నాలుగు రోజులనుండి సిరియా ఆందోళనలపై అక్కడి ప్రభుత్వం స్పందిస్తున్న తీరును ఖండించడానికి భద్రతా సమితిలొ జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న ఆందోళనకారులపై సిరియా ప్రభుత్వం కాల్పులు జరుపుతున్నదనీ, వారితో చర్చలు జరిపేవిధంగా సిరియాపై ఒత్తిడి తేవడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. సమితి తీర్మానాన్ని అడ్డు పెట్టుకుని పశ్చిమ దేశాలు ఎంతకైనా తెగిస్తాయన్న విషయం లిబియా అనుభవం ద్వారా స్పష్టం కావడంతో సిరియాపై తీర్మానాన్ని ఇండియా, చైనా, రష్యా ప్రభుత్వాలు గట్టిగా తిరస్కరిస్తున్నాయి. ఈ మూడు దేశాలూ 15 మంది సభ్యులు గల భద్రతా సమితిలో సభ్యులుగా ఉండడం గమనార్హం. రష్యా, చైనా లకు వీటో అధికారం ఉన్న సంగతి విదితమే.
ఫ్రాన్సు, బ్రిటన్, జర్మనీ, పోర్చుగల్ దేశాలు సిరియా ఆందోళనలపై అక్కడి ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగించడాన్ని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని తయారు చేశాయి. దీనిని ఆమోదింపజేసుకోవడానికి దాదాపు నాలుగు రోజులనుండి చర్చలు జరుగుతున్నా భద్రతా సమితి సభ్యదేశాలు ఒక ఆంగీకారానికి రాలేక పోతున్నాయి. సిరియాలో నిర్బంధం అంతర్జాతీయ శాంతికి భంగకరం కాదని రష్యా గట్టిగా వాదిస్తున్నది. ఇండియా, చైనాలు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చనీ, భద్రతా సమితి తీర్మానం అంటే సిరియా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమేననీ వాదిస్తున్నాయి. లిబియా పౌరులను రక్షించడం కోసం లిబియాపై మిలట్రీ చర్యను కూడా ఈ మూడు దేశాలు వ్యతిరేకించాయి. కాని రష్యా, చైనాలు తమ వీటో అధికారాన్ని వినియోగించే బదులు ఓటింగ్ నుండి విరమించుకున్నాయి. ఇండియా కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు. దానితో భద్రతా సమితిలో లిబియా తీర్మానం ఆమోదం పొందడంతో, ఆ తీర్మానం పరిధిని అతిక్రమిస్తూ పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు గడ్డాఫీ ఇంటిపైనే బాంబులు వేస్తూ, ప్రభుత్వ సైనికులను కూడా చంపుతున్నాయి.
సిరియాలో ఆందోళనకారులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారనడాన్ని సిరియా అధ్యుక్షుడు బషర్ ఆల్-అస్సద్ ఖండించాడు. ఆందోళనకారులు ఆయుధాలు ధరించి భద్రతా దళాలపై దాడికి దిగుతున్నారని, అందుకే ట్యాంకులు దించవలసి వచ్చిందని ఆయన తెలిపాడు. ఆందోళనకు కేంద్రంగా ఉన్న డెరా పట్టణంలో ప్రభుత్వ బలగాలు ట్యాంకులతో పహారా కాస్తున్నాయి. ఆందోళనలు ప్రారంభమయ్యాక సిరియా ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రకటించింది. నలభై సంవత్సరాలనుండి అమలులో ఉన్న ఎమర్జెన్సీ చట్టాన్ని ప్రభుత్వం రద్ధు చేసింది. ఈజిప్టులో తిరుగుబాటు విజయవంతం అయిందని చెబుతున్నప్పటికీ అమెరికా మద్దతుతో అధికారం చేపట్టిన ఈజిప్టు మిలట్రీ ఇంతవరకూ ఎమర్జెన్సీ చట్టాన్ని రద్దు చేయలేదు. సంస్కరణల పేరుతో చర్యలన్నింటినీ ముబారక్, అతని కుటుంబంపై కేంద్రీకరించడం తప్ప ఈజిప్టు సైన్యం ప్రజలు డిమాండ్ చేసిన చర్యలకు ఇంతవరకు పూనుకోలేదు. అయినా బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీలు ఆ విషయంపై మాట్లాడవు.
