అరబ్ ప్రజా ఉద్యమాలకు మరో బోనస్. ఈజిప్టులోని మధ్యంతర ప్రభుత్వం గాజాతో ఉన్న రఫా సరిహద్దును శాశ్వత ప్రాతిపదికన తెరిచి ఉంచడానికి నిర్ణయించింది. పాలస్తీనా వైరి పార్టీల మధ్య ఊహించని విధంగా ఒప్పందం కుదరడానికి సహకరించిన ఈజిప్టు ప్రభుత్వం గాజా సరిహద్దును తెరవాలని నిర్ణయించడం అభినందనీయం. అయితే అరబ్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌తో కొనసాగుతున్న (అ)శాంతి ఒప్పందం కూడా రద్ధు చేసుకుంటే ఈజిప్టు ప్రభుత్వానికి ప్రపంచవ్యాపితంగా ప్రశంసలు అందుతాయి. కానీ అమెరికానుండి సంవత్సరానికి 1 బిలియన్ డాలర్ చొప్పున నలభై సంవత్సరాలపాటు సహాయం తీసుకున్న ఈజిప్టు సైనిక ప్రభుత్వం ఇజ్రాయెల్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అనుమానమే. ఇజ్రాయెల్‌తో ఒప్పందాన్ని కాపాడుకోవడానికే గాజా సరిహద్దును తెరవడానికి నిర్ణయించున్నారా లేదా అన్నది కాల క్రమంలోనే తెలియాలి.
గాజాను మూడు వైపులనుండీ ఇజ్రాయెల్ దిగ్బంధించింది. గాజా ప్రజలు హమాస్ నాయకత్వాన్ని కోరుకోవడమే వారు చేసిన తప్పిదం. హమాస్‌తో సంబంధం లేని కొన్ని మిలిటెంట్ గ్రూపులు ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ పై అడపాదడపా రాకెట్లు ప్రయోగిస్తున్నాయి. గాజానుండి ఏ దాడి జరిగినా దానికి హమాస్‌నే బాధ్యురాలిగా గుర్తిస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఒక పద్దతీ పాడు ఏమీ ఉండదు. ఇతరులకి నష్టం చేశయినా తన ప్రయోజనాలను కాపాడుకోవడం ఇజ్రాయెల్ రాజ్య విధానం. గాజా ప్రజలను హమాస్ నాయకత్వంనుండి దూరం చేయడానికి గాజాని దిగ్బంధనం కావించింది. ఇజ్రాయెల్ ఒప్పందం దరిమిలా ముబారక్ కూడా గాజాతో ఉన్న సరిహద్దును మూసివేశాడు. రఫా సరిహద్దు తెరవడంతో గాజా ప్రజలకు కొంత ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లభిస్తుంది. భవిష్యత్తులొ పాలాస్తీనా ప్రజల విముక్తికి కూడా ఈజిప్టు చర్యలు దోహదం చేయవచ్చు.
అరబ్ ప్రజా ఉద్యమాల నేపధ్యంలో ప్రపంచ దృష్టి లిబియా, సిరియాలపి కేంద్రీకృతమై ఉన్న పరిస్ధితిని ఇజ్రాయెల్ అనుకూలంగా వినియోగించుకుంటూ గాజాపై దాడులు చేస్తున్నది. గాజా పౌరులు సూడాన్‌లో కారులో వెళుతుండగా బాంబులేసి చంపింది. కారులో గాజాకు ఆయుధాలు రవాణా చేస్తున్నారని ఇజ్రాయెల్ కారణంగా చెప్పింది. గాజాపై బాంబుదాడి చేసి ఫుట్‌బాల్ ఆడుతున్న ముగ్గుర్ని చంపేసింది. వెస్ట్ బ్యాంకులో కొత్తగా సెటిల్‌మెంట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అమెరికా తదితర పశ్చిమ దేశాలు లిబియాపై దృష్టి పెట్టడంతో అదే అనువుగా పాలస్తీనాపై అక్రమాలకు ఇజ్రాయేల్ పూనుకుంది. అమెరికా ఆద్వర్యంలోని శాంతి చర్చలు అర్ధంతరంగా ముగియడం, అవి మళ్ళీ మొదలయ్యే సూచనలేవీ లేకపోవడంతో మహమ్మద్ అబ్బాస్ నేతృత్వంలోని ఫతాకూ, హమాస్ కీ మద్య ఎన్నికలపై ఒప్పందం కుదిరింది. వచ్చే సెప్టేంబరులొ పాలస్తీనా దేశ ఏర్పాటుకు ఐక్యరాజ్యసమితిని అబ్బాస్ ని కోరనున్నాడు. అది కూడా ఫతా, హమాస్ ల మధ్య సంబంధాల మెరుగుకు దోహద పడుతున్నది.
అమెరికా కనుసన్నల్లో మెలిగే ఈజిప్టు సైనిక ప్రభుత్వం పాలస్తీనా వైరి పక్షాల మధ్య సయూధ్య కుదిర్చడం, రఫా సరిహద్దు తెరవడం ఆశ్చర్యకరమే. ఇది దేనికి దారితీయబోతున్నదో అమెరికా, ఇజ్రాయెల్ ల స్పందనలబట్టి తెలియవచ్చు. ఇజ్రాయెల్ ప్రయోజనాల వైపునుండి చూస్తే ఈజిప్టు చర్యలు అవాంఛనీయమే. పాలస్తీనా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఒబామా ఇచ్చిన వాగ్దానం మేరకు ఇజ్రాయెల్, అబ్బాస్ నాయకత్వంలోని ఫతా ల మధ్య శాంతి చర్చలు జరగడానికి కృషిచేసినప్పటికీ ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల నిర్మాణాన్ని ఆపడానికి తిరస్కరించడంతో అవి ముందుకు సాగలేదు. సెటిల్మెంట్ల నిర్మాణాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ను ఇక కోరబోమని ఒబామా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఈజిప్టు ప్రభుత్వం చేత అనుకూల చర్యలను చేపట్టడం ద్వారా పాలస్తినాకు దగ్గర కావడం ఇజ్రాయెల్ కి పరోక్షంగా కొద్దిపాటి హెచ్చరికలు ఒబామా చేయదలిచాడని కొద్దిమంది విశ్లేషకులు భావిస్తున్నా, కాలక్రమంలోనె అది తెలియాల్సి ఉంది.
