పాక్‌తో సంబంధాల మెరుగుకు అమెరికా ప్రయత్నాలు


John Kerry

John Kerry

సి.ఐ.ఏ ఏజెంట్ డేవిస్ అప్పగింత, ఒసామా బిన్ లాడెన్ హత్య లతో పాక్, అమెరికాల మధ్య అడుగంటిన సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. దాన్లో భాగంగా సెనేటర్ జాన్ కెర్రీ ఆఫ్ఘన్, పాక్ లలో పర్యటిస్తున్నాడు. వచ్చింది సంబంధాల మెరుగుకే అయినా పాక్ పై నిందలు మోపడం మానలేదు. ఒసామా బిన్ లాడెన్ ఆరు సంవత్సరాల పాటు పాక్ లో ఉండటానికి పాక్ సంస్ధల సాయం ఉందన్న విషయం నమ్మకాన్ని చెదరగోట్టేదని కెర్రీ ఆఫ్ఘనిస్ధాన్ లో వ్యాఖ్యానించాడు. రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలపై పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ, ప్రధాని యూసఫ్ రజా గిలానీ లతో కెర్రీ చర్చించనున్నాడని బిబిసి తెలిపింది.

మే 2 న పాక్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుందా అమెరికా కమెండోలు లాడెన్‌ను హత్య చేయడం, పాక్ గగనతలం లోకి చొరబడడం పట్ల పాక్ ఆగ్రహంతో ఉందని చెబుతున్నారు. లాడెన్ అబ్బోత్తాబాద్ లొ రక్షణ పొందుతున్న సంగతి పాక్ పాలనా వ్యవస్ధల్లో ఎవరికైనా తెలిసి ఉండోచ్చని అమెరికా అభిప్రాయం. అంతేకాక అంత డబ్బు ఇస్తున్నా తన దేశంలో టెర్రరిజాన్ని అంతం చేయడానికి తగినంతగా కృషి చేయడం లేదనీ అమెరికా ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కాబూల్ లో పత్రికలతో మాట్లాడుతూ, కెర్రీ “పాకిస్ధాన్‌తో సంబంధాలు కీలక దశలో ఉన్నాయని పేర్కొన్నాడు. సంబంధాలు క్షీణించే విధంగా ఒకరినొకరు వేలెత్తి చూపుకోకుండా సంయమనం పాటించడం అవసరం” అని కెర్రీ వ్యాఖ్యానించాడు. “గత కొన్ని రోజులుగా కొన్ని ప్రధానమైన, ప్రాముఖ్యం గలిగన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవి మనం చెప్పుకుంటున్న ‘టెర్రరిజంపై యుద్ధం’ పైనా, తద్వారా ఇరు దేశాల సంబంధాలపైనా ప్రభావం చూపుతాయని గ్రహించడం ముఖ్యం. పాక్ అమెరికాల ఉమ్మడి సహకారం ముందుకు సాగేందుకు తగిన మార్గాలను వెతుక్కోవలసి ఉంది” అని కెర్రీ తెలిపాడు. టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం పేరుతో అమెరికా చేస్తున్న దురాక్రమణ యుద్ధాలు, అరాచకాల్లో పాకిస్ధాన్ ప్రభుత్వం జూనియర్ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.

శనివారం పాక్ పార్లమెంటు పాక్ గగనతలంలోకి అమెరికా హెలికాప్టర్లు సమాచారం లేకుండా చొచ్చుకుని రావడాన్ని ఖండించింది. మరోసారి అలాంటివి జరగకూడడని అమెరికాను హెచ్చరించింది. మానవ రహిత డ్రోన్ విమానాలతో పాకిస్ధాన్ లోకి జొరబడి పౌరులను చంపడాన్నీ పార్లమెంటు నిరసించింది. డ్రోన్ విమానాన దాడులు ఆపేవరకూ ఆఫ్ఘన్ లోని అమెరికా సైన్యానికి సరఫరాలను పాక్ భూభాగం గుండా నిషేధించాలని కూడా పార్లమెంటు కోరింది. ఈ నేపధ్యంలోనే జాన్ కెర్రీ అఫ్ఘన్, పాక్ లను పర్యటిస్తున్నాడు.

వ్యాఖ్యానించండి