వరి, గోధుమ ఎగుమతులపై ఆశ చావని శరద్ పవార్


Food security 1

ఇదీ మన ఆహార భద్రత!

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కి వరి, గోధుమ ఎగుమతులపై ఆశ చావక మరోసారి నోరు విప్పారు. వరి, గోధమల ధరలు ప్రపంచ మార్కెట్ లో ఆశాజనకంగా ఉన్నాయని, నిల్వలు కూడా అధికంగా ఉన్నాయి కనుక ఎగుమతి చేయడానికి ఇదే సరైన సమయమని, ప్రభుత్వం వరి, గోధుమ ధాన్యాల ఎగుమతులకు అనుమతించాలని ఆయన పత్రికా ముఖంగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వంలో ఓ మంత్రిగా ఉంటూ, అందునా వ్యవసాయ మంత్రిగా ఉంటూ పత్రికాముఖంగా డిమాండ్ చేయడం ఓ వింత. కేబినేట్, పార్లమెంటులను వదిలి పత్రికల ద్వారా కోరడం శరద్ పవార్ కి ఇది మొదటి సారి కాదు. విదేశీయురాలంటూ సోనియా నాయకత్వంపై తిరుగుబాటు చేసి సోంత పార్టీ పెట్టుకున్న పవార్, విదేశాలకు ధాన్యం ఎగుమతి చేయాలని కోరుతున్నారు.

2007 సంవత్సరం నుండి వరుసగా మూడు సంవత్సరాలు భారత దేశంలో వర్షాలు సరిగా కురవక దేశంలొ కరువు పరిస్ధితులు ఏర్పడ్డాయి. దానితో కేంద్ర ప్రభుత్వం వరి, గోధుమ ల ఎగుమతులను నిషేధించింది. నిషేధించినా రాయబార మర్యాదల ఛానెల్ లో ఎగుమతులు చేస్తూనే ఉంది. గత సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. ఫలితంగా వరి, గోధుమలు బాగా పండి ఉత్పత్తి బాగా వచ్చింది. ఈ నేపధ్యంలో ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని గత జనవరిలోనే శరద్ పవార్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు.

గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని ప్రతిపాదించింది. యు.పి.ఏ-2 ప్రభుత్వం ఎన్నీకల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తానని వాగ్దానం చేసింది. దాని ప్రకారం పౌర సరఫరాల విభాగం ద్వారా ప్రజలకు ఇచ్చే సబ్సిడీ బియ్యం మొత్తాన్ని భారీగా పెంచవలసి ఉంది. దానికి కారణం ప్రభుత్వ పంపిణీ కింద 18.6 కోట్ల కుటుంబాలకు సబ్సిడీ ధరలకు ధాన్యం అందించాలని ప్రభుత్వం ముసాయిదా బిల్లులో ప్రతిపాదించింది. వీరికి ప్రభుత్వ పంపిణీ వ్యవస్ధ ద్వారా ధాన్యం అందించాలంటే 62 మిలియన్ టన్నుల ధాన్యం (వరి, గోధుమ కలిపి) అవసరమని ప్రభుత్వ అంచనా. కానీ ప్రభుత్వ గోడౌన్ లలో నిలవ సామర్ద్యం ఇంతకన్న తక్కువే ఉంది. ప్రస్తుత ఉత్పత్తి ప్రకారం తీసుకున్నా, ప్రజల అవసరాలకు సరిపడ నిలవ సామర్ష్యం ప్రభుత్వం గోడౌన్ లకు లేదు. దానితో పాటు వ్యవసాయక ఉత్పాదకతను పెంచితే తప్ప ప్రభుత్వ లక్ష్యం మేరకు ధాన్యం ఉత్పత్తి సాధ్యం కాదు.

ప్రతి నాలుగవ శిశువు పుట్టుకతో తక్కువ బరువుతో పుడుతున్నారనీ, తల్లులకు పోషకార లోపం ఉండడం దానికి కారణమనీ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ అంచనా. 5 సంవత్సరాల వయసు గల పిల్లల్లొ 45 శాతం మంది పోషకార లోపంతో బాధపడుతున్నారని కూడా ఆయన అంచనా వేశారు. 14 ఇన్నోవేషన్ యూనివర్సిటీలు స్ధాపించి ఇక మన దేశం ఇన్నోవేషన్ సూపర్ పవర్ అనుకోవడం సరికాదనీ, దేశం సంతోషంగా ఉండడానికి పోషకారం, విద్యలు అత్యవసరమని స్వామినాధన్ చెప్పిన పలుకుల్లో వాస్తవం ఉంది. ఇవన్నీ నెరవేరడానికి వ్యవసాయ ఉత్పాదకత పెంచడంతో పాటు, నిలవల సామర్ధ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

కాని ఓ పక్క నిలవ సామర్ధ్యం లేక ధాన్యాన్ని ఆరుబయట నిలవ నిలవ చేస్తున్న పరిస్ధితి ఉండగా దాన్ని అధిక ఉత్పత్తిగా చూపించి గిడ్డంగులు పొంగి పొర్లుతున్నాయి కనక ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని కోరడం వ్యవసాయ మంత్రి నిజాయితీ రాహిత్యాన్ని తెలుపుతోంది. మిల్లర్ల లాబీతో పెనవేసుకుని ఉన్న వ్యవసాయ మంత్రి ఎవరి ప్రయోజనాల కోసం ఎగుమతులకు డిమాండ్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఆరుబయట నిల్వ చేసిన ధాన్యం వర్షాలకు కుళ్ళి పోతున్నందున ఆకలి, దరిద్రాలతో బాధపడుతున్న పేదలకు ఉచితంగా పంచమని సుప్రీం కోర్టు సూచనను గత సంవత్సరం నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. శరద్ పవార్ తిరస్కరణపై కోర్టు ఆగ్రహించడంతో “కోర్టులు ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదని ప్రధాని మన్మోహన్ ప్రకటించి తాను ఎవరికోసం కుర్చీలో ఉన్నదీ తెలిపాడు. “మేం మాట్లాడుతున్నది ఆకలితో మాడుతున్న పేదల కడుపు నింపడం గురించే కానీ, అధికార పంపకాల గురించి కాదనీ ప్రధాని సైతం సుప్రీం కోర్టు చేత చీవాట్లు తిన్నాడు.

ఏనాడూ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడని మన్మోహన్, వ్యవసాయ శాఖకు మంత్రినని మరిచి కోట్లు కురిపిస్తున్న క్రికేట్ వెంట పరుగులు తీసే శరద్ పవార్ లు దేశ ప్రజలను ఉద్దరిస్తారను కోవడం భ్రమ. తాము పండిస్తున్న ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేక రైతులు, పెరుగుతున్న ఆహార ధరలతో కడుపు నింపుకోలేని అశేష పేద జనం కంటే మార్కెట్ తొ స్నేహం చేసే మన ప్రభుత్వాధిపతులు ఎగుమతులకు ప్రాధాన్యం ఇవ్వడంలో వింతలేదు. కాని ప్రజలకు హామీ ఇచ్చిన ఆహార భద్రతా చట్టం మేరకు ప్రజలకు ఆహారం అందుబాటులో ఉంచవలసిన అవసరం వారిపై ఉంది.

వ్యాఖ్యానించండి