ఊహించినంతా జరిగింది. సంవత్సరాలపాటు డిఫ్లేషన్‌తో తీసుకున్న జపాన్ ఆర్ధిక వ్యవస్ధ భూకంపం, సునామిల ధాటికి మరోసారి ఆర్ధిక మాంద్యం (రిసెషన్) లోకి జారిపోయింది. వినియోగదారుల డిమాండ్ ఘోరంగా పడిపోవడం, రేడియేషన్ భయాలతో ఎగుమతులు కూడా పడిపోవడంతో ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన జపాన్ జిడిపి కుచించుకుపోయింది. ఆర్ధిక నియమాల ప్రకారం వరుసగా రెండు క్వార్టర్ల పాటు జిడిపి తగ్గుదల నమోదు చేసినట్లయితే ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ రిసెషన్ ఎదుర్కొంటున్నట్లు భావిస్తారు. గత సంవత్సరం చివరి క్వార్టర్ లో జిడిపి తగ్గుదల నమోదు చేసిన జపాన్ ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో -0.9 శాతం (వార్షిక తగ్గుదల -3.7 శాతం) జిడిపి వృద్ధి నమోదు చేసిందని జపాన్ కేబినెట్ ఆఫీసు వెల్లడించింది.
మొదటి క్వార్టరులో -0.5 శాతం జిడిపి వృద్ధి రేటు నమోదు చేస్తుందని విశ్లేషకులు, జపాన్ ప్రభుత్వం భావించగా వాస్తవ వృద్ధి అంచనాలను మించి తగ్గిపోయింది. మూడేళ్ళ క్రితం ప్రపంచ ఆర్ధిక సంక్షోభంలో రిసెషన్ లోకి వెళ్ళిన జపాన్ ఓ సంవత్సరం తర్వాత మళ్లీ జిడిపి వృద్ధిని సాధించింది. రెండేళ్ళ తర్వాత భూకంపం పుణ్యాన మళ్లీ రిసేషన్ ను ఎదుర్కొంటోంది. మరికొంతకాలం పాటు జపాన్ ఆర్ధిక వ్యవస్ధ బలహీనంగానే ఉంటుందని జపాన్ ఆర్ధిక మంత్రి కవోరు యసానో తెలిపాడు. అయితే తిరిగి పునరుత్తేజం సాధించగల సామర్ధ్యం జపాన్ కి ఉందని ఆయన తెలిపాడు.
వినియోగదారులు తమ వినియోగాన్ని భూకంపం దరిమిలా 0.6 శాతం తగ్గించారని, అదే దెబ్బతీసిందని జపాన్ అర్ధిక వ్యవహారాల నిపుణుడు నవోమి ఫింక్ ని ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. జపాన్ జిడిపిలో 60 శాతం ప్రైవేటు వినియోగం నుండే వస్తుందని ఆయన తెలిపాడు. గత సంవత్సరంలో చివర్లోనే వినియోగం పడిపోయిందనీ, భూకంపంతొ అది మరింతగా దిగజారిందని ఆయన తెలిపాడు. వినియోగదారుల విశ్వాస సూచీక 33.1 వద్ద ఉందని ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి. ఇది 50 కి ఎక్కువ ఉన్నపుడు వినియోగదారుల విశ్వాసం పాజిటివ్ గానూ, తక్కువైతే నెగిటివ్ గానూ భావిస్తారు. గత సంవత్సరం మొత్త జపాన్ ఆర్ధిక వ్యవస్ధ ప్రతి ద్రవ్యోల్భణాన్ని (డిఫ్లేషన్) ఎదుర్కొంది. మార్కెట్లో ఉన్న సరుకుల విలువ కంటె తక్కువ డబ్బు వినియోగదారుల వద్ద ఉంటే అది డివ్లేషన్ అంటారు. దాని వలన సరుకుల ధరలు తగ్గుతూ పోయాయి. ధరలు తగ్గుతున్నపుడు మరింత తగ్గే అవకాశం ఉందన్న భావనతో వినియోగదారులు కొనుగోళ్ళను మరింత ఆలస్యం చేస్తారు. దాని వలన వినియోగం మరింతగా పడపోతుంది.
వినియోగం తర్వాత జపాన్ జిడిపికి దోహద పడే రెండో పెద్ద అంశం వాణిజ్యం. ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం వలన రేడియేషన్ భయాలతో అనేక దేశాలు జపాన్ ఎగుమతులను చాలావరకు నిషేధించాయి. జపాన్ ఎక్కువగా ఎగుమతి దేశే అమెరికా కూడా కొన్ని సరుకుల్ని నిషేధించింది. దాంతో ఎగుమతులు పడిపోయాయి. 2009 జిడిపిలో ఎగుమతులు 13.5 శాతం ఉంటే దిగుమతులు 12.7 శాతం ఉన్నాయి. ఎగుమతులు తగ్గడంతో పాటు కమోడిటీ ధరలు పెరిగి దిగుమతుల బిల్లు పెరిగింది. ఫలితంగా వాణిజ్య మిగులు తగ్గిపోయింది. గత సంవత్సరం మార్చి నెలలో వాణిజ్య మిగులుకంటె ఈ మార్చిలో వాణిజ్య మిగులు 34.3 శాతం తగ్గిపోయింది.
సునామీ వలన భవనాలు, రోడ్లు, ఇళ్ళు కూలిపోయినందున వాటిని పునర్నిర్మించవలసి ఉంది. ఈ పునర్నిర్మాణం మార్కెట్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాక జపాన్ అర్ధిక వ్యవస్ధ మళ్ళీ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే అవి ఈ సంవత్సరం ఆఖరువరకూ ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
