పాకిస్ధాన్ కు గతంలో హామీ ఇచ్చిన దాని కంటే ఎక్కువ ఫైటర్ జెట్లను సరఫరా చేయడానికి చైనా అంగీకరించినట్లు తెలుస్తోంది. పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలాని ప్రస్తుతం చైనా పర్యటిస్తున్న సంగతి విదితమే. లాడెన్ ను అబ్బోత్తాబాద్ లో అమెరికా కమెండోలు చంపిన తర్వాత పాక్ అమెరికా ల మధ్య సంబంధాలు బెడిసి కొట్టినట్లు పత్రికలు కోడై కూస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే అమెరికా కాకుంటే తమకు చైనా మిత్ర దేశం అండగా ఉండగలదన్న సూచనలు ఇవ్వడానికి పాక్ ప్రధాని చైనా పర్యటనకు సిద్ధమైనట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ అంచనా వేసింది. ఇండియా యూరప్ దేశాలనుండి 126 ఫైటర్ జెట్లను కొనుగోలు చేయనున్న నేపధ్యంలో పాకిస్ధాన్ చైనా తయారీ ఫైటర్ జెట్ల కోసం ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది.
పాకిస్ధాన్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధిని ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జనరల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు వార్తను ప్రచురించింది. ఉమ్మడిగా అభివృద్ధి చేసిన జె.ఎఫ్ – 17 ఫైటర్ జెట్లు ఇప్పటికే సరఫరా చేస్తున్న వాటికి అదనంగా అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొని జెట్లను పాక్ కి సరఫరా చేశారనీ వాటిని పాకిస్ధాన్ లోనే అస్సెంబ్లింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. “మా వద్ద ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 50 ‘ధండర్’ ఫైటర్ జెట్లను సరఫరా చేయడానికి అంగీకారం కుదిరింది. వాటి సరఫరాను వేగవంతం చేయడానికి చైనా అంగీకరించింది” అని సదరు అధికారిని ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జనరల్ తెలిపింది. ఈ జెట్లు ఒకే ఒక ఇంజన్ తో అనేక పాత్రలు నిర్వహించగల సామర్ద్యం ఉందని వివరిస్తున్నారు.
ఒక్కొక్కటి 50 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే ధండర్ జెట్లు 150 వరకు సరఫరా చేయడానికి పాకిస్ధాన్ గతంలో ఆర్డరు ఇచ్చిందనీ, అదనంగా మరో 100 జెట్లకు ఆర్డర్ ను పెంచుతున్నారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. తాజా 50 జెట్లు ఈ అదనం లో భాగమేనని తెలిపింది. పాకిస్ధాన్ యుద్ధ పరికరాల కోసం పశ్చిమ దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని
ప్రయత్నిస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియాతో అమెరికా పౌర అణు ఒప్పందం కుదుర్చున్న విధంగానే తనకు ఆ ఒప్పందం కావాలని పాకిస్ధాన్ అమెరీకను కోరింది. అయితే అమెరికా అందుకు తిరస్కరించింది. పాకిస్ధాన్ నుండి అణు పరిజ్ఞానం ఇతర దేశాలకు సరఫరా అయిన నేపధ్యంలో పాకిస్ధాన్ తో అణు ఒప్పందాలకు అమెరికా అంగీకరించడం లేదు. పైగా పాక్ వద్ద ఉన్న అణు ఇంధనాన్ని దొంగిలించడానికి సి.ఐ.ఏ ప్రయత్నించినట్లు ఐ.ఎస్.ఐ ఆరోపించింది.
ఇండియాతో సరిహద్దు తగాదాలు ఉన్న చైనా, పాకిస్ధాన్ లు మొదటి నుండి మిత్ర దేశాలు గా మెలిగాయి. అయితే ఇండియాతో చైనా తన సంబంధాలను తెంచుకోవడానికి సిద్ధంగా లేదు. కొన్ని సంవత్సరాలుగా చైనా, ఇండియాలు తమ వ్యాపార సంబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తున్నాయి.
