అమెరికా ఇప్పుడు టాప్‌లో ఉన్న 1 శాతం ధనికులదే -నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ -1


Joseph Stiglitz

Joseph Stiglitz

“Of the 1%, by the 1%, for the 1%” ఇది ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అమెరికా ఆర్ధిక శాస్త్రవేత్త జోసెఫ్ స్టిగ్లిట్జ్ అమెరికా ప్రజల ఆర్ధిక స్ధితిగతులను వివరిస్తూ రాసిన వ్యాసానికి పెట్టిన హెడ్డింగ్. “డెమొక్రసీ ఆఫ్ ది ప్యూపుల్, బై ది ప్యూపుల్, ఫర్ ది ప్యూపుల్” అంటూ ప్రజాస్వామ్యాన్ని నిర్వచించిన దేశంలోని సంపద, ఆదాయాలు రెండూ అత్యున్నత స్ధానంలో ఉన్న ఒక శాతానికి మాత్రమే చేరుతున్నాయనీ, మధ్య తరగతివారు పేదలు గానూ, పేదలు దరిద్రులుగానూ మారుతున్నారని జోసెఫ్ ఆ వ్యాసాంలో రాశాడు. “కంట్రీ ఆఫ్ ఆపర్చునిటీస్” అని చెప్పుకుంటున్న అమెరికాలో నిజానికి అవకాశాలే లేవని ఆయన రాశాడు. జోసెఫ్ స్టిగ్లిట్జ్ తన వ్యాసంలో రాసిన ఇతర అంశాలు ఇలా ఉన్నాయి.

“ప్రతి సంవత్సరం దేశ ఆదాయంలోని పాతిక వంతు ఉన్నత స్ధానల్లోని 1 శాతం వారి చేతుల్లోకే చేరుకుంటోంది. ఆదాయం కాకుండా సంపద వరకు చూస్తే ఉన్నత స్ధానాల్లో ఉన్న 1 శాతం మంది అమెరికాలో ఉన్న సంపదలో 40 శాతాన్ని కంట్రోల్ చేస్తున్నారు. పాతిక సంవత్సరాల క్రితం ఉన్నత స్ధాయిలో ఉన్న ఒక శాతం మంది 12 శాతం ఆదాయమ్ పొందుతూ 33 శాతం సంపదల్ని కంట్రోల్ చేసే వారు. ఎగసి పడే కెరటం ఇతరులందర్నీ పైకి లేపుతుందని చెబితే అది తప్పుదారి పట్టించడానికి చెబుతున్నదే. ఉన్నత స్ధానాల్లోని 1 శాతం మంది గత దశాబ్దం కాలంలో తమ ఆదాయాలను 18 శాతం పెంచుకుంటే మధ్య తరగతి ప్రజల ఆదాయం వాస్తవానికి తగ్గిపోయింది. హైస్కూలు డిగ్రీలు ఉన్న పురుషుల ఆదాయం గత పాతిక సంవత్సరాల్లో 12 శాతం పడిపోయింది. గత కొద్ది దశాబ్దాల్లో సాధించిన వృద్ధి అంతా ఉన్నత స్ధాయిల్లో ఉన్న ఆ 1 శాతం చేతుల్లోకే వెళ్ళిపోయింది.

ఆదాయాల అసమానత్వం ప్రకారం చూస్తే జార్జి బుష్ పాత యూరప్ గా ఈసడించుకునే దేశాల్లో ఏ దేశంతో పోల్చినా అమెరికా పరిస్ధితి ఘోరంగా ఉంది. ఈ విషయంలో అమెరికాకి అతి సమీపంగా ఉన్న దేశాలు ఒకటి రష్యా కాగా మరొకటి ఇరాన్. (అమెరికాలో ప్రజాస్వామ్యం ఉంటే ఇరాన్‌లో ఆటోక్రటిక్ పాలన ఉందని పోల్చే వారు ఈ అంశాన్ని గుర్తించాలి -బ్లాగర్). గత కాలాల్లొ ఆదాయాల అసమానత్వానికి కేంద్రాలుగా ఉన్న అనేక దేశాలు, ఉదాహరణకి బ్రెజిల్, అదాయాల అసమానతలను తొలగించడానికి, పేదవారి పరిస్ధితులను మెరుగుపరచడానికి విజయవంతమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా మాత్రం అసమానతలను పెరగడానికే అనుమతించింది. 19 వ శతాబ్దం మధ్య కాలంలో ఉన్న విపరీతమైన ఆదాయ అసమానతలను అప్పటి ఆర్ధికవేత్తలు సమర్ధించుకోడానికి నానా తంటాలు పడేవారు. కాని అమెరికాలో ఇప్పుడున్న అదాయ అంతరాలతో పోలిస్తే అప్పటి అంతరాలు దూది పింజల్లా తేలిపోతాయి.

‘మారిజినల్ ప్రొడక్టివిటీ ధియరీ’ ద్వారా అప్పటి అదాయ అంతరాలను సమర్ధించుకున్నారు. అధీక ఉత్పాదకత, సమాజానికి ఎక్కువగా తోడ్పడుతున్నందున అధిక ఆదాయాలున్నాయని ఆ ధియరీతో చెప్పారు. అందుకు సాక్ష్యాలేవీ లేకపోయినా ధనికులు ఆ సిద్ధాంతాన్ని పదే పదే వల్లిస్తూ గడిపారు. సమాజానికిగానీ, తాము నాయకత్వం వహించిన కంపెనీలకు గానీ ఏమీ అందించకపోగా నష్టాలు తెచ్చిపెట్టడమేకాక ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారణభూతులైన కార్పొరేట్ల అధిపతులు భారీ బోనస్ లను పొందుతూనే ఉన్నారు. కొన్ని కంపెనీలు వారికిచ్చిన బోనస్‌లు “పెర్ఫార్మెన్స్ బోనస్” (సామర్ధ్య బోనస్) అని చెప్పుకోవడానికి ఇబ్బందిపడి “రిటెన్షన్ బోనస్” అని పేరు మార్చుకున్నాయి వారు మిగిల్చింది అధమ సామర్ధ్యం అయినప్పటికీ. జన్యు సంబందిత నూతన ఆవిష్కరణలతో, సమాచార సాంకేతిక విప్లవంతో సమాజానికి ఎంతగానో దోహదపడిన వారికి అందిన మొత్తం ప్రపంచాన్ని వినాశనం అంచుల్లోకి నెట్టిన ద్రవ్యపరమైన నూతన ఆవిష్కరణలను ప్రవేశపెట్టిన వారికి అందిన దానితో పోలిస్తే ఎంతో తక్కువని తేలుతుంది.

కొద్దిమంది ఒకరికి తక్కువ భాగం, మరొకరికి ఎక్కువ భాగం కేక్ వస్తే ఏంటట? ఎంత కేక్ వచ్చిందీ కాకుండా ఎంత పెద్ద కేకు వచ్చిందీ చూడండి అంటూ తేల్చేస్తారు. ఆ అవగాహనలో అనేక కారణలవలన ఎన్నో తప్పులున్నాయని పరిశీలనలో తేలుతుంది. మొదటిది, ఆదాయ అసమానత్వాలు పెరుగుతో ఫోవడమనేది ‘కుచించుకు పోతున్న అవకాశాలకు’ మరో రూపం. అవకాశాలను సమానంగా అందించడం లేదంటే దానర్ధం మన ఆస్తుల్లో అత్యంత విలువైన ఆస్తికి -ప్రజలు- సంబంధించిన ఉత్పాదకతను మనం సమర్ధవంతంగా వినియోగించుకోలేక పోతున్నామనే అర్ధం. అసమానతలకు దారితీసిన అనేక వికృతీకరణలు -గుత్త అధికారం నుండి ప్రత్యేక ప్రయోజనాల పేరుతో ప్రత్యేక పన్నుల విధానం అములు చేయడం వరకూ- ఆర్ధిక వ్యవస్ధ సామర్ధ్యాన్ని బలహీనపరిచాయి. ఈ నూతన అసమానత మరిన్ని వికృతీకరణలను సృష్టించింది. ఒక్క ఉదాహరణ చెప్పుకోవాలంటే, అత్యంత ఉన్నత స్ధాయి తెలివితేటలను సొంతం చేసుకున్న మన యువత మరింత ప్రభావంతమైన ఉత్పాదక రంగాల్లొకి (శాస్త్ర పరిశోధనలు, ఆవిష్కరణలు మొ.వి) వెళ్ళడానికి బదులు ఫైనాన్స్ రంగంలోకి వెళ్తున్నారు. పెద్ద మొత్తాల్లొ అక్కడ దొరుకుతున్న జీత భత్యాలే దానికి కారణం.

మూడోది అతి ముఖ్యమైనది ఉమ్మడి కార్యాచరణ (కలెక్టివ్ యాక్షన్). ప్రభుత్వం మౌలిక రంగాలు, విద్య, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగిన పరిశోధన ద్వారా అమెరికాతో పాటు ప్రపంచం చాలా లాభపడింది. దాని ద్వారానే ఇంటర్నెట్ ని కనుగొన్నారు. ప్రజారోగ్యంలో ఉన్నతమైన ఆవిష్కరణలు జరిగాయి. మౌలిక రంగాల్లొ పెట్టుబడులు లేకపోవడం వలన పెద్ద నష్ట జరిగింది. మన రోడ్లు, విమానాశ్రయాలు, బ్రిడ్జిలు చూడండి ఎలా ఉన్నాయో. ప్రాధమిక పరిశోధనలు, అన్ని స్ధాయిల్లోని విద్యస్ధాయి. రానున్న రోజుల్లో ఈ రంగాల్లొ ఖర్చులని మరింత తగ్గించనున్నారు. సంపదల పంపిణీలో అసమానతలు వీటికి అనివార్యంగా దారితీస్తాయి. ఆదాయాలపరంగా సమాజం మరింతగా విభజనకు గురౌతున్న కొద్దీ ధనికులు ఉమ్మడి అవసరాలకోసం ఖర్చు పెట్టడం ఇంకా తగ్గుతుంది. పార్కులు, విద్య, వైద్య సదుపయాలు, భద్రత ల కోసం ధనికులు ఇక ప్రభుత్వాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. వీటన్నిటికీ వారే ఖర్చు పెట్టగలరు. ఆ క్రమంలో సామాన్య ప్రజానీకానికి మరింత దూరమవుతారు. ఒకప్పుడున్న ఆదరణ కరువైపోతుంది. సమాజంలొ సమతూకం కోసం ప్రయత్నించే ప్రభుత్వం పట్లా, వారి ఆదాయంలో కొంత తీసుకుని సమాజం అవసరాల కోసం వినియోగించడానికి ప్రయత్నించే శక్తివంతమైన ప్రభుత్వాల పట్లా వారికి విముఖత, భయాలు కూడా పెరుగుతాయి. అమెరికాలో ఇపుడున్న ప్రభుత్వంపై వారు ఫిర్యాదులు చేసే అవకాశం ఉందేమో. నిజానికి సంపదల పునర్విభజనకు సిద్ధపడని, ధనికులకు పన్నులు తగ్గించడానికి తప్ప మరింకే విషయంలోనూ ఏకాభిప్రాయం సాధించలేని ఇప్పటి ప్రభుత్వం వారికి చాలా సంతోష కారకం.

(ఇంకా ఉంది)

వ్యాఖ్యానించండి