బాంబుదాడిలో ఆఫ్ఘన్ ఆల్-ఖైదా నెం.2 మరణం -నాటో దురాక్రమణ సేనలు


Abdul Ghani

ఆత్మాహుతి దాడుల బాధ్యుడు అబ్దుల్ ఘనీ

అమెరికా నాయకత్వంలోని దురాక్రమణ సేనలు ఆఫ్ఘనిస్ధాన్ ఆల్-ఖైదా నెం.2 నాయకుడిని బాంబు దాడిలో చంపేశామని ప్రకటించాయి. ఆఫ్ఘనిస్ధాన్ లోని కూనార్ రాష్ట్రంలో రెండు వారాల క్రితం జరిపిన బాంబు దాడిలో ఆఫ్ఘనిస్ధాన్‌కి చెందిన ఆల్-ఖైదా సంస్ధకు నెం.2 నాయకుడిగా పేర్కొనదగ్గ “అబ్దుల్ ఘనీ” చనిపోయాడని అమెరికా నాయకత్వంలోని నాటో సేనలు తెలిపాయి. ఇతనిని అబు హాఫ్స్ ఆల్-నజ్ది అన్న పేరుతో కూడా సంబోధిస్తారు. సౌదీ అరేబియా దేశానికి చెందిన ఘనీ అనేక మంది అమెరికా సైనిక అధికారుల మరణానికి కారకుడని నాటో అధికారులు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్ధాన్‌ని ఆక్రమించిన నాటో సైనికులకు సహకరిస్తున్న స్ధానిక గిరిజనుల తెగల నాయకులను కూడా కొంతమందిని ఘనీ అంతమొందించాడని వారు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్ధాన్ ప్రజలకు అబ్దుల్ ఘనీ జాతీయోద్యమ నాయకుడు కాగా ఆక్రమిత సేనలకు మాత్రం శతృవు.

గత నెలరోజుల్లో దాదాపు 25 మంది ఆల్-ఖైదా మిలిటెంట్లను చంపినట్లు నాటో అధికారులను ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. అయితే ఈ వార్తను ధృవీకరించగల ఇండిపెండెంట్ సోర్స్ లేదని బిబిసి తెలిపింది. ఆఫ్ఘానిస్ధాన్‌లో ఇంకా 100 మంది ఆల్-ఖైదా మిలిటెంట్లు మిగిలి ఉన్నారని అమెరికా అంచనా వేస్తోంది. ఆఫ్ఘనిస్ధాన్ లోని కీలు బొమ్మ ప్రభుత్వాధిపతి హమీద్ కర్జాయ్ కి సన్నిహితుడుగా పేరుపొందిన తూర్పు ప్రాంత గిరిజన తెగల నాయకుడు మాలిక్ జరీన్ ను చంపడంలో ఘనీ పాత్ర ఉందని నాటో వర్గాలు తెలిపాయి. ఆల్-ఖైదా మిలిటెంట్ జరిపిన ఆత్మాహుతి దాడిలో జరీన్ తో పాటు పదిమంది సహచరులు చనిపోయారని అవి తెలిపాయి. అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియాకి చెందిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో అబ్దుల్ ఘనీ 23 వ వాడని కూడా ఆ వర్గాలు తెలిపాయి. సీనియర్ నాయకుడైన అబ్దుల్ ఘనీ ఆత్మాహుతి దాడులకూ, ఆర్ధిక వనరుల సేకరణకు బాధ్యుడిగా తెలుస్తోంది. ఇతని కోసం నాలుగు సంవత్సరాలనుండి నాటో సేనలు వెతుకుతున్నాయి.

ఇదిలా ఉండగా కాందహార్ జైలు నుండి తప్పించుకున్న తాలిబాన్ మిలిటెంట్ల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆఫ్ఘానిస్ధాన్ ప్రభుత్వాధికారులు తెలిపారు. 475 మంది తాలిబాన్ మిలిటెంట్లు పారిపోగా ఇప్పటికే 65 మందిని పట్టుకున్నామని వారు తెలిపారు. వచ్చే వేసవిలో పోరాటం తీవ్రం కానున్న నేపధ్యంలొ అంతమంది తాలిబాన్లు తప్పించుకోవడం నాటో సేనలకు పెద్ద దెబ్బగా భావించవచ్చు. రానున్న జులై నెలలో ఆఫ్ఘనిస్ధాన్ భద్రతా బాధ్యతలను ఆ దేశ సైన్యానికి అప్పగిస్తామని అమెరికా గతంలో ప్రకటించింది. పలు సంవత్సరాల పాటు సాగే సైనికుల ఉపసంహరణకు ఇది మొదటి అడుగు అని అమెరికా అధ్యక్షుడు ఒబామా తెలిపినప్పటికీ పూర్తిగా సైనికులను ఉపసంహరించుకునే ఉద్దేశాలు అమెరికాకి లేవని పలు సందర్భాల్లో వెల్లడయ్యింది. బ్రిటన్ అధికారులు మరో 30 సంవత్సరాలు ఆఫ్ఘానిస్ధాన్‌లో తమ సైనికుల ఉనికి కొనసాగుతారని గత నవంబరులో ప్రకటించారు.

వ్యాఖ్యానించండి