అప్పు సంక్షోభంలో ఉన్న గ్రీసు యూరోను ఉమ్మడి కరెన్సీగా రద్దు చేసుకుని స్వంత కరెన్సీ పునరుద్ధరించుకోనుందన్న పుకార్లు వ్యాపించడంతో యూరో విలువ ఒక శాతానికి పైగా పడిపోయింది. గత సంవత్సరం మే నెలలో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల నుండి 110 బిలియన్ యూరోల సహాయ ప్యాకేజిని అందుకున్న గ్రీసు ఆ ప్యాకేజీతో పాటు కఠినమైన షరతులను అమలు చేయాల్సి వచ్చింది. షరతుల్లో భాగంగా ప్రజలపైన భారం మోపుతూ పొదుపు విధానాలను అమలు చేయడం ప్రారంబించింది. అనేక ప్రభుత్వ రంగ ఉద్యోగాలను రద్దు చేసింది. ప్రభుత్వరంగ కంపెనీలను అయినకాడికి అమ్మి ప్రవేటు రంగానికి తలుపులు బార్లా తెరిచింది. ఉద్యోగుల వేతనాల్లో స్తంభన విధించింది. మరికొందరి వేతనాలను తగ్గించింది. సంక్షేమ విధానాలను రద్దు చేయడంతో పెరిగిన ధరలను ప్రజలు తట్టుకోలేని పరిస్ధితి తలెత్తింది.
పొదుపు విధానాల ఫలితంగా గ్రీసు ఆర్ధిక వృద్ధి పడిపోయింది. బడ్జెట్‌లోటు తగ్గించడానికి ఉద్దేశించిన పొదుపు విధానాలు అప్పు భారాన్ని మరింత పెంచాయి. గ్రీసును అప్పు సంక్షోభం నుండి బయటికి లాగుతామని ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఇచ్చిన సహాయం (అప్పు) గ్రీసుని మరిన్ని సమస్యల్లోకి నెట్టింది. పెరిగిన అప్పు తీర్చలేక అప్పును రీస్ట్రక్చర్ చేయక తప్పదని ఒత్తిళ్ళు మొదలయ్యాయి. రీస్ట్రక్చరింగ్ చేసే సమస్యే లేదని గ్రీసు ప్రకటించినా నమ్మే పరిస్ధితిలో మార్కెట్ లేదు. ఈ నేపధ్యంలో యూరోజోన్ నుండి గ్రీసు బైటికి వస్తున్నట్లు పుకార్లు వ్యాపించడంతో అట్టహాసంగా ప్రారంభమైన యూరో ఉమ్మడి కరెన్సీ ఉనికి పైనే అనుమానాలు తలెత్తాయి. ఫలితంగా యూరో విలువ 1.44 డాలర్లకు పెరిగింది. జర్మనీ, గ్రీసు లతో పాటు ఇతర యూరో దేశాలు ఈ వర్తను తీవ్రంగా ఖండించినప్పటికీ యూరో విలువ పడిపోయింది.
జర్మనీ పత్రిక ‘డెర్ స్పీగెల్’ శుక్రవారం రాత్రి గ్రీసు యూరోజోన్ నుండి ఉపసంహరించుకునే విషయమై ఓ సమావేశం జరగనుందని వార్త ప్రచురించింది. ఈ వార్తను జర్మనీ, గ్రీసులు ఖండించాయి. అయితే యూరోజోన్ లోని ఐదు దేశాలు లక్సెంబర్గులో సమావేశమయ్యాయి. జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ, స్పెయిన్, గ్రీసు దేశాలు పోర్చుగల్, ఐర్లండ్, గ్రీసు దేశాల ఆర్ధిక పరిస్ధులనూ, ఇతర ఇ.యు అంశాలనూ చర్చించడానికి సమావేశమయ్యాయని అధికారులు తెలిపారు. “ఈ వార్త పూర్తిగా అవాస్తవమే కాక ఏ మాత్రం సమగ్రత లేకుండా రాసినది. గ్రీకు ప్రభుత్వం, ఇ.యు సభ్య దేశాలు అవాస్తవమని చెబుతున్నా పట్టించుకోకుండా రాసినవి. బాధ్యతా రహితమైన ఈ వార్తలు స్పెక్యులేటర్స్ కి మాత్రమే ఉపయోగపడతాయి” అని గ్రీసు పేర్కొంది.
బెయిలౌట్ షరతుల్లో భాగంగా గ్రీసు పెద్ద ఎత్తున ప్రవేటీకరణ చేపట్టడంతో ప్రజలు, కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. సమ్మెలకు దిగారు. అయినా గ్రీసు ప్రభుత్వం తన విధానాలు కొనసాగించింది. నిజానికి గ్రీసు యూరోజోన్ నుండి బైటకు రావడమే గ్రీసు ప్రజలకు ఉపయోగం. యూరో విధానాలు ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్సు లాంటి దేశాలకు అనుగుణంగా ఉంటాయి తప్ప ఇతర బలహీన దేశాల పరిస్ధులకు అనుగుణంగా ఉండవు. అంతిమంగా యూరోజోన్ విధానాలు యూరప్ లోని బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసమే ఉపయోగపడుతున్నాయి. బలహీన దేశాల ఆర్ధిక వనరులని కొల్లగొట్టి తమ లాభాలు పెంచుకోవడానికి అవి ఉపయోగపడుతున్నాయి. అప్పు సేకరణ కూడా యూరోలలో సేకరించవలసి రావడం వలన ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలతో పోటీని తట్టుకోలేక కఠిన షరతులతో కూడిన సహాయ ప్యాకేజిలను అంగీకరించి ప్రభుత్వ ఖర్చుని తగ్గించే పేరుతో ప్రజలపై భారం మోపడానికి దోహదపడుతున్నాయి.
