లిబియా పౌరుల్ని రక్షించే పేరుతో లిబియా ప్రభుత్వ సైనిక సంపత్తిని నాశనం చేసే పనిలో ఉన్న పశ్చిమ దేశాలు మళ్ళీ గడ్డాఫీని చంపే ప్రయత్నాలను తీవ్రం చేశాయి. గడ్డాఫీ నివాస భవనాలపై సోమవారం నాటో సేనలు శక్తివంతమైన బాంబులను ప్రయోగించాయి. లిబియాలో అంతర్యుద్ధానికి “కాల్పుల విరమణ ఒప్పందాన్ని” ప్రతిపాదిస్తూ వచ్చిన “ఆఫ్రికన్ యూనియన్” ప్రతినిధులతో చర్చించడానికి వినియోగించిన భవనం సోమవారం నాటి బాంబుదాడుల్లో బాగా ధ్వంసం ఐనట్లు వార్తా సంస్ధలు తెలిపాయి.
రీగన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో గడ్డాఫీని చంపడానికి అమెరికా ప్రభుత్వంతొ పాటు, కుతంత్రాల సంస్ధ సి.ఐ.ఏ కూడా అనేక ప్రయత్నాలు చేసాయి. కాని అవేవీ సఫలం కాలేదు. లిబియా పౌరులను రక్షించే నెపంతో లిబియాపై “నో-ఫ్లై జోన్” అమలు చేయడానికి రంగంలోకి దిగిన అమెరికా వాయుసేన మొట్టమొదట గడ్డాఫీ నివాస భవనం పైనే దాడులు చేసింది. పత్రికలతో మాత్రం “గడ్డాఫీని చంపే ఉద్దేశం మాకు లేదంటూ” ఒబామా ప్రకటించాడు. ఆ తర్వాత ప్రభుత్వ భవనాల జోలికి వెళ్ళనప్పటికీ సోమవారం నాటి దాడులతో గడ్డాఫీని చంపే ప్రయత్నాలను పశ్చిమ దేశాలు ప్రారంభించాయని చెప్పవచ్చు. లిబియా పౌరుల్ని రక్షించడం కోసమే ప్రభుత్వ భవనాలపైనా, అధ్యక్షుడి నివాస భవనాల పైనా దాడులు చేయవలసి వస్తున్నదని పశ్చిమ దేశాలు, వారి ప్రతినిధులు ఏ మాత్రం సిగ్గుపడవు.
ఈ నెలలోనే ఐవరీ కోస్టులో ఆ దేశ అధ్యక్షుడు జిబాగ్బో ఉన్న అధ్యక్ష భవనం పైకి ఫ్రాన్సు సైనికులతొ పాటు, ఐక్యరాజ్య సమితి శాంతి సైనికులు సైతం బాంబు దాడులు చేశాయి. ఐవరీ కోస్టు పౌరులను రక్షించడం కోసమే అధ్యక్షుడి భవనంపై దాడులు చేశామని సమితి సెక్రటరీ జనరల్ బాన్-కీ-మూన్ ప్రకటించాడు. ఫ్రాన్సు సేనలయితే అధ్యక్ష భవనం ప్రహరీ గోడను కూలదోస్తూ ట్యాంకులను నడిపించి కాంపౌండ్ లో ఉన్న భవనాలను నేలమట్టం చేసి అధ్యక్షుడు జిబాగ్బో ను అరెస్టు చేశాయి. కోకోవా పంటకు కేంద్రమైన ఐవరీ కోస్టులో తనకు అనుకూలుడైన ఒట్టోరాను గద్దెపై నిలపడానికి ఫ్రాన్సు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన అధ్యక్షుడిపై బలప్రయోగం చేసి అరెస్టు చేసేంతగా బరి తెగించింది.
పనామా, ఈజిప్టు, బహ్రెయిన్, యెమెన్ తదితర దేశాల్లో వలెనే ఆయిలు నిల్వలు ఫుష్కలంగా ఉన్న లిబియాలో కూడా తమ కీలు బొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పశ్చీమ దేశాలు కంకణం కట్టుకున్నాయి. దానికి అరబ్ దేశాల్లో వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలను అడ్డు పెట్టుకుని ‘తాము పెంచి పోషించిన లిబియా మాజీ సైనికోద్యోగి ద్వారా బూటకపు తిరుగుబాటును అమెరికా ప్రేరేపించింది’. ఈ విషయాన్ని అమెరికా ఆర్మీ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్స్ మైక్ ముల్లెన్ పరోక్షంగా అంగీకరించాడు కూడా. వాయు, నౌకా బలగాలతో లిబియాని దిగ్బంధించి గడ్డాఫీ సైనిక, ఆయుధ శక్తిని బాంబు దాడులతో 30 నుండి 40 శాతం వరకు నాశనం చేసినా, తిరుగుబాటుదారులు గడ్డాఫీ బలగాలను ఓడించలేక పోయాయి. దానితో గూఢచార సమాచారం కోసం సి.ఐ.ఏ ని దింపిన అమెరికా గడ్డాఫీ భవనాలపై బాంబు దాడులు చేసి అతనని చంపడానికి ప్రయత్నిస్తోంది.
అమెరికాకి చెందిన బహుళజాతి సంస్ధల ప్రయోజనాల కోసం, వాటి లాభాల కోసం అమెరికా ఎంతకైన బరితెగిస్తుందని దాని చరిత్ర చెబుతోంది. వియత్నాంలో చావు దెబ్బ తిన్నా అమెరికా పాలక వ్యవస్ధకు బుద్ధి రాలేదు. దాదాపు పది సంవత్సరాల నుండీ ఆఫ్ఘనిస్తాన్-పాకిస్ధాన్, ఇరాక్ లలో దురాక్రమణ యుద్ధాలు చేస్తున్నప్పటికీ వారు చెప్పిన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయారు. అనేక సంవత్సరాల పాటు రష్యా ఆక్రమణపై పోరాడి రష్యాను తరిమి కొట్టిన ఆఫ్ఘనిస్ధాన్ దేశం, అమెరికా, దాని మిత్ర దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. రెండు దురాక్రమణ యుద్ధాలతో ఆర్ధికంగా కుంగిపోయినప్పటికీ అమెరికా కళ్ళు తెరవలేదు. అనుభవాలనుండి పాఠాలు నేర్చుకోడానికి నిరాకరిస్తున్నది. లిబియాలో సైతం అమెరికా, ఫ్ర్నాన్సు, బ్రిటన్ తదితర ధూర్త దేశాలకు కుక్క చావు ఖాయం.
