భారత దేశంలోని 120 కోట్లమంది ప్రజల్లో దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నవారు ఎంతమంది? ఈ ప్రశ్నకు అనేక జవాబులు ఉన్నాయి. ప్రభుత్వం 37 శాతం మంది దరిద్రులని చెబుతుంటే స్వతంత్ర అధ్యయనాల్లో ఒకటి 77 శాతం అని తెలిపింది. ఓ వ్యక్తి దరిద్రంలో ఉన్నాడు అని నిర్ధారించడానికి ఏర్పరిచిన ప్రాతిపదికల వలన ఇన్ని తేడాలు. ప్రభుత్వాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి జీవనాధారాలు కల్పించి వారి పరిస్ధితులను మెరుగుపరచడం ద్వారా దరిద్రుల సంఖ్యని తగ్గించడానికి బదులు ప్రాతిపదికను తగ్గించడం ద్వారా దరిద్రుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చిందని అనేక ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరం జరిపిన జనాభా లెక్కల సేకరణ ద్వారా భారత దేశ జనాభా 122 కోట్లని తేల్చిన సంగతి విదితమే.
వీరిలో దారిద్ర్య రేఖకు దిగువన ఎంతమంది ఉన్నారో లెక్కించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రాతిపదికలను రద్దు చేసి నూతన ప్రాతిపదికలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంత పేదలను నిరుపేదలు, పారిశుధ్య కార్మికులు, ప్రాచీన (ప్రిమిటివ్) తెగల గ్రూపులు గా వర్గీకరించనుంది. తాత్కాలిక గృహాల్లో నివసిస్తున్నవారు, తక్కువ వేతనాలు పొందుతున్నవారు, మహిళలుగానీ పిల్లలు గాని పెద్దలుగా ఉన్న కుటుంబాలను పట్టణల్లో పేదలుగా గుర్తించనుంది. ఈ సంవత్సరంలోనే కొద్ది నెలల తర్వాత ప్రారంభం కానున్న కులాల వారీ జనాభా లెక్కల సేకరణతో పాటుగా దారిద్ర్య రేఖకు దిగువనున్నవారి సంఖ్యను కూడా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దరిద్ర నారాయణుల సంఖ్యను 2002లో ఒకసారి సేకరించారు. కాని కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ 1931 తర్వాత ఇదే ప్రధమం. దరిద్రులుగా పరిగణించడానికి ప్రాతిపదికలను నిర్ణయించారు.గ్రామాల్లో ఫిక్స్‌డ్ ఫోన్ కనెక్షన్ ఉన్నవారు, రిఫ్రిజి రేటర్లు ఉన్నవారు, అప్పు పరిమితి 50,000 గా నిర్ణయింపబడిన రైతులు దరిద్రులు కాదు. పట్నాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, నెలకు పది వేలు సంపాదిస్తున్నవారు గానీ దరిద్రులుగా లెక్కింపబడరు. మూడుగానీ అంతకంటే ఎక్కువ గదులున్న ఇళ్ళ యజమానులూ దరిద్రులుగా లెక్కింపబడరు.
ఇవేమి ప్రాదిపదికలో అర్ధం కావడం లేదు. కుటుంబంలో సభ్యులు, వారిలో సంపాదిస్తున్నవారు ఎంతమంది, ఆధారపడ్డావారు ఎంతమంది, సంపాదిస్తున్నవారి ఆధాయం కుటుంబానికి సరిపోతున్నదా లేదా అన్న విషయాలను పరిశిలించి దాని ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని లెక్కిస్తే బాగుంటుందేమో. మూడుగదుల ఇల్లున్నా అది పూర్వీకుల ద్వారా సంక్రమించి అందులో ఉంటున్నవారు దరిద్రంలో ఉండవచ్చు. ఫోన్ పెట్టుకోదగిన పరిస్ధితినుండి దిగజారి ఉండవచ్చు. ఫోన్లున్న దరిద్రులు అర్జెంటుగా ఫోన్లు తీసేసుకోవాలి. ఎందుకంటె దరిద్రులు ఫోన్ కనెక్షన్లకు అనర్హులు గనక. ముఖ్యంగా కౌలు రైతులు. వీరికి అప్పు పరిమితి ఎంత ఉన్నా భూమి లేనంతకాలం దరిద్రమే తాండవిస్తుంది. ఒక సంవత్సరం బాగ వచ్చిన పంట మరుసటి సంవత్సరం రాని భూ యజమానులూ ఉండవచ్చు. అప్పుల్లో మునిగి అవి తీర్చలేని పరిస్ధితుల్లో ఉన్నరైతులు అనేకం. వచ్చే సంవత్సరమైనా పంట బాగా పండకపోదా అన్న ఆశే వారికి ఆదరువు.
అదీ కాక పంట పుష్కలంగా పండినా, గిట్టుబాటు ధరలు అందని పరిస్ధితి ఏటికేడూ పెరుతున్నదే తప్ప తగ్గడం లేదు. పంట చేతికి వచ్చినపుడు ఉండని ధర చేయి దాటాక మాత్రమే ఉంటోంది. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మ హత్యలు చేసుకుంటున్న మధ్య తరగతి రైతులు కోకొల్లలు. మొన్నటివరకూ పొగాకు కి గిట్టుబాటు దరల్లేక రైతులు రోడ్డేక్కితే ఇప్పుడు ధాన్యానికి సవాలక్షా సాకులు చూపి అతి తక్కువ ధరలు ఇస్తుండడం వలన రైతులు రోడ్డేక్కారు. వారికి ఉన్న గిట్టుబాటుధరలే రాక ఏడుస్తుంటే మరో రెండోందలు గిట్టుబాటు పెంచమని ప్రధానిని అడుగుతానని సి.ఎం అంటున్నాడు.
ఈ లెక్కన ఇండియాలో దరిద్రం లేనట్టేనేమో మరి. నిన్ననే (గురువారం) దారిద్ర్య నిర్మూలనకి భారత ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏవీ పని చేయడం లేదని ప్రపంచ బ్యాంకు తేల్చింది. అవినీతి, సరైన పాలన లేకపోవడం, తక్కువ చెల్లింపుల వలన ఇండియా దరిద్రం కొనసాగుతోందని బ్యాంకు తెలిపింది. ఈ లెక్కన ప్రజలు తిరగబడుతున్నారంటే పడరా మరి!
