హాంకాంగ్‌లో మొట్టమొదటి సారిగా “కనీస వేతన చట్టం”


హాంకాంగ్‌లో మొదటిసారిగా కనీస వేతన చట్టం ప్రవేశపెట్టారు. 125 వ అంతర్జాతీయ కార్మిక దీక్షా దినోత్సవం రోజున హాంకాంగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌ను 1997 లో బ్రిటిష్ చేతినుండి చైనా ఆధీనంలోకి వచ్చింది. ప్రజాస్వామ్య బ్రిటన్ పాలనలో శ్రమ చేసే ప్రజలకు కనీస వేతన చట్టం లేకపోవడంతోటే బ్రిటన్‌కి ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న గౌరవం తెలుపుతోంది. ప్రజాస్వామ్య సంస్కరణలు అమలు చేయాలని ఈ బ్రిటన్ లాంటి దేశాలు చైనాను డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో, చైనా ప్రభుత్వమే కనీస వేతన చట్టం మొదటిసారి ప్రవేశపెట్టడం విచిత్రం.

హాంకాంగ్ చైనా ఆధీనంలోకి వచ్చినా అప్పట్లో చైనా ప్రభుత్వం “ఒక చైనా, రెండు వ్యవస్ధలు” అని ఓ గొప్ప (!) సూత్రాన్ని కనిపెట్టి హాంకాంగ్‌లో పెట్టుబడిదారీ వ్యవస్ధ కొనసాగుతుందని హామీ ఇచ్చింది. నిజానికి చైనాలో ఉన్నది కూడా పెట్టుబడిదారీ వ్యవస్ధే. హాంకాంగ్‌లో అది కొనసాగడమే వారికి కావాలి. కాకపోతే చైనా ప్రజల్లొ ఇంకా మావో పైన గౌరవం కొనసాగుతుండడం, చైనా ప్రభుత్వం అమలు చేస్తున్నది సోషలిస్టు విధానలేనని ప్రజలను మోసం చేస్తుండడంతో “ఒక చైనా, రెండు వ్యవస్ధలు” అని దిక్కుమాలిన సిద్దాంతం వల్లించారు.

కనీస వేతన చట్టం ప్రవేశపెట్టే అవసరం లేకుండా వ్యాపారస్ధులు, కంపెనీలే వాలంటరీగా కనీస వేతనాన్ని తమ ఉద్యోగులకు ఇవ్వాలని హాంకాంగ్ ప్రభుత్వం కోరింది. చట్టం ఉంటేనే లెక్క చేయని వాళ్ళు వాలంటరీ అంటే అమలు చేసే అవకాశమే లేదు. అదే జరిగింది కూడా. దానితో చట్టం చేయక తప్పలేదని ప్రభుత్వం ప్రకటించింది. చట్టం వలన అతి తక్కువ వేతనాలు పొందుతున్న 270,000 మంది వరకూ కనీస వేతనాలు పొందుతారని అంచనా వేస్తున్నారు. సంపంద పంపిణీలో ఉన్న తీవ్ర అంతరాలను పూడ్చమని ప్రజలూ, ప్రజాస్వామ్య ప్రియులనుండి ఒత్తిడి అధికం కావడంతో చట్టం చేయక తప్పింది కాదు.

సింగపూర్ తప్ప మిగతా అన్ని ఆసియా దేశాల్లో కనీస వేతన చట్టం అమలులో ఉందని బిబిసి తెలిపింది. అతి తక్కువ వేతనాలు పొందుతున్నవారు చట్టం ద్వారా గంటకు 28 హాంకాంగ్ డాలర్లు పొందుతారని తెలుస్తోంది. కార్మిక సంఘాలు గంటకు 33 హాంకాంగ్ డాలర్లు డిమాండ్ చేశాయి. వాలంటరీగా కనీస వేతనాలు అమలు చేయమన్నపుడు చాలా కంపెనీలు వర్కర్లను తీసేసి కొత్తవారిని పనిలోకి తీసుకున్నారు. ఈ పద్దతి ఇండియాలొ చాలా సాధారణంగా జరుగుతుంది. చట్టాలున్నా అవేమీ వారికి అడ్డుకావు. వాటిని అమలు చేసే వాళ్ళు కంపెనీలు, వ్యాపారస్ధుల దగ్గర లంచాలు తిని మిన్నకుండటం సర్వ సాధారణం. హాంకాంగ్ చట్టం వలన తమకు పెద్దగా ఒరిగిందేమీ లేదని అక్కడి వర్కర్లు చెబుతున్నారు.

కనీస వేతన చట్టానికి వ్యాపారులు, కంపెనీలు సహజంగానే విమర్శిస్తున్నారు. “కనీస వేతన చట్టం తేవడమంటే స్వేఛ్ఛా మార్కెట్ విధానం నుండి పక్కకు తప్పుకోవడమే” అని అవి గుండెలు బాదుకుంటున్నాయి. చిన్న కంపెనీలు దివాలా తీస్తాయని పెద్ద కంపెనీలు చెబుతున్నాయి. పోనీ చిన్న కంపెనీలను వదిలేసి పెద్ద కంపెనీలయినా స్వచ్ఛందంగా కనీస వేతనాన్ని ఇచ్చారా అంటే అదీ లేదు. చిన్న కంపెనీల పేరు చెప్పి తాము కూడా ఎగ్గోట్టాలని చూడ్డం. ప్రవేటు పెట్టుబడుదారులు కంపెనీలు పెట్టి ఇచ్చే ఉద్యోగాలు ఇలాగే ఉంటాయి. సాధ్యమైనంత తక్కువ జీతాలిచ్చి, సాధ్యమైనంత ఎక్కువ పని చేయించుకుంటాయి. అడిగితే స్వేఛ్ఛా మార్కెట్ అంటూ గోల. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఒక్క కంపెనీలు పెట్టే వారికి తప్ప అందులో పనిచేసే వర్కర్లకు కాదని ఇక్కడే అర్ధమవుతోంది.

వ్యాఖ్యానించండి