ఇరాక్‌లోని అష్రాఫ్ క్యాంపులో నివసిస్తున్న పౌరులపై ఏప్రిల్ 8 తేదీన ఇరాక్ ప్రభుత్వ సైనికులు విరుచుకుపడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 34 మంది మరణించారు. ఆ తర్వాత విడుదలైన వీడియో ద్వారా ఇరాస్ సైన్యం ఉద్దేశ్యపూర్వకంగానే క్యాంపుపై దాడి చేసి కాల్పులు జరిపిందని స్పష్టమయ్యింది. సైనికులు తాపీగా పౌరులపై కాల్పులు జరపడం, తమ వాహనాలను వారిమీదుగా నడపడం వంటివన్నీ చూసిన వారికి అక్కడ ఉన్నవారిని చంపడానికే సైనికులు కాల్పులు జరిపారని స్పష్టమవుతుంది. ఈ ఘటన పట్ల లిబియా పౌరుల భద్రత గురించి గొంతు చించుకుంటూ లిబియా పాలకుడిని చంపడానికి బాంబులు వేస్తున్న అమెరికా గానీ బ్రిటన్, ఫ్రాన్సు లాంటి యూరప్ దేశాలు గానీ ఇంతవరకు నోరు విప్పలేదు. లిబియాలో “క్రైమ్స్ ఎగైనెస్ట్ హ్యూమానిటీ” పట్ల గగ్గోలు పెడుతున్న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాల్-కి-మూన్ కి ఇది మానవహక్కుల హరణగా కనిపించలేదు.
అష్రాఫ్ క్యాంప్ లో ఉన్నది ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేకులు. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుస్సేన్ ఈ అష్రాఫ్ క్యాంపును ఏర్పాటు చేశాడు. ఈ క్యాంపులో ఉన్న వారు అంతర్జాతీయ చట్టాల ప్రకారం, జెనీవా తీర్మానాల ప్రకారం రక్షితులుగా పదే, పదే అమెరికా, ఐక్యరాజ్యసమితి ల ద్వారా ప్రకటించబడినవారు. ఇరాక్ అధ్యక్షుడు అల్-మాలికి ఇరాన్ ప్రభుత్వానికి మిత్రుడు. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ ఇరాక్ అధ్యక్షుడు నౌరీ-ఆల్-మాలికితో చర్చలు జరిపాడు. ఘటనకు కొన్ని గంటలముందే ఆ క్యాంపులోనే ఉన్న అమెరికా సైనికులు అక్కడనుండి వెళ్ళిపోయారు. క్యాంపుకి కొద్ది దూరంలోనే అమెరికాకి చెందిన వైద్యసహాయ కేంద్రం ఉంది. ఈ కేంద్రానికి అష్రాఫ్ క్యాంపులో ఉన్న వారు పదే పదే విజ్ఞప్తి చేసినా వారు వెళ్ళలేదు. ఈ వాస్తవాలన్నీ ఏం చెబుతున్నాయి? అష్రాఫ్ క్యాంపులో జరిగిన హత్యాకాండ అమెరికా అనుమతితో, ఇరాక్ అధ్యక్షుడు మాలికి ఆదేశంతోనే జరిగాయని చెబుతున్నాయి.
ఈ హత్యాకాండ మానవతా వ్యతిరేక నేరం కిందికి వస్తుంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్ధ అధికారి నవీ పిళ్ళై “అంతమందిని చంపడాన్ని ఏ కారణం చెప్పి అయినా ఎవరూ సమర్ధించుకోలేరు” అని వ్యాఖ్యానించాడు తప్ప అది మానవతా వ్యతిరేక నేరమని (crime against humanity) గానీ, ఘటనపై విచారణ జరుపుతామని గానీ చెప్పలేకపోయాడు. ఇంతవరకూ సాక్ష్యాలేవీ సంపాదించలేని లిబియా ప్రభుత్వ సైనికులు జరిపిన కాల్పులపై కమిటీ వేసినట్లుగా సమితి మానవహక్కుల సంస్ధ ప్రకటించింది. మంచిదే, పౌరుల్ని ఎవరు చంపినా నేరమే. లిబియా ప్రభుత్వం ఈ కమిటీకి సహకరిస్తానని ప్రకటించింది కూడా. అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు లిబియా పౌరుల రక్షణ కోసమే లిబియా అధ్యక్షుడి నివాసంపైనా, ప్రభుత్వ సైనిక బలగాల పైనా వైమానిక దాడులు చేస్తున్నామనీ, గూఢచారులను దించామని, మిలట్రీ సలహాదారులను పంపామనీ, చివరికి సమితి విధించిన నిషేధాన్ని ఉల్లంఘించి మరీ ఆయుధాలు సప్లై చేస్తున్నామనీ… ఇవన్నీ లిబియా పౌరుల కోసమేననీ చెబుతున్నాయి. లిబియాపై చేసే ప్రతి ప్రకటనకు ముందూ వెనకా “లిబియా పౌరుల రక్షణ కోసం” అని మరిచిపోకుండా ప్రకటిస్తున్నాయి.
మరి అష్రాఫ్ క్యాంపులో ఉన్నది పౌరులు కాదా? ఇరాక్ ప్రభుత్వ సైనికులు యధేచ్ఛగా కాల్పులు జరిపి వారిని చంపడం మానవతా వ్యతిరేక నేరం కాదా? అష్రాఫ్ హత్యాకాండను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్, అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఫ్రాన్సు అధ్యక్షుడు సర్కోజీ, బ్రిటన్ ప్రధాని కామెరూన్ ఎందుకని ఖండించరు? పైగా ఆష్రాఫ్ క్యాంపులో ఉన్నవారు తాము తీవ్రంగా ఈసడించుకునే ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకులు కూడా కదా? శతృవుకి శతృవు మితృడన్న లోకోక్తి ఉండనే ఉంది కదా? హత్యాకాండకు కొన్ని గంటల ముందు అమెరికా సైనికులు అక్కడినుండి వెళ్ళిపోవడం, కొన్ని గంటలముందే అమెరికా డివెన్సు సెక్రటరీ పెట్రాస్, ఇరాక్ ప్రధానితో మంతనాలు జరపడం హాత్యాకాండలో అమెరికా పాత్రని రుజువు చేయడం లేదా? కనీసం హత్యాకాండ అనంతరం వైద్య సహాయం అందించడానికి కూడా బాధితులు అనర్హులా? అంటే పౌరుల్లో కూడా చంపదగ్గ పౌరులూ, చంపడానికి వీల్లేని పౌరులూ ఉంటారన్నమాట!
అష్రాఫ్ హత్యాకాండలో 26 మంది పురుషులు 8 మంది స్త్రీలు చనిపోయారనీ, 300 మంది గాయపడితే కనీసం 178 మందికి బుల్లెట్ గాయాలు తగిలాయని ఐక్యరాజ్య సమితి ధృవీకరించింది. దీనిపై అంతర్జాతీయంగా రావలసినంత స్పందన కూడా కరువయ్యింది. ఇలాంటి ఘటన జరగడం ఇది మొదటి సారి కాదు. 2009 సంవత్సరం జులై నెలలో కూడా ఇదే క్యాంపుపై ఇరాక్ ప్రభుత్వ సైన్యం దాడి చేసి జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించారు. అప్పుడు కూడా సంఘటన జరిగినప్పుడు పెట్రాస్ ఇరాక్‌లోనే ఉన్నాడు. అష్రాఫ్ క్యాంపుపై జరిగిన రెండు హత్యాకాండలకు పెట్రాస్ బాధ్యుడు. ఇతనిని అంతర్జాతీయ మానవహక్కుల చట్టాల ప్రకారం, 4వ జెనీవా సదస్సు తీర్మానాల ప్రకారం అంతర్జాతీయ న్యాయస్ధానం విచారించి శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. అమెరికా తాను చేసే యుద్ధ నేరాలకు, మానవ హక్కుల ఉల్లంఘనలకు శిక్ష ఖాయమని తెలిసే అంతర్జాతియ న్యాయ స్ధానం ఏర్పాటుకి ఆమోదం తెలుపుతూ సంతకం చేయలేదు. అమెరికా గనక ఐ.సి.సి ఏర్పాటుకు సంతకం చేసినట్లయితే ఐసిసి కి అమెరికా నేరాలపై విచారణ జరపడానికే కొన్ని యుగాలు పడుతుంది.
