దాదాపు నెలరోజులకు పైగా తాను స్ధాపించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కోమాలో ఉన్న సత్యనారాయణ రాజు ఉరఫ్ శ్రీ సత్యసాయి బాబా ఆదివారం తనువు చాలించారు. 86 సంవత్సరాల సాయిబాబా గుండెపోటుతో మరణించారని డాక్టర్లు ప్రకటించారు. ప్రపంచ వ్యాపితంగా మిలియన్ల మంది అనుచరులను, భక్తులను సంపాదించుకున్న సాయిబాబా యుక్త వయసులోనే తనకు తాను భగవంతుడిగా ప్రకటించుకున్నారు. అప్పటి నుండీ అనేక వివాదాలు ఆయన్ని చుట్టుముట్టినా ప్రభుత్వంలోని అత్యున్నత స్ధానాల్లో ఉన్నవారందరూ ఆయనకు భక్తులు కావడంతో ఆయన పై ఈగ సైతం వాలలేదు.
సత్యసాయి బాబా తనకు భక్తులు ఇచ్చిన కానుకలతో లక్షన్నర కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్ధాపించుకున్నాడు. 1926 నవంబరు 23 న జన్మించిన సత్యసాయి 1950 లో తన ఆశ్రమాన్ని ప్రారంభించాడు. 50 శాతం పైగా నిరక్ష్యరాస్యులున్న భారత దేశంలో తమను తాము భగవంతులుగా ప్రకటిస్తూ అనేకమంది బాబాలు, అమ్మలు ఆశ్రమాలు స్ధాపించి భక్తుల కానికలతో ధనవంతులయ్యారు. కానుకల ద్వారా వచ్చిన ధనంతో ఆశ్రమాలను అభివృద్ధి చేసుకుని కొన్ని సేవా కార్యక్రమాలను చేపట్టి అనేకమంది అభిమానాన్ని చూరగొన్నారు. భారత దేశంలో భగవంతుడిగా ప్రకటించుకున్నవారిలో సత్యసాయి బాబా కి అత్యధిక సంఖ్యలో అనుచరులు ఏర్పడ్డారు. సత్యసాయి కి విదేశాల్లో సైతం అనేక మంది భక్తులు, అనుచరులు ఉండటం విశేషం.
మార్చి 8, 1940 తేదీన పదిహేనేళ్ళ వయసులో తన అన్నయ్య శేషం రాజు తో ఉరవకొండలో ఉండగా సత్యసాయిని ఒక తేలు కుట్టడంతో అపస్మారక స్ధితిలోకి వెళ్ళాడనీ, కొద్ది గంటల తర్వాత స్పృహలోకి వచ్చాక అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందనీ అతని తల్లిదండ్రులు చెప్పినట్లు ప్రచారంలొ ఉంది. ఉన్నట్టుండి నవ్వడం, అంతలోనే ఏడ్వడం, తడుముకోకుండా చాలా సేపు మాట్లాడుతూ ఉండడం, మళ్ళీ అనేక గంటలు మౌనంగా గడపడం చేశాడు. తాను అప్పటివరకు నేర్చుకోని సంస్కృతంలో శ్లోకాలు చెప్పడం ప్రారంభించాడని చెబుతారు. అతని తల్లిదండ్రులు డాక్టరు దగ్గరకు తీసుకెళ్తే “హిస్టీరియా” గా తేల్చేశారు. తల్లిదండ్రులు అతనిని పుట్టపర్తికి తీసుకొచ్చాక భయంతో అనేక మంది డాక్టర్లకీ, గురువులకీ, మంత్రగాళ్ళకీ చూపించారు.
అదే సంవత్సరం మే 23 న సత్యసాయి తన కుటుంబ సభ్యులందరినీ పిలిచి గాల్లో నుండి విభూది, ఇతర పదార్ధాలను సృష్టించి చూపాడట. దెయ్యం పట్టిందని భావించిన అతని తండ్రి కర్ర తీసుకొని కోపంతో ఎవరు నీవని ప్రశ్నించడంతో “నేనే సాయి బా” (షిర్డి సాయిబాబా) అని చెప్పాడట. ఆ తర్వాత తనకు ఎవరూ ఏమీ కారనీ, తనకు ఇహలోక సంబంధాలు లేవనీ చెప్పడం మొదలు పెట్టాక మెల్లగా అనుచరులు కూడడం ప్రారంభమయ్యింది. కొద్ది కాలంలోనే దేశంలోని పుణ్యక్షేత్రాలు పర్యటించడం చేశాడాయన. ఆఫ్రికాలోని ఉగాండాకి కూడా వెళ్ళి బోధనలు చేసిన చరిత్ర ఉంది. చిన్నతనంలోనే డ్రామా, సంగీతం, నాట్యం, రచన ఇత్యాది కళల్లో ప్రతిభ కనబరచిన సత్య సాయికి కొన్ని నాటకాలు, కవితలు రాసిన చరిత్ర ఉంది.
గాల్లోని విభూది సృష్టించడం, బంగారు ఆభరణాలు, శివలింగాలు సృష్టించడం తదితర విద్యలతొ సత్యసాయి బాగా ప్రసిద్ధికెక్కాడు. అయితే హేతువాదులు కూడా ఈ విద్యలను ప్రదర్శించి అవన్నీ హస్తలాఘవానికి సంబంధించిన ట్రిక్కులని చెప్పినా సత్యసాయి భక్తగణం పట్టించుకోలేదు. పది పదిహేను సంవత్సరాల క్రితం డెక్కన క్రానికల్ ఫొటోగ్రాఫర్ ద్వారా ఒక రహస్యం వెల్లడయ్యింది. ఓసారి ఒక జూనియర్ ఇంజనీరుకి బంగారు గొలుసు సృష్టించి ఇచ్చారు సాయిబాబా. దానికి ముందు సాయిబాబా శిష్యుల్లో ఒకరు ఆ గొలుసుని ఒక పళ్ళెంకింద పెట్టి రహస్యంగా అందించడం డెక్కన క్రానికల్ ఫోటోగ్రాఫర్ చిత్రీకరించి పత్రికకు అందించాడనీ, అది పత్రికలో ప్రచురితం అయ్యి పంపిణీ జరిగే లోపు ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు ఒత్తిడి చేయడంతో ఆ పత్రిక వార్త ప్రచురించబడిన కాపీలను విరమించుకుని మళ్ళీ ఆ వార్త లేకుండా పత్రిక తెచ్చినట్లు కధనం ప్రచారంలో ఉంది. అప్పటికే ప్రచురించబడిన కాపీలు కొంతమందికి అందటంతో ఈ కధనం బయటపడింది.
అది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో సత్యసాయి మహిమలపై ఆశ్రమ వర్గాలు వివరణ అన్నట్లుగా ఒక ఆర్టికల్ రాశాయి. భక్తులను నమ్మించడానికి కొన్ని మహిమలు (ట్రిక్కులు) తప్పదనీ, భక్తులను ఆధ్యాత్మికంగా ఎడ్యుకేట్ చేయడానికీ, తద్వారా ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి సాయిబాబా చిన్న చిన్న మహిమలు చేశారనీ, ఆ చర్యల ఉద్దేశ్యం అంతిమంగా భక్తుల మేలు కోసమే తప్ప వేరొకందుకు కాదనీ ఆ వ్యాసంలో రాశారు. (ఈ బ్లాగరు ఆ వ్యాసాన్ని చదవడం తటస్ధించింది. 1987-88 కాలంలో ఈ సంఘటన జరిగింది) అయితే డెక్కన క్రానికల్ ఘటన, ఆంధ్రజ్యోతి వ్యాసం గురించి పెద్దగా ప్రచారంలోకి రాలేదు. వచ్చినా అప్పటికే ప్రపంచ ఖ్యాతి సంపాదించడంతో ఎవరు పట్టించుకునే అవకాశాలు కూడా లేవు.
సత్యసాయి పైన కాలక్రమంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అమాయక శిష్యులపై, కొంతమంది విదేశీయులపై లైంగిక వేధింపులు జరిపాడన్న ఆరోపణ కూడా వచ్చింది. (ఒక హాలండ్ దేశీయుడు తనను సాయిబాబా లైంగికంగా ఉపయోగించుకున్న విషయాన్ని తెలుపుతూ చిన్న పుస్తకం రాశాడు. 1998 ప్రాంతంలో మధురైలో కార్మిక సంఘ సభలు జరిగిన సందర్భంగా ఈ బ్లాగర్ ఆ పుస్తకం చదవడం తటస్ధించింది) ప్రశాంతి నిలయంలో చోటు చేసుకున్న హత్యలు కూడా సాయిబాబా ఆశ్రమం గురించి అనేక అనుమానలను రేకెత్తించాయి. తాజాగా సత్యసాయి ట్రస్టు ఆస్తుల కోసం బాబాని బందీగా మార్చిన వైనం, టన్నుల కొద్దీ బంగారాన్ని తరలించిన వైనం, ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడం… ఇవన్నీ సత్యసాయికీ, రాష్ట్రంలో, దేశంలో అత్యున్నత పదవులు చేపట్టిన ప్రముఖులకు ఉన్న సంబంధాల్లోని స్వఛ్ఛతను ప్రశ్నించేవే.
సాయి సమర్ధకులు సత్యసాయి ట్రస్టు తరపున జరిగిన ప్రజోపయోగమైన ధార్మిక కార్యక్రమాలను ప్రధానంగా ప్రస్తావిస్తారు. కానీ ఆయన ఆశ్రమంలో జరిగిన హత్యలపై నిష్పాక్షిక విచారణ జరగక పోవడం అనుమానాలు పెంచేదే తప్ప తుంచేది కాదు. టన్నుల బంగారం తరలిపోయిందని ఆరోపణలు వచ్చిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటాన్ని ప్రజలు ఎలా స్వీకరించాలో అర్ధం కాని విషయం. అనేక మంది ధనికులు ప్రశాంతి నిలయంలో తమ డబ్బుని దాచుకున్నారనీ, ఆదాయపు పన్ను, కస్టమ్స్ తదితర విభాగాల అధికారులు ప్రశాంతి నిలయమ్ జోలికి రావడానికి జంకడమే అందుకు కారణమనీ కూడా ఆరోపణలున్నాయి. ప్రశాంతి నిలయం ఒక పెద్ద మాఫియా కేంద్రమనీ, స్మగ్లింగ్ కార్యకలాపాలు యధేచ్ఛగా జరుగుతాయన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. వీటిని పట్టించుకొని విచారణ జరిపి ప్రజలకు నిజానిజాలు తెలిసే అవకాశాలు భారత దేశంలో ప్రస్తుతమయితే లేవు.
మా అమ్మగారు సత్యసాయిబాబా భక్తురాలే కానీ ఆవిడ అనుమానం ఏమిటంటే సత్యసాయిబాబా వారం రోజుల క్రితం చనిపోయి ఉంటాడు, ఆస్తి పంపకాలు సెటిలైన తరువాత అతని బంధువులు ఆ విషయం బయటకి చెప్పి ఉంటారు అని. ఇంత డబ్బు సంపాదించి చివరికి హాస్పిటల్‌లో బంధువుల నిర్లక్ష్యానికి గురయ్యాడు.
మీ అమ్మగారికి వచ్చిన అనుమానమే నాకూ వచ్చింది. ఆయన ప్రయాణం (ఇహ లోకాన) పూర్తయింది గనక మా అనుమానాలతో పనిలేదు. ఆస్ధి పంపకాలు అప్పుడే సెటిలై ఉంటాయా అప్పుడే! బహుశా అసంతృప్తి పరుల ద్వారా రహస్యాలు బైట పడవచ్చనిపిస్తోంది.