ఒసామా హత్యను నిర్ధారించిన ఆల్-ఖైదా, శవం అప్పగించాలని డిమాండ్


Protest in Pak on Osama death

ఒసామా హత్యకు నిరసనగా పాకిస్ధాన్‌లో ప్రదర్శన

ఒసామా-బిన్-లాడెన్‌ నిజంగా అమెరికా కమెండోల దాడిలో చనిపోయాడా లేదా అన్న అనుమానాలకు తెర దించుతూ అతను చనిపోయిన విషయాన్ని ఆల్-ఖైదా సంస్ధ నిర్ధారించింది. లాడెన్ శవాన్ని అప్పగించాలని ఆల్-ఖైదా డిమాండ్ చేసింది. శవాన్ని అరేబియా సముద్రంలో పాతిపెట్టామంటున్న అమెరికా మాటలను ఆల్-ఖైదా నమ్మడం లేదని ఈ డిమాండ్ ద్వారా అర్ధం చేసుకోవచ్చునా లేక శవం పాతిపెట్టిన చోటుని చెప్పాలని ఈ డిమాండ్ అంతరార్ధమో తెలియడం లేదు. ఒసామా-బిన్-లాడెన్ హత్యకు అమెరికా పైనా, దాని మిత్రుల పైనా ప్రతీకారం తీర్చుకుంటామని ఆల్-ఖైదా ప్రతిన చేస్తున్నట్లుగా ఇంటర్నెట్‌లో ఉంచిన సందేశం తెలిపిందని రాయిటర్స్ సంస్ధ వార్త ప్రచురించింది.

ఇదిలా ఉండగా ఒసామా హత్యకు నిరసనగా పాకిస్ధాన్‌లోని మత పార్టీ జాయియెత్-ఎ-ఉలేమా-ఎ-ఇస్లాం అధ్వర్యంలో 1500 మందితో ఊరేగింపు నిర్వహించింది. అమెరికాతో సంబంధాలు తెంచుకోవాలని ఆ పార్టీ పాకిస్ధాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

బిన్ లాడెన్ చావును చరిత్రాత్మక ఘటనగా ఆల్-ఖైదా కీర్తించింది. సాయుధ పోరాట పంధా విడువబోమని ప్రతిన బూనుతున్నట్లు ప్రకటించింది. లాడెన్ చనిపోవడానికి ముందు వారం రొజుల క్రితం రికార్డు చేసిందని చెబుతూ ఒక ఆడియో టేపును త్వరలో విడుదల చేస్తామని ఆల్-ఖైదా సంస్ధ తెలిపింది. ఒసావా మృత శరీరాన్నీ, అతనితో పాటు చనిపోయిన ఇతరుల శవాలనూ తమకు అప్పజెప్పాలని అది డిమాండ్ చేసింది.

వ్యాఖ్యానించండి