కొద్ది రోజుల క్రితం టెర్రరిజం నేరాల క్రింద భారత ప్రభుత్వం ప్రచురించిన “మోస్టు వాంటేడ్ పాకిస్తానీయుల” జాబితోలో తప్పులను భారత పత్రికలు ఎత్తి చూపడంతో ఆ జాబితాను ప్రభుత్వం ఉపసంహరించుకోక తప్పలేదు. టెర్రరిజం నేరాలము పాల్పడిన పాకిస్తానీయులను తమకు అప్పజెప్పాలంటూ 50 మంది పాకిస్తాన్ దేశీయుల పేర్లను ఇండియా గత మార్చి నెలలో పాకిస్ధాన్ ప్రభుత్వానికి సమర్పించింది. కొద్ది రోజుల క్రితం ఆ జాబితాను తన వెబ్ సైట్ లో సి.బి.ఐ ఉంచింది. జాబితాలోని కనీసం ఒక వ్యక్తి ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న విషయం పత్రికలు బైటపెట్టాయి. 2010లో తయారు చేసిన తన జాబితాను తాజా పరిస్ధితి ప్రకారం సవరించడంలో విఫలం చెందినట్లుగా సి.బి.ఐ ప్రకటించింది. దానర్ధం ఇండియాకి అప్పజెప్పమంటూ పాకిస్ధాన్ కి ఇచ్చిన జాబితాలోని ఓ వ్యక్తి వాస్తవానికి ఇండియాలో ఉన్నట్లే. ఒక విధంగా భారత ప్రభుత్వానికి పరాభవంగా భావిస్తున్నారు.
ఒకరు ఇప్పటికే జైలులో ఉండగా మరో వ్యక్తి నిజానికి మహారాష్ట్ర లోని పశ్చిమ ప్రాంతంలో నివసిస్తున్నట్లుగా పత్రికలు గుర్తించాయి. మరోక వ్యక్తిని గత అక్టోబరులో బంగ్లాదేశ్ “నేరస్ధుల అప్పగింత ఒప్పందం” కింద భారత దేశానికి అప్పజెప్పిందని పత్రికలు ఘోషిస్తున్నాయి. భారత జాబితాలో తప్పులున్నాయని పత్రికలు తెలినపుడు మొదట హేళనగా నవ్వుతూ కొట్టిపారేసిన హోం మంత్రి చిదంబరం ఇప్పుడు భాధ్యతను అంగీకరిస్తున్నాడు. అంతర్గత భద్రతా శాఖ సెక్రటరీ యు.కె.బన్సాల్, “తప్పులున్నాయని అంగీకరిస్తున్నాం. భాధ్యులెవరో గుర్తిస్తాం” అని ప్రకటించాడు.జాబితాలో ఐదుగురు పాకిస్ధాన్ ఆర్మీ అధికారులు ఉన్నారు. పాకిస్ధాన్ ఆర్మీలో ఉన్నతాధికారులకు టెర్రరిస్టు దాడులతో సంబంధాలున్నాయని ఆరోపించడం ఇది మొదటి సారి.
ప్రధాని మన్మోహన్ టీం లో శక్తివంతమైన, సమర్ధవంతమైన మంత్రిగా పేరున్న హోం మంత్రి చిదంబరంకు జాబితాలోని తప్పులు అవమానకరంగా అందరూ భావిస్తున్నారు. ప్రతిపక్ష బిజెపి పార్టీ చిదంబరం రాజీనామాని డిమాండ్ చేసింది. అధిక ధరలతో, వరుసగా వెల్లడవుతున్న అవినీతి కుంభకోణాలతో ప్రజలకు దూరమవుతున్నదని భావిస్తున్న అధికార కూటమి నాయకుడు కాంగ్రెస్ కి కూడా ఇది దెబ్బేనని రాయిటర్స్ వార్తా సంస్ధ అభిప్రాయపడింది. భావి ప్రధానిగా భావిస్తున్న రాహుల్ గాంధీ చిల్లర ప్రకటనలు, చేష్టలతో ఇబ్బందిపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇంకెన్ని శరాఘాతాలు ఎదురు చూస్తున్నాయో!