దురాక్రమణ సేనలపై వేసవి దాడులు మొదలుపెడతాం -తాలిబాన్


ఆఫ్ఘనిస్ధాన్‌ని ఆక్రమించిన అమెరికా, తదితర పశ్చిమ దేశాల దురాక్రమణ సేనలపై ఆదివారం నుండి తాజా దాడులు ప్రారంభిస్తున్నామని తాలిబాన్ ప్రకటించింది. దురాక్రమణ సేనలు, వారి గూఢచారులు, దురాక్రమణ దేశాల తొత్తు ప్రభుత్వ అధికారులు, వారి సైనికులపై దాడులు చేస్తామని తాలిబాన్ ప్రకటించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ జోడు టవర్లను విమానాలతో కూల్చింది ఆల్-ఖైదా మిలిటెంట్లేనని నిశ్చయించుకున్న అమెరికా ఆల్-ఖైదాని అంతమొందించే పేరుతో ఆఫ్ఘనిస్ధాన్ పై దురాక్రమణదాడి చేసిన సంగతి విదితమే. ఆల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకుంటామని వీరాలాపాలు పలికిన అమెరికా, ఇంతవరకు ఆ పని చేయనే లేదు. అసలు లాడెన్ విషయమే దానికి గుర్తున్నట్లు లేదు.

ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైన్యాన్ని ఉపసంహరిస్తానని వాగ్దానం చేసిన ఒబామా దానికి బదులు 30,000 మంది అదనపు సైన్యాన్ని ఆఫ్ఘన్ కి పంపాడు. వారి రాకతో తాలిబాన్ల కదలికలను గణనీయంగా కట్టడి చేశామని అమెరికా సైనికాధికారులు చెబుతున్నా పరిస్ధితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. సైన్యాన్ని బ్యారక్‌లలో నిలిపి మానవ రహిత డ్రోన్ విమానాలపైనే పశ్చిమదేశాలు ఆధారపడుతున్నాయి. డ్రోన్ విమానాలతో ఆఫ్ఘన్, పాకిస్ధాన్ పౌరులను చంపుతున్నాయి. దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న తాలిబాన్ టెర్రరిస్టు సంస్ధగా ముద్రవేసి ఆ పేరుతొ తన మిలట్రీ ఆక్రమణ విధానాలను యధేచ్ఛగా కొనసాగిస్తున్నది. ఆఫ్ఘనిస్ధాన్‌లో తిష్టవేసి ఎమర్జింగ్ ఎకానమీలుగా పరుగులు పెడుతున్న చైనాపై డేగకన్ను వేసి ఉంచడానికీ, ఇండియాలోని అపార వనరులను తన బహుళజాతి సంస్ధలకు దోచి పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నది.

తాజాగా దాడులు ప్రారంభించనున్న నేపధ్యంలో బహిరంగ స్ధలాల వద్ద గుమికూడవద్దని ఆఫ్ఘన్ పౌరులకు తాలిబాన్ విజ్ఞప్తి చేసింది. మిలట్రీ స్ధావరాలు, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వాధికారుల కాన్వాయ్‌ల నుండి దూరంగా ఉండాలని హెచ్చరించింది. విదేశీ దురాక్రమణదారులు దేశం విడిచి వెళ్ళేదాకా యుద్ధం కొనసాగుతుందని ప్రకటించింది. యుద్ధం తీవ్రమయ్యే కొద్దీ పాకిస్ధాన్ ప్రభుత్వానికీ, ప్రజలకు కూడా సమస్యలు తప్పవు.

వ్యాఖ్యానించండి