యూరోజోన్ లోనూ దౌడు తీస్తున్న ద్రవ్యోల్బణం


Euro

Euro

17 యూరప్ దేశాల యూరోజోన్ లో ద్రవ్యోల్బణం మార్చి నెలకంటే మరికాస్త పెరిగింది. యూరోస్టాట్ అధికారిక అంచనా ప్రకారం యూరోజోన్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 2.7 శాతం నమోదు కాగా, అది ఏప్రిల్ నాటికి 2.8 శాతానికి పెరిగింది. మార్చితో పోలిస్తే ఏప్రిల్ పెరుగుదల స్వల్పంగా కనిపించినా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇసిబి) విధించుకున్న పరిమితితో పోలిస్తే ఎక్కువే. ఇసిబి అంచనా ప్రకారం ద్రవ్యోల్బణం 2 శాతానికి మించితే సమస్యలు తప్పవు.

ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండటానికి ఈ నెల ప్రారంభంలో ఇసిబి సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేటును సంక్షోభం తర్వాత మొట్టమొదటి సారిగా పెంచింది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత ఇసిబి సుదీర్ఘ కాలంపాటు వడ్డీ రేటును 1 వద్ద ఉంచింది. తద్వారా యూరోజోన్ దేశాలు సంక్షోభం నుండి బయట పడడానికి ద్రవ్యనిధులు అందుబాటులో ఉంచడానికి ఇసిబి ప్రయత్నించింది. జర్మనీ ఆర్ధిక వ్యవస్ధతో పాటు మరికొన్ని కూడా పుంజుకోవడంతో ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండటానికి వడ్డీ రేటును 1 శాతం నుండి 1.25 శాతానికి పెంచింది.

ద్రవ్యోల్బణం పెరగడంతో బ్యాంకు వడ్డీ రేటు మరోసారి పెరవచ్చని కొద్ది మంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ లాంటి దేశాలు అప్పు సంక్షోభం కారణంగా కఠినమైన పొదుపు చర్యలను పాటిస్తున్నాయి. పొదుపు చర్యల కారణంగా ఆ దేశాల జిడిపి కుచించుకుపోయే ప్రమాదం ఎలానూ ఉంది. వడ్డీ రేటు కూడా పెంచితే అవి ఆర్ధిక వృద్ధి సాధించడం మరింత కష్ట సాధ్యంగా మారుతుంది. ప్రస్తుతానికి మూడు దేశాలే ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల సాయాన్ని కోరినా వాస్తవానికి జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాలు కూడా పొదుపు విధానాలు పాటిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వడ్డీరేట్లు పెంచడం అంత సమర్ధనీయం కాదని మరికొందరు భావిస్తున్నారు.

ఏదేమైనా ద్రవ్యోల్బణం ఇప్పుడు చాలా దేశాలకు సమస్యగా మారించి. సంక్షోభాన్ని అధిగమించి అర్ధిక వృద్ధివైపు పయనించడానికి వివిధ దేశాలు అందించిన బెయిలౌట్ ప్యాకేజీలు, సరళతరమైన ఫిస్కల్ విధానాలు, అమెరికా గత సంవత్సరం ప్రారంబించిన 600 బిలియన్ డాలర్ల క్యూ.ఇ-2 (క్వాంటిటేటివ్ ఈజింగ్ – 2)… ఇవన్నీ కలిసి ఇప్పుడు ద్రవ్యోల్బణానికి దోహదం అవుతున్నాయని చెప్పవచ్చు.

వ్యాఖ్యానించండి