెల్లడయ్యింది. దానితో పాటు డ్రోన్ దాడులను కూడా సర్వ సైనికాధికాని కయాని అనుమతించాడని వెల్లడయింది. ఇంకా చెప్పాలంటే ఇరవై నాలుగ్గంటలూ డ్రోన్లతో పాక్ వాయవ్య గిరిజన ప్రాంతాలను పహారా కాయలని కయాని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లుగా వెల్లడయ్యింది.
సి.ఐ.ఏ గూఢచారి రేమండ్ డేవిస్ ఇద్దరు పాకిస్తానీయులను కాల్చి చంపిన దగ్గర్నుండీ పాక్ సైన్యానికీ అమెరికా ప్రభుత్వం, సైనికాదికారులకు పొసగడం లేదని వార్తలు వస్తున్నాయి. లాడెన్ హత్యానంతరం ఐ.ఎస్.ఐకీ టెర్రరిస్టు గ్రూపులకూ సంబంధాలున్నాయని అమెరికా ఆగ్రహిస్తున్నట్లూ వార్తలు వచ్చాయి. డేవిస్ ఉదంతం తర్వాత పాకిస్ధాన్ ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో నివసిస్తున్న అమెరికా దేశస్ధులు వాస్తవానికి సి.ఐ.ఏ గూఢచారులని గ్రహించారు. కొంతమంది అమెరికన్లు పాకిస్ధాన్ మహిళలను సైతం వివాహం చేసుకుని నివసిస్తున్నది గూఢచర్యానికేనని తెలుసుకున్న పాకిస్తాన్ ప్రజలు అగ్రహోదగ్రులయ్యారు. అప్పటినుండీ ప్రతిరోజూ దేశంలో ఏదో ఒక మూల పాక్ ప్రభుత్వం అమెరికాకి లొంగిపోవడంపై నిరసనలు, ఆందోళలనలూ జరుగుతున్నాయి. దానితో పాక్ లో ఉన్న సి.ఐ.ఏ సిబ్బందిని గణనీయంగా తగ్గించాలని పాక్ సైన్యాధికారి కయానీ అమెరికాకి ఐ.ఎస్.ఐ అధిపతి పాషాను రాయబారిగా పంపాడు. అయితే సిబ్బందిని తగ్గించారో లేదో గానీ డ్రోన్ దాడులు మరింత తీవ్రమయ్యాయి.
అమెరికా డ్రోన్ దాడులను పాకిస్ధాన్ ప్రభుత్వం, సైన్యం ఇంతవరకూ ప్రకటించిన వ్యతిరేకత ఒట్టి నాటకమేనని తాజా సమాచారంతో రుజువైంది. డ్రోన్ దాడులకు స్వయంగా పాకిస్ధాన్ సైన్యమే రహస్య మద్దతు ఇవ్వడం పాక్ ప్రజలకు మింగుడు పడని విషయం. పైకి డ్రోన్ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపల మాత్రం ఇరవై నాలుగు గంటాలూ డ్రోన్లతో పహారా కాయలని కయాని కోరడం మరింత చేదైన విషయం. డ్రోన్ దాడుల్లో అనేక మంది పాక్ ప్రజలు మరణిస్తున్నారు. ఈ మరణాలను అమెరికా కోలేటరల్ డ్యామేజ్ గా కొట్టిపారేస్తూన్నది. మిలిటెంట్లు డ్రోన్ దాడుల్లో చనిపోతున్నారని అమెరికా చెబుతున్నా, అందులో వాస్తవం ఎంతో తెలియదు. తాలిబాన్‌కి చెందిన నాయకత్వాన్ని ఇంతవరకు డ్రోన్లు తాకలేకపోయాయి. పైగా ఆఫ్ఘనిస్ధాన్ లో ఆఫ్ఘన్ ప్రభుత్వ పోలీసులు, సైన్యం లో ఉన్నవారే అమెరికా సైనిక అధికారులను కాల్చి చంపుతున్న పరిస్ధితి ఉంది. ఆఫ్ఘన్ ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక బ్యారక్ లు కూడా అమెరికా సైనికులకు భద్రత ఉందని నమ్మలేని పరిస్ధితులు తలెత్తాయి. ఇంత జరుగుతున్నా సామ్రాజ్యవాద ప్రయోజనాలకు కట్టుబడి ఉన్న అమెరికా పాలకులు అటు ఆఫ్ఘన్ ప్రజలతో పాటు, ఇటు తన సైనికుల ఉసురు తీస్తున్న యుద్ధం కొనసాగించడానికే నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది.
2009లో పాకిస్ధాన్లో అమెరికా రాయబారిగా ఉన్న అన్నే పాటర్సన్ అమెరికా ప్రభుత్వానికి పంపిన కేబుల్ లో తాజా విషయాలు వెల్లడయ్యాయి. వికీ లీక్స్ బయటపెట్టిన ఈ కేబుల్ వివరాలను పాక్ లోని “డాన్” పత్రిక ప్రచురించింది. “మన సైనికులను చొప్పించడం ద్వారా పాకిస్ధాన్ సైనికులు గూఢచర్య సమాచారాన్ని సేకరించడానికీ, ఇప్పుడున్న సమాచారాన్ని సమన్వయపరుచుకోవడానికి సహాయం చేస్తున్నాం” అని అన్నే రాసినట్లు వెల్లడయ్యింది. పాకిస్ధాన్ సైనికుల్లోకి అమెరికా సైనికులను, గూఢచారులను చొప్పించడానికి అమెరికా ఆత్రుతగా ఉన్నట్లు అనేక కేబుళ్ళలో ఉన్నదని డాన్ పత్రిక వెల్లడించింది. నవంబరు 2009 కేబుల్ లో “ఉత్తరాన ఉన్న గిరిజన ప్రాంతాల్లో పాక్ సైన్యం జరపనున్న ఆపరేషన్లలో అమెరికా ప్రత్యేక బలగాలను (గూఢచారులు) చొప్పించడానికి అదనపు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది” అని అన్నే రాసింది.
అయితే సెప్టెంబరు 2009 నాటికే పాక్ ఆర్మీ కేంద్ర కార్యాలయంలో కూడా అమెరికా గూఢచారుల్ని ప్రవేశపెట్టినట్లుగా ఒక కేబుల్ ద్వారా తెలుస్తోంది. “తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్ల నిమిత్తం అమెరికా మిలట్రీ నుండి గూఢచర్యం, పహారా, సమాచార సేకరణలకు సహాయం స్వీకరించడానికి పాక్ అంగీకరించడం మొదలు పెట్టింది. అంతే కాకుండా ఫ్రాంటియర్ కార్ప్సు కేంద్ర కార్యాలయం వద్దా, 11 వ కార్ప్సు వద్దా గూఢచర్య కేంద్రాలను (intelligence fusion centres) మనం నెలకొల్పుకున్నాము. అలాగే ఆర్మీ కేంద్ర కార్యాలయంలోనూ (జి.హెచ్.క్యు), బలూచిస్ధాన్ లోని 12 వ కార్ప్సు లోనూ ఈ కెంద్రాలు నెలకొల్పే అవకాశం వస్తుందని భావిస్తున్నాను” అని పాటర్సన్ తన కేబుల్ లో రాసింది. దీని ప్రకారం పాకిస్ధాన్ సైనిక విభాగాలన్నింటిలోనూ అమెరికా గూఢచారులు చొచ్చుకుపోయినట్లు భావించవచ్చు. పాకిస్ధాన్ రక్షణ బలగాలన్నీ ఇలా పరాయి దేశ గూఢచారులకు అందుబాటులో ఉంచడమ్ అంటే పాక్ భూభాగ రక్షణ మొత్తం అమెరికా చేతిలోకి వెళ్ళినట్లే. ఇది మునుముందు పాకిస్ధాన్ కే కాకుండా దాని పొరుగు దేశాలైన ఇండియా, చైనా లకు కూడా ప్రమాదకరంగా పరిణమించే అవకాసాలు పుష్కలంగా ఉన్నాయి.
పాక్ సైనికులకి సాయం చేసే పేరుతో చొరబడిన అమెరికా ప్రత్యేక దళాలు నిజానికి పాక్ సైనికులపై గూఢచర్యం కోసమే ప్రయత్నించిందని భావించవచ్చు. కారణం తాలిబాన్ అటు ఆఫ్ఘనిస్ధాన్ తో పాటు ఇటు పాక్ ప్రజల్లోనూ ఆదరణ సంపాదించుకుంది. తాలీబాన్, ఆల్-ఖైదాలను బైటికి టెర్రరిస్టులుగా చెప్పే అమెరికా అంతర్గత సంభాషణలో తిరుగుబాటుదారులుగా (insurgents) పేర్కొనడం గమనార్హం. అలాగే ఆఫ్ఘన్ యుద్ధాన్ని, పాక్ భూభాగంపై జరిపై దాడులని టెర్రరిస్టు వ్యతిరేక ఆపరేషన్లుగా (counter terrorism operations) బైటికి పేర్కొనే అమెరికా అంతర్గత సంభాషణల్లో తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లుగా (counterinsurgency operations లేదా COIN) పేర్కొంటున్నది. దీనర్ధం సుస్పష్టమే. అమెరికా ఆఫ్ఘనిస్ధాన్ దేశాన్ని ఆక్రమించి ఉంది. తమ దేశాన్ని ఆక్రమించిన అమెరికా దురాక్రమణ సేనలపై తాలిబాన్ జాతీయా పోరాటం లేదా తిరుగుబాటు పోరాటం చేస్తున్నది. అందుకే అమెరికా సైన్యం కౌంటర్ ఇన్‌సర్జెన్సీ ఆపరేషన్లని సంబోధిస్తున్నది. ఆఫ్ఘనిస్ధాన్‌ని పాలిస్తున్న తాలిబాన్ లాడెన్ కి రక్షణ కల్పిస్తున్నదన్న పేరుతో అమెరికా ఆఫ్ఘనిస్ధాన్ పై దాడి చేసింది. లాడెన్ ని అప్పగిస్తామని చెప్పినా నిరాకరించి మరీ ఆఫ్ఘనిస్ధాన్ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది. దానితో పాటు పాకిస్ధాన్ సైన్యం లోకి జొరబడి దాని గుట్టుమట్లన్నిటినీ అమెరికా దొరకబుచ్చుకుంటున్నది. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లను గుప్పిట్లో పెట్టుకున్న అమెరికా తదుపరి కన్ను ఎవరిపైన ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. తక్కువ జీతాలతో పడి ఉంటారని అమెరికా కంపెనీలు భారతీయులను పిలిచి ఉద్యోగాలిస్తున్నదన్న కారణంతో, అదే తమ ఉద్ధరణ అని నమ్మి, గుడ్డిగా అమెరికా దుష్టవిధానాలకు మద్దతు పలుకుతున్న భారతీయులు ఇప్పటికైనా కళ్లు తెరుచుకోవాలి.
