ఇండియాతో ఘర్షణ పెట్టుకుని ఒసామా హత్యపై దృష్టి మరల్చే యోచనలో పాకిస్ధాన్?


పాకిస్ధాన్ భూభాగంపై స్ధావరం ఏర్పరుచుకున్న ఒసామా బిన్ లాడెన్‌ను చంపామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో పాకిస్ధాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పాకిస్ధాన్ ప్రభుత్వానికి తెలియకుండా అమెరికా ఆపరేషన్ నిర్వహించిందనడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఇన్నాళ్ళూ ఒసామా పాకిస్ధాన్‌లోనే ఆశ్రయం తీసుకుంటున్న విషయం తెలిసి పాకిస్ధానీయులు నిశ్చేష్టులయ్యారని పత్రికలు తెలుపుతున్నాయి. పాకిస్ధాన్ ఐ.ఎస్.ఐ సంస్ధ లాడెన్‌ను తప్పిస్తుందేమో అన్న అనుమానాలున్నందునే పాక్ ప్రభుత్వానికి తెలియజేయలేదని సి.ఐ.ఏ డైరెక్టర్ చెప్పడంతో పాకిస్ధాన్‌లోని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్త్తున్నాయి.

U.S. helicopter in Osama compound

లాడెన్ ఇంటిలో కూలిపోయిన అమెరికా హెలికాప్టర్ -రాయిటర్స్ ఫోటో

ఈ నేపధ్యంలో ఒసామా హత్యకు సంబంధిన ఎపిసోడ్ నుండి పాకిస్ధాన్ ప్రజల దృష్టి మరల్చడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సల్మాన్ బషీర్ పరోక్షంగా ఇండియాను హెచ్చరిస్తూ జారీ చేసిన ప్రకటన ఈ అనుమానానికి ఆస్కారం ఇస్తోంది. ఘటనలతో ఏ మాత్రం సంబంధం లేని ఇండియాను వివాదంలోకి లాగడాన్ని చూస్తే దాయాదుల మధ్య సాంప్రదాయకంగా కొనసాగుతూ వచ్చిన వైరాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు బషీర్ ప్రకటనలో కనిపిస్తున్నాయి. తద్వారా ఒసామా హత్యనుండి ప్రతిపక్ష పార్టీలు లబ్ధి పొందకుండా చూడటం దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ దిగజారిందంటున్న ప్రతిష్ట మరింత దిగజారకుండా చూసుకోవడం అనే జంట లక్ష్యాలను సాధించే ప్రయత్నాలను కొట్టిపారవేయలేం.

ఇండియాలో కూడా వివిధ సమస్యలపై ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నపుడు సరిహద్దులో ఉద్రిక్తలు హఠాత్తుగా మొదలయిన ఉదాహరణలు గతంలో ఉన్నాయి. రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ కుంభకోణంపై దేశం  అట్టుడుకుతున్న సమయంలో ఇలాగే సరిహద్దులో ఉద్రిక్తతలు తలెత్తాయి. కార్గిల్ ఘర్షణకూడా పాకిస్ధాన్‌లో రాజకీయ సంక్షోభాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాల్లో భాగమన్న అనుమానాలను అప్పట్లో చాలామంది విశ్లేషకులు లేవనెత్తారు. అదే పరిస్ధితి మళ్ళీ తలెత్తే అవకాశాలు లేకపోలేదు.

“… అలాంటి ఏక పక్ష విధానంతో వ్యవహరించగల శక్తి ఉందని మరే ఇతర దేశమైనా భావించిన పక్షంలో …అది మౌలికంగానే తప్పుడు అంచనాయే అవుతుందని స్పష్టం చేయదలుచుకున్నాం” అని బషీర్ అన్నాడు. పాకిస్ధాన్ మిలట్రీ గానీ, ఐ.ఎస్.ఐ గాని ఆల్-ఖైదాతో సంబంధాలున్నాయనడాన్ని బషీర్ తీవ్రంగా ఖండించాడు. “అటువంటి దుస్సాహసానికి గానీ, తప్పుడు అంచనాకు గానీ పూనుకున్నట్లయితే భయంకరమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదు. పాకిస్ధాన్‌కి తనను తాను రక్షించుకోగల సామర్ధ్యం ఉందనడంలో ఎట్టి సందేహమూ అనవసరం” అని బషీర్ హెచ్చరిస్తున్నాడు.

ఇది పూర్తిగా అసంబద్ధ ప్రేలాపన. లాడెన్ ఎపిసోడ్‌లో ఇండియా పాత్ర ఏ దశలోనూ లేదు. ఇండియా, అమెరికా లాగా ఏకపక్ష దాడికి పూనుకోగల శక్తి ఉందని భావించుకుని దాడి చేసినట్లయితే భయంకర పరిణామాలు ఎదుర్కొంటుందని బషీర్ హెచ్చరిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. రాయిటర్స్ వార్త సంస్ధ బషీర్ మాటల్లోని అంతరార్ధం ఇండియాకు హెచ్చరిక జారిచేయడమేనని విశ్లేషించింది. లాడెన్‌ను పాకిస్ధానే దాచిపెట్టిందని అంతర్జాతీయంగా కొందరి నుండి ఎదురౌతున్న అనుమానాలకు పాకిస్ధాన్ సమాధానం చెప్పుకోవాల్సిన స్ధితిలో ప్రస్తుతం ఉంది.

పాకిస్ధాన్ గగన తలంలోకి అమెరికా హెలికాప్టర్లు అనుమతి లేకుండా చొరబడడం వలన పాకిస్ధాన్ సార్వభౌమాధికారానికి భంగం కలిగిందనీ, అందుకు నిరసనగా ప్రదర్శనలు శుక్రవారం ప్రదర్శనలు చేయాలని కొన్ని ముస్లిం పార్టీలు పిలుపునిచ్చాయి. ఆల్-ఖైదా, దాని ఇతర మిత్ర సంస్ధలపై అమెరికా చేస్తున్న యుద్ధానికి పాక్ మద్దతు ఉపసంహరించుకోవాలని కూడా అవి డిమాండ్ చేస్తున్నాయి.

వ్యాఖ్యానించండి