ప్రపంచ దేశాలపై తన ప్రయోజనాల కోసం బాసిజం చేసే అమెరికా, బహుశా మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఒత్తిడికి, విమర్శలకు లొంగింది. దాదాపు తొమ్మిది నెలల నుండి సొంత దేశీయుడినే నరక బాధలు పెడుతున్న జైలు అధికారులు విచారణా ఖైదీ “బ్రాడ్లీ మేనింగ్”ని సాలిటరీ కనఫైన్‌మెంట్ సెల్ నుండి బైటకు అనుమతించింది. వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ కి ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధాలకు సంబంధించిన డాక్యుమెంట్లను, యాభై సంవత్సరాల డిప్లొమాటిక్ కేబుల్స్ ను లీక్ చేశాడన్న ఆరోపణలపై బ్రాడ్లీ మేనింగ్ ని అమెరికా ఖైదు చేసింది. మానవ హక్కుల గురించి పాఠాలు బోధించే అమెరికా పాలకులు తమ నిజ స్వరూపం, తమ చీకటి రహస్యాలు బైటికి వచ్చాయన్న ఆగ్రహంతో అమెరికా దేశీయుడిపైనే అత్యంత దారుణంగా వ్యవహరించింది. ఐక్యరాజ్య సమితి ప్రతినిధి అనేక సార్లు ఒంటరిగా ఇంటర్వూ చేయాలని కోరినప్పటికీ అమెరికా ప్రభుత్వం నిరాకరిస్తూ వచ్చింది.
కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్న మానింగ్ ని అమెరికా ప్రభుత్వం ఒంటరిగా ఖైదు చేసింది. కదలికలకు ఏమాత్రం వీలుకాని చిన్న జైలుగదిలో, కటిక చీకటిలో మేనింగ్ ఇప్పటివరకూ గడిపాడు. రోజులో 23 గంటలపాటు సెల్ లోనే నిర్బంధించి రాత్రి సమయంలో పూర్తి నగ్నంగా పడుకోవడానికి మాత్రమే ఇప్పటివరకూ అనుమతించారు. రోజుకి కేవలం ఒక గంట మాత్రమే సెల్ నుండి బైటికి రావడానికి అనుమతించారు. ప్రపంచ వ్యాపితంగా తీవ్ర విమర్శలు వచ్చినా ఏ మాత్రం లెక్క చేయలేదు. చైనాలో ప్రజాస్వామ్య సంస్కరణల కొసం ఆందోళన చేస్తున్నవారిని జైలు పెట్టారన్న కారణంపై చైనా ప్రభుత్వాన్ని అంతర్జాతీయ వేదికలమీద విమర్శిస్తూ, తనను మాత్రం అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలనుండి మినహాయించుకుంది.
ఇన్నాళ్ళూ బ్రాడ్లీ మేనింగ్ ని చీకటిగదిలో, ఒంటరిగా రోజంతా నిర్బంధిస్తూ చిత్ర హింసలు పెడ్డడానికి కారణం ఉందని ప్రపంచ వ్యాపితంగా మానవహక్కుల సంఘాలు ఆరోపించాయి. వికీలీక్స్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ నేరుగా అమెరికా డిఫెన్స్ డిపార్టుమెంట్ కంప్యూటర్లను హాక్ చేసి డాక్యుమెంట్లు దొంగిలించాడని బ్రాడ్లీ మేనింగ్ చేత తప్పుడు సాక్ష్యం ఇప్పించడానికి అతనిని సుధీర్ఘకాలం పాటు అమెరికా మిలట్రీ జైలు అధికారులు చిత్ర హింసలు పెట్టారనీ హక్కుల సంస్ధలు ఆరోపించాయి. మేనింగ్ సుదీర్ఘ మానసిక, శారీరక నిర్ధారణలను పాస్ అయ్యాడని జైలు అధికారులు ప్రకటించారు. దానర్ధం సుదీర్ఘకాలం శారీరక, మానసిక హింసలను ఎదుర్కొని తాము అనుకున్న రిజల్టును రాబట్టామని జైలు అధికారులు చెప్పదలిచారా అన్నది బహుశా విచారణ క్రమంలో బైట పడుతుంది.
వర్జీనియాలో ఉన్న మెరైన్ జైలునుండి ఏప్రిల్ 20 న మార్చామని జైలు అధికారులు తెలిపారు. ప్రతి కొత్త ఖైదీపైన విధించే సుదీర్ఘ పరీక్షలను మేనింగ్ అధిగమించాడని ఫోర్ట్ లీవెన్‌వర్త్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ డాన్ డాన్ హిల్టన్ ని ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. “మేనింగ్ ఇతర ఖైదీల వలేనే చూస్తాము” అని డాసన్ తెలిపింది. ఇన్నాళ్ళూ ఇతర ఖైదీలను చూసినట్లుగా చూడలేదని పరోక్షంగా డాసన్ అంగీకరిస్తున్నదా? “మేం దృఢంగానూ, నిజాయితీగానూ ఉంటాము. జైలు సిబ్బందినీ, ఖైదీలనూ ఒకే విధమైన గౌరవంతో చూస్తాము” అని ఆవిడ తెలిపింది. మానింగ్ కొత్త గది 80 చదరపు అడుగుల వైశాల్యం ఉందనీ, మంచం, టాయిలెట్, సింక్, డస్క్&, స్టూలు ఉన్నాయంది. విజిటర్లు, ఉత్తరాలను కొత్త సెల్ అనుమతిస్తారని చెప్పారు. బ్రాడ్లీ మేనింగ్ ఇప్పటివరకూ ఏమేం కోల్పోయాడో ఈ విషయాలు ద్వారా తెలుస్తోంది.
