భారత ద్రవ్య విధానం సమీక్షలో రెపో, రివర్స్ రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేరకు ఆర్.బి.ఐ పెంచడంతో ప్రధాన షేర్ మార్కెట్ సూచికలు భారీగా నష్టపోయాయి. బోంబే స్టాక్ ఎక్ఛేంజి (సెన్సెక్సు) 463.33 పాయింట్లు (2.44 శాతం) నష్టపోయి 18,534.69 వద్ద క్లోజ్ కాగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజి 136.05 పాయింట్లు (2.39 శాతం) నష్టపోయి 5,565.25 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వరుసగా ఏడురోజుల పాటు నష్టపోవడం నవంబరు 2008 తర్వాత ఇదే మొదటిసారి అని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. లాభపడిన వారి కంటే నష్టపోయిన వారు ఐదు రెట్లుగా నమోదయ్యారు.
సాధారణంగా ఆర్.బి.ఐ ద్రవ్య విధాన సమీక్షలో 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) మేరకు పెంచడం గానీ తగ్గించడం గాని చేసేది. ద్రవ్యోల్బణం 9 శాతానికి చేరువలో ఉండడంతో దాన్ని నియంత్రించడానికి ఈ సారి 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది మార్కెట్ విశ్లేషకలు అంచనా వేసిన దానికంటే ఎక్కువ. అధిక వడ్డీరేట్లు కార్పొరేటు సంస్ధల ఆదాయాలను తగ్గిస్తుంది. అంటే షేర్ మార్కెట్ పెట్టుబడులకి తక్కువ ఆదాయం వచ్చే అవకాశం పెరిగింది. ఫలితంగా షేర్ల అమ్మకాల ఒత్తిడి పెరిగి అంతిమ షేర్ మార్కెట్ నష్టపోవడానికి దారి తీసింది. బ్యాంకుల వంటి ద్రవ్య సంస్ధలు భారీగా నష్టపోగా, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలూ భాగా నష్టపోయాయి.
ద్రవ్యోల్బణం పెరగడం, దాన్ని తగ్గించడానికి ఆర్.బి.ఐ వడ్డీ రేట్లు పెంచడం వలన ప్రజలపైన, ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలపై రెట్టింపు ప్రభావం (డబుల్ ఇంపాక్టు) పడుతుంది. ద్రవ్యోల్బణం పెరగడం అనేది అధీక ధరలకు సూచిక. ఆహార ధరలు, ఇంధనం ధరలు అడ్డూ, అదుపు లేకుండా పెరుగుతుండడం వలన పేద, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నది. దాంతో తమ వేతనాల్లో అధిక భాగం కడుపునింపుకోవడానికి మాత్రమే సరిపోవడం, పేదలకైతే దానిక్కూడా సరిపోకపోవడం జరుగుతోంది.
ద్రవ్యోల్బణం కట్టడి పేరున ఆర్.బి.ఐ వడ్డీ రేట్లు పెంచితే వాణిజ్య బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లు పెంచుతాయి. ఆర్.బి.ఐ నుండి అప్పు తీసుకోవాలంటే ఇప్పుడు బ్యాంకులు అదనంగా అర శాతం ఎక్కువ చెల్లించాలి. దాన్ని కవర్ చేసుకోవడానికి బ్యాంకులు ప్రజల డిపాజిట్లకు చెల్లించే వడ్డీ తగ్గించడమే కాక వారికిచ్చే అప్పులపై అధిక వడ్డీలు గుంజుతాయి. అధిక ఆహార, ఇంధన ధరలతో పాటు బ్యాంకుల అధిక వడ్డీల పోటు కూడా ప్రజకు భరించాల్సి ఉంటుంది.
ఇక ఈ రోజుల్లొ ప్రజలు డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం కంటే షేర్ మార్కెట్లలో మదుపు చేయడం పెరిగింది. ఉద్యోగులు తమ పొదుపు సొమ్మును షేర్ మార్కెట్లలొ పెడుతున్నారు. గ్రామాల్లో రైతులు గతంలొ సాటి రైతులకు చేబదులుగానో అప్పు పత్రం రాసుకునో అప్పులిచ్చే వారు. వాళ్ళు కూడా ఇప్పుడు షేర్ మార్కెట్లలో మదుపు చేస్తున్నారు. వారు నేరుగా చేయకపోయినా వారివద్ద వివిధ రూపాల్లో డిపాజిట్లు సేకరించే సంస్ధలు షేర్ మార్కెట్లలో మదుపు చేస్తున్నాయి. షేర్ మార్కెట్ సూచికల కదలికలు ఊహలకందని జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. దానితో షేర్ మార్కేట్లలో మదుపు చేస్తున్న డబ్బుకు లాభాలు తగ్గిపోవడం, లేదా అసలుకే నష్టం రావడం జరుగుతోంది.
ఇండియా షేర్ మార్కేట్లు వరుసగా ఏడోరోజు నష్టపోగా, ప్రపంచంలోని ఇతర ప్రధాన షేర్ సూచికలు నిన్నటి వరకు వరుసగ ఐదు రోజుల పాటు లాభాలను చవి చూశాయి. అక్కడ మదుపుదారులు లాభాల స్వీకరణకు దిగడంతో మంగళవారం షేర్లు నష్టపోయాయి. 2011 సంవత్సరం ప్రారంభమైనప్పటినుండీ ఇండియా షేర్ మార్కెట్లు బాగా నష్టాలను చవిచూస్తున్నాయి. ఎఫ్.ఐ.ఐలు భారీగా భారత షేర్ మార్కేట్లనుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి. ఎఫ్.డి.ఐలు కూడా తగ్గుముఖం పట్టాయి.
2010-11 సంవత్సరానికి భారత ఎగుమతులు 35 శాతం పైగా పెరుగుదలను నమోదు చేయడం ఒక్కటే ఊరట. ఎగుమతులు అంతపెరిగినా, వాటితో పాటు దిగుమతులు సైతం పాతిక శాతం వరకు పెరిగాయి. వాణిజ్య లోటు 104 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది దాదాపు గత సంవత్సరం తో సమానం. అంటే వాణిజ్యలోటు తగ్గించుకోవాలన్న లక్ష్యంలో మెరుగుదల ఏమీ లేదన్నమాట!

gud analisys
Thanks.