గడ్డాఫీని టార్గెట్ చేయాలంటున్న బ్రిటన్, చట్టవిరుద్ధమని లాయర్ల హెచ్చరిక


Liam Fox

బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ లియామ్ ఫాక్స్

“లిబియా ప్రభుత్వ కమాండ్ అండ్ కంట్రోల్ (గడ్డాఫీ) ను టార్గెట్ చెయ్యడం చట్టబద్ధమే” అని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ లియామ్ ఫాక్స్ ప్రకటించాడు. అయితే “గడ్డాఫిపైన గానీ, లిబియా ప్రభుత్వ సైన్యంపైన గానీ దాడుల చేయడానికీ, లిబియా తిరుగుబాటుదారులకు ట్రైనింగ్ ఇవ్వడానికీ ఐక్యరాజ్య సమితి తీర్మానం అనుమతి ఇవ్వలేదు. అలా చేస్తే చట్ట విరుద్ధం” అని బ్రిటన్ ప్రభుత్వ లాయర్లు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని కామెరూన్ కూడా లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తమ ఎం.పిలకు తెలిపాడు. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో సరైన అనుమతులు లేకుండా జోక్యం చేసుకున్నామనీ, ఆ దేశాలపై దాడులకు చెప్పిన కారణాలన్నీ అబద్ధాలేననీ ఇంగ్లండ్ ప్రభుత్వం నియమించిన చిల్కాట్ ఎంక్వైరీ కమిషన్ విచారణలో వెల్లడయిన నేపధ్యంలో లిబియాదాడికి వ్యతిరేకంగా ప్రభుత్వ లాయర్లు హెచ్చరిస్తున్నారు.

అయితే ఇరాక్ దాడికి ముందు బ్రిటన్ ప్రభుత్వ లాయర్ల హెచ్చరికలను టోనీ బ్లెయిర్ ప్రభుత్వం పక్కన పెట్టినట్లుగానే ఇప్పటి ప్రధానిగానీ, ఇతర అధికారులుగానీ ప్రభుత్వ లాయర్ల హెచ్చరికలను పట్టించుకునే పరిస్ధితిలో లేరు. ఇరాక్ దాడికి ముందు బ్రిటన్ విదేశాంగ శాఖకు అనుబంధంగా ఉన్న సీనియర్ లీగల్ ఎడ్వైజర్లు అందరూ ఇరాక్ దాడి అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా వ్యతిరేకమని హెచ్చరించారు. అయితే టోనీ బ్లెయిర్ ప్రభుత్వం వారి సలహాను ఆలకించడానికి బదులు “అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఇరాక్ పై దాడి చేస్తే ఎదురయ్యే పరిణామాలను వివరించండి” అని సలహా కోరినట్లుగా చిల్కాట్ కమిషన్ విచారణలో వెల్లడయ్యింది. అయితే చిల్కాట్ కమిషన్ కు చట్టబద్దత లేకపోవడంతో ఇరాక్ దాడికి కారకులైన వారిని శిక్షించే అవకాశం లేకుండా పోయింది.

బ్రిటన్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నదని ప్రభుత్వ లాయర్లు ముక్త కంఠంతో చెబుతున్నారు. బ్రిటన్‌కి చెందిన మిలట్రీ సలహాదారులు 12 మంది, లిబియా తిరుగుబాటుదారుల కేంద్రం బెంఘాజీలో ఉన్నారు. వీరు లిబియా తిరుగుబాటుదారులకు, బెల్జియంలోని నాటో కేంద్రానికీ మద్య టెలి కమ్యూనికేషన్ సంబంధాలను ఏర్పాటు చేయడంలో సఫలం చెందారు. అయితే లిబియా అంతర్యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనడం లాంటి పిచ్చి పనులేవీ చేయొద్దని నాటో కేంద్రం నుండి గట్టి హెచ్చరికలు అందాయి. నాటో సలహాదారుల వలే బ్రిటన్ లాయర్లు కూడా లిబియా తిరుగుబాటుదారులకు ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా భద్రతా సమితి తీర్మానం అంగీకరించదనీ, అంతర్యుద్ధంలొ ఒక పక్షానికి కొమ్ముకాసే అవకాశం ఆ తీర్మానం ద్వారా ఎవరికీ సంక్రమించ లేదనీ వారు బ్రిటన్ ప్రభుత్వానికి తెలిపారు. దానితో తిరుగుబాటుదారులకు ఆయుధ సాయం అందించడానికి బ్రిటన్ ప్రభుత్వం కొద్దిగా వెనకాడుతోంది.

లిబియా ఘర్షణలు ప్రారంభమైనప్పుడే భద్రతా సమితి చర్చించింది. 1970 తీర్మానం ద్వారా భద్రతా సమితి లిబియాపై ఆయుధ ఆంక్షలు విధించింది. గడ్డాఫీ, అతని కుటుంబానికి చెందిన విదేశీ ఎకౌంట్లను స్తంబింపజేసింది. కనుక విదేశాలేవీ లిబియాలోని రెండు పక్షాలకు ఆయుధాలు సరఫరా చేయడానికి వీలులేదు. అయినా సరే బ్రిటన్ శాటిలైట్ ఫోన్లను, సాయుధ తొడుగులను సరఫరా చేసింది. అవేవీ ఫ్రంట్ లైన్‌లో పోరాడుతున్న తిరుగుబాటు సైనికులకు అందజేయకుండా బెంఘాజీ వరకే పరిమితం చేశారని పోరాటంలో పాల్గొంటున్న వాలంటీర్లు ఆరోపించారు కూడా. ఖతార్ దేశం దాదాపు వెయ్యి కలష్నికోవ్ తుపాకులను సరఫరా చేసింది. అవేవీ ఇప్పుడు కనపడకుండా అదృశ్యమై పోయాయని తిరుగుబాటు బలగాలు నాటోకు ఫిర్యాదు చేశాయి. బెంఘాజీలో ప్రధానంగా ఇద్దర్ కమాండర్లు ఉన్నారు. వారిలో ఒకరు జనరల్ అబ్దల్ ఫతా యోనెస్ కాగా మరొకరు జనరల్ హెఫ్తా ఖలీఫా. వీరిరువురూ నేనంటే నేనే కమాండర్నని పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది.

“న్యాయంగా చూస్తే ఆ ప్రాంతంలో ఉన్న అరబ్ దేశాలు లిబియా తిరుగుబాటుదారులకు ట్రైనింగ్ ఇవ్వాలి. కనీ అరబ్ దేశాలేవి దానికి ఆసక్తి చూపడం లేదు. దానితో నాటో పై ఒత్తిడి పెరుగుతోంది. కానీ భద్రతా సమితి తీర్మానం అందుకు అనుమతి ఇవ్వలేదని తీర్మానం చదివితే అర్ధం అవుతుంది. కనుక మనకు మరొక తీర్మానం కావాలి. లేకపోతే ఉన్న తీర్మానాన్నే మనకు అనుగుణంగా అన్వయించుకోవాల్సిందే” అని ఓ సీనియర్ అధికారి చెప్పినట్లుగా ది ఇండిపెండెంట్ పత్రిక తెలిపింది. ఉన్న తీర్మానాన్ని తమకు కావలసిన రీతిలో అన్వయించుకుంటున్నారని బ్రిటన్ ప్రధాని, డిఫెన్సు సెక్రటరీ ల ప్రకటనల బట్టి స్పష్టమవుతోంది. రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుటిన్ లిబియా పౌరులను రక్షించే ముసుగులో గడ్దాఫీని చంపడానికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించాడు. “గడ్డాఫీని చంపడానికి ప్రయత్నించడం లేదని వీరు మొదట చెప్పారు. ఇప్పుడేమో, అవును, గడ్డాఫీని చంపాలనుకుంటున్నాం అని వీరే చెబుతున్నారు. వీరికా అధికారం ఎవరిచ్చారు? విచారణ జరిగిందా? ఈ మనిషిని చంపే హక్కును తీసుకున్నదెవరు?” అని పుటిన్ ప్రశ్నించాడు.

ఓ ఎం.పి కి ఇచ్చిన సమాధానంలో “ఆయుధాలు అందించబోమని మనం చెప్పడం లేదు. కాని అందుకింకా నిర్ణయం తీసుకోలేదు” అని కామెరూన్ పేర్కొన్నాడు. ఆ ఎం.పి “బురద ఎంత స్పష్టంగా ఉంటుందో ప్రభుత్వ విధానం కూడా అంత స్పష్టంగా ఉంది” అని వ్యాఖ్యానించాడు.

వ్యాఖ్యానించండి