గడ్దాఫీని చంపడానికి మళ్ళీ నాటో దాడి, కొడుకు ముగ్గురు మనవళ్ళు మృతి


Attack on Gaddaafi home

గడ్డాఫీ నివాస భవనంపై నాటో మిసైళ దాడి

గడ్డాఫీని చంపడానికే కంకణం కట్టుకున్న నాటో దేశాలు మరోసారి లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ నివాస సముదాయంపై మిసైళ్ళతో దాడి చేశాయి. దాడినుండి గడ్డాఫీ తప్పించుకున్నప్పటికీ చిన్న కొడుకు సైఫ్ ఆల్-అరబ్ తో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయినట్టు లిబియా ప్రభుత్వం తెలిపింది. భవనంపై కనీసం మూడు మిసైళ్ళు ప్రయోగించారనీ, దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిన్నదనీ లిబియా ప్రభుత్వ ప్రతినిధి మౌసా ఇబ్రహీం తెలిపాడు. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే నాటో ప్రతినిధి ఛార్లెస్ బౌచర్డ్ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. తాము లిబియా ఆర్మీ కమాండ్ అండ్ కంట్రోల్ పై దాడి చేశామని అమాయక పౌరులు చనిపోవడం దురదృష్టకరమనీ ప్రకటించాడు. గడ్డాఫీని చంపడం మా ఉద్దేశ్యంకాదని పౌరులను రక్షించాలంటే ఈ దాడులు తప్పవనీ మరో అబద్ధపు కూత కూశాడు.

గడ్డాఫీని చంపడం తమ ఉద్దేశ్యం కాదని నాటో ప్రతినిధి చెబుతున్నా గడ్డాఫీ చంపదగ్గవాడేనని (లెజిటిమేట్ టార్గెట్) బ్రిటన్ రక్షణ శాఖ సెక్రటరీ లియామ్ ఫాక్స్, అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ రాబర్ట్ గేట్స్‌లు కొన్ని రోజుల ముందు ప్రకటించారు. లిబియా కమాండ్ అండ్ కంట్రోల్ పై దాడి చేయడానికే గడ్డాఫీ నివాసాలపై దాడి చేస్తున్నామని వారు నిస్సిగ్గుగా ప్రకటించారు. వారి దాడుల్లో పౌరులు చనిపోయినా పౌరుల రక్షణ కోసమే ఆ దాడులని ప్రకటించడానికి వాళ్ళేమాత్రం సిగ్గుపడడం లేదు. ప్రభుత్వాల మధ్య సంబంధాలు, వ్యాపారాలు అంటే వారి దృష్టిలో దురాక్రమణ దాడులు, గూఢచర్యం, ఊచకోత, హత్యాకాండ, నిర్బంధం, మోసం, నయవంచన… ఇవి మాత్రమే. తమ దురాగతాలను కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం వీరికి వెన్నతొ పెట్టిన విద్య.

తమ దుష్కృత్యాలు ప్రపంచ ప్రజనీకానికి తెలియకుండా ప్రతి భాషలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి రంగం లోనూ పత్రికలు, ప్రాపగాండిస్టులను వీరు నియమించుకున్నారు. ఇంటర్నెట్ కూడా అందుకు మినహాయింపు కాదు. వారు ఏ రూపంలోనైనా ఉండవచ్చు. బ్లాగర్లుగా అవతారం ఎత్తవచ్చు. కామెంటర్ల అవతారమూ ఎత్తవచ్చు. అగ్రిగేటర్ వెబ్ సైట్లలో జొరబడనూ వచ్చు. ఎవరైనా బ్లాగింగ్ ద్వారా నిజాలు చెప్పడానికి ప్రయత్నిస్తే పనికిమాలిన కామెంట్లు రాసి, దూషణలకు సైతం వెనకాడక పోవచ్చు. తద్వారా నిజాలు రాసేవారిని నిరుత్సాహ పరచడం వీరిపని. వీరి ఆయుధం వితండవాదమే. బ్లాగర్లను దూషణలతో రెచ్చగొట్టడం, ఈ మాత్రం ఉపయోగం లేని చర్చలకు దింపడం, ఆ ముసుగులో బ్లాగర్లను నిరుత్సాహ పరచడం వీరి డ్యూటీ. అమెరికా తదితర పశ్చిమ దేశాలకు చెందిన గూఢచార సంస్ధలు విసిరే ఎంగిలి మెతుకులు తింటూ సహ బ్లాగర్లపైనా, పాఠకులపైనా నిఘా పెట్టడం, నిరుత్సాహ పరచడం వీరి పని. అమెరికా నిజస్వరూపం బైటపడకుండా చేయడం వీరిపని. అందుకు ఎంతకైనా దిగజారతారు.

అటువంటి వంచకులను పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అన్ని దేశాల్లో ఏర్పరుచుకుంది. అమెరికా చేసే ప్రతి దుర్మార్గాన్నీ కప్పిపుచ్చుతూ దాని దోపిడీ విధానాలను, దురన్యాయాలను వివిధ దేశాల ప్రజలు తెలుసుకోకుండా అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా ప్రచారం చేయడంలో మునిగి ఉండే ఈ ప్రత్యేక జాతి పట్ల పాఠకులు, చదువరులు, బ్లాగర్లు జాగ్రత్తగా మసులుకోక తప్పదు. ప్రస్తుతం ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్, లిబియా దేశాలపై అమెరికా నాయకత్వంలోని ధూర్త దేశాలు దురాక్రమణ దాడులు చేయడాన్ని సమర్ధిస్తూ అనేక అబద్ధాలను ప్రచారంలో పెట్టాయి. ఆ దేశాల ప్రభుత్వాలు, అధికారులు, ప్రతినిధులే స్వయంగా అబద్దాలు చేప్పడంతో పాటు తమ తరపున ప్రపంచం నలుమూలలా ప్రచారం చేయడానికి ధూర్తులను నియమించుకున్నాయి.

ఓ పక్క ఇరాక్, ఆఫ్ఘనిస్ధాలలో చేస్తున్న దురాక్రమణ దాడులపై పశ్చిమ దేశాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. యుద్ధాల ఖర్చుల వలన ఆర్ధిక వ్యవస్ధలలో సంక్షోభాలు ఏర్పడి, సంక్షోభాల భారాన్ని పూర్తిగా ప్రజలపైనే వేస్తున్నారు. ఫలితంగా ప్రజలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. అకలి బారిన పడుతున్నారు. విద్యా సౌకర్యాలు ఖరీదైపోయాయి. నిత్యావసర సరుకులు అందుబాటులో లేవు. జీతాల్లో కోత, పెన్షన్‌లలో కోత, పన్నుల పెంపు, జీవన భృతి, నిరుద్యోగ భృతుల రద్దు… ఇవన్నీ ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధాలు మిగిల్చిన శిధిల ప్రపంచపు ఆర్తనాదాలు. ఇవేవీ దురాక్రమణ దేశాల ప్రభువులకు వినబడవు సరే. ఆక్రమణకు గురైన దేశాలకు పొరుగున ఉన్న దేశాలు దురాక్రమణలను వ్యతిరేకించాలి. ఆటవిక న్యాయం తగదని ఈసడించాలి. దానికి బదులు యుద్ధోన్మాదుల ప్రచార ప్రసార సాధనాలు ప్రచారం చేసే అబద్ధాలన్నింటినీ నమ్మి, కనీసం బుర్రపెట్టి ఆలోచించకుండా, నాలుగు పదాలు నేర్చుకుని వాగాడంబరం ప్రదర్శిస్తున్నారు మరికొందరు.

లిబియా భవిష్యత్తును నిర్ణయించుకునేది లిబియా ప్రజలే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు లాంటి ధూర్త రాజ్యాలు దశాబ్ధాల తరబడి పెంచి పోషించిన దేశ ద్రోహులు లిబియాలో చొరబడి కృత్రిమ తిరుగుబాటు సృష్టించగానే అది నిజమని నమ్మడానికి ముందు ఉచ్ఛనీఛాలు, నీతి నియమాలు, సామాజిక సూత్రాలు, మానవ హక్కుల నియమాలు, అంతర్జాతీయ న్యాయ సూత్రాల వెలుగులో ఆలోచించాల్సి ఉంది. ఈజిప్టు, ట్యునీషియా, సిరియా, బహ్రెయిన్, యెమెన్ దేశాల్లో ప్రజల ఆందోళనలు మన కళ్ళెదుట కనిపిస్తున్నాయి. ఊరేగింపులు, ప్రదర్శనలు, బైఠాయింపులు ఇవన్నీ ఫోటోల రూపంలో ప్రభుత్వాల, సంఘాల ప్రకటనల రూపంలో మనముందున్నాయి. కానీ లిబియా, ఐవరీ కోస్టు దేశాల్లో తిరుగుబాట్లని చెప్పడానికి ప్రజల పాత్ర కనిపించడం లేదు. అంతంత మహామహా వార్తా సంస్ధలు అన్నీ కేంద్రీకరించినా లిబియాలో ప్రజల పాత్రపై ఒక్క ఫోటో సంపాదించలేక పోయాయి. ఒక డాక్టరు ఫోన్లో చెప్పాడు, పేరు చెప్పడానికి ఇష్టపడని రెబెల్ చెప్పాడు అనే తప్ప తమ వార్తలకు రుజువులు ఇవ్వడంలో విఫలమవుతున్నాయి. అంత ఘోరం… ఇంత ఘోరం అని రాస్తూనే చివర్లో వీటిని ధృవపరచే ఇండిపెండెంట్ సోర్స్ మాత్రం లేవు అని రాస్తాయి. ఆ వార్తలో నిజం కనిపెట్టడానికి ఆ ఒక్క వాక్యం చాలదా?

గడ్డాఫీ నియంత. ఇంకా చెప్పాలంటే వెధవే కావచ్చు. కానీ ఇరాక్ మీద ఆయన దాడి చేయలేదే? ఆఫ్ఘనిస్ధాన్ మీద పది సంవత్సరాల నుండి యుద్ధం చేసి వేలమందిని చంపడం లేదే! నో-ఫ్లై జోన్ అనో, పౌరుల రక్షణ అనో బాంబులేసి ప్రజల్ని చంపడం లేదే. ఏ సాక్ష్యం దొరకని గడ్డాఫీని దుర్మార్గుడని నమ్ముతున్నాం సరే. అన్ని సాక్ష్యాలు కళ్లెదుట కనపడుతుంటే ఒబామా, కామెరూన్, సర్కోజీ లు జగద్రక్షకులు ఎలా అయ్యారు? ఇరాక్ మీద ఆంక్షలు విధించి అక్కడ ప్రజల్ని రాచి రంపాన పెట్టొచ్చు! పిల్లలకు పోషకాహారం దొరక్క లక్షలమంది రోగాలు రొష్టులతో చనిపోవచ్చు. ఇరాక్ ప్రజలకు చెందిన ఇరాక్ ఆయిల్ని అమెరికా కంపెనీలు జొరబడి దోచుకోవచ్చు. కాని ఇరాక్ సంపదను కాపాడు కోవడానికి దురాక్రమించిన అమెరికా సేనలను వెళ్ళగొట్టడానికి దేశభక్తియుత యుద్ధం చెయ్యకూడదు. చేస్తే వారు టెర్రరిస్టులు, మత ఛాందసవాదులు, తాలిబాన్లు, తురకలు, ఆల్-ఖైదాలు. బ్రిటిష్ వాడి దురాక్రమణకి వ్యతిరేకంగా వంద పైగా సంవత్సరాలు పోరాడిన భారతీయులు మనకు వీరులు, దేశభక్తిపరులు అయితే ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లను అక్రమించిన అమెరికా తదితర పశ్చిమ దేశాలపై పోరాడుతున్నవారు టెర్రరిస్టులు ఎలా అవుతారు? ఇంత చిన్న విషయాన్ని కూడా గమనించడానికి ఆలోచించలేని విధంగా మన మెదళ్ళు మొద్దుబారితే తప్ప మనం నిజాలు చూడలేమేమో?

వ్యాఖ్యానించండి