టెర్రరిస్టులకు ఐ.ఎస్.ఐ మద్దతునిస్తోంది -అమెరికా మిలట్రీ ఛీఫ్


Anti US protests in Pak

పాకిస్తాన్ లో అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు

ఆఫ్ఘనిస్ధాన్ టెర్రరిస్టులకు పాకిస్తాన్ గూఢచారి సంస్ధ ఐ.ఎస్.ఐ రహస్యంగా మద్దతునిస్తోందని అమెరికా మిలట్రీ ఉన్నతాధికారి “మైక్ ముల్లెన్” సంచలనాత్మక ఆరోపణ చేశాడు. మైక్ ముల్లెన్ పాకిస్తాన్ మిలట్రీ అధికారులతో చర్చల నిమిత్తం ఇస్లామాబాద్ లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్ధాన్ మిలిటెంట్ల నాయకుడు జలాలుద్దీన్ హఖానీ నడుపుతున్న సంస్ధతో ఐ.ఎస్.ఐకి దీర్ఘకాలింగా గట్టి సంబంధాలు ఉన్నాయనీ ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులను చంపడంలో ఈ సంస్ధ నిమగ్నమై ఉందనీ ఆరోపించాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో టెర్రరిస్టు సంస్ధలుగా అమెరికా పరిగణించే సంస్ధలను ఐ.ఎస్.ఐ పెంచి పోషిస్తోందన్న విషయం దాదాపు బహిరంగమైన విషయమే. పాకిస్తాన్ ప్రభుత్వం గానీ, మిలట్రీ గానీ ఈ ఆరోపణలు ఖండించడం సర్వసాధారణం. టెర్రరిస్టు సంస్ధలతో ఐ.ఎస్.ఐకి లింకులున్నాయని అమెరికాకి తెలిసినప్పటికీ బహిరంగంగా ఆరోపించడం ఇదే మొదటిసారి.

సి.ఐ.ఏ ఏజెంటు రేయాన్ డేవిస్ పాకిస్తాన్ లో ఇద్దరు ఐ.ఎస్.ఐ గూఢచారులను కాల్చి చంపినప్పటినుండీ అమెరికా, పాకిస్ధాన్ ల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా దురాక్రమణకి వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్ధలు పాక్, ఆఫ్ఘన్ సరిహద్దుల వద్ద ఉన్న నార్ట్-వెస్ట్ ఫ్రాంటియర్ రాష్ట్రంలో స్ధావరాలు ఏర్పరుచుకుని ఉన్నాయి. ఈ స్ధావరాలను నాశనం చేయాలని అమెరికా పాకిస్తాన్ ని కోరుతోంది. అమెరికా కోరిక మేరకు పాకిస్ధాన్ సరిహద్దు రాష్ట్రాల్లొ మిలిటెంట్లను ఏరివేసే కార్యక్రమాలను కూడా గత సంవత్సరం చేపట్టింది. అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ సంస్ధలకు ఐ.ఎస్.ఐ సంబంధాలు కొనసాగాయి. అమెరికాకి చెందిన మానవరహిత డ్రోన్ విమానాలు పాకిస్ధాన్ భూభాగంపై బాంబు దాడులు చేసి అనేక మంది మిలిటెంట్లను, నాయకులను చంపాయి. వారితో పాటు వందలమంది పాకిస్ధాన్ పౌరులు కూడా డ్రోన్ దాడుల్లో చనిపోయారు. దానితో పాకిస్ధాన్ ప్రజల్లో అమెరికాపై విపరీతమైన ద్వేషం పెరిగింది.

రేయాన్ డేవిస్ వ్యవహారంతో పాకిస్తాన్ లో సి.ఐ.ఏ కార్యకలాపాల పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇద్దరు పాకిస్ధానీయులను చంపిన సి.ఐ.ఏ ఏజెంటును ఏ శిక్షా విధించకుండా వదిలిపెట్టడంతో పాకిస్ధాన్ ప్రజల ఆగ్రహం రెట్టింపయ్యింది. రేమండ్ డేవిస్ పాకిస్ధాన్ టెర్రరిస్టు సంస్ధ లష్కర్-ఎ-తొయిబా పై నిఘా పెట్టి సంస్ధలోకి చొచుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఐ.ఎస్.ఐ గూఢచారులు వెంటబడడంతో డేవిస్ వారిని చంపివేశాడు. తనను దోపిడీ చేయడానికి ప్రయత్నించడం వలన ఆత్మ రక్షణకోసం కాల్చానని డేవిస్ తెలిపినా పత్రికలు అసలు విషయాన్ని బైట పెట్టాయి. రాయబారులకు ఇచ్చినట్లుగా మినహాయింపు ఇచ్చి డేవిస్ ని వదిలిపెట్టమని అమెరికా డిమాండ్ చేసినా పాకిస్తాన్ 40 రోజులకు పైగా రిమాండులో ఉంచింది. డేవిస్ ను రిమాండు సమయంలో పోలీసులు విచారించారని తెలిసి అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి పాకిస్తాన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సి.ఐ.ఏ ఏజెంట్లను గణనీయంగా తగ్గించాలన్న ఒప్పందంపై మృతుల కుటుంబాలకు డబ్బులిచ్చి డేవిస్ ని అమెరికా విడుదల చేయించుకుంది.

సి.ఐ.ఏ సిబ్బంది తగ్గింపుపై పాకిస్ధాన్ అధికారులు చర్చలకోసం అమెరికాలో ఉన్నారు. ఇస్లామాబాద్ లో పాకిస్ధాన్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం మైక్ ముల్లెన్ ఐ.ఎస్.ఐ పై ఆరోపణలు చేశాడు. “ఆఫ్ఘనిస్దాన్ లో పోరాడుతున్న అమెరికా ఫైటర్లను చంపుతున్న తీవ్రవాదులకు హఖానీ నిధులు అందిస్తూ, శిక్షణను ఇస్తున్నాడు. అటువంటి హఖానీకీ, ఐ.ఎస్.ఐకి దీర్ఘకాలిక సంబంధాలున్న విషయం అందరికీ తెలుసు” అని మైక్ ముల్లెన్ పత్రికలతో అన్నాడు. “టెర్రరిస్టు సంస్ధలకు ఐ.ఎస్.ఐ ఇస్తున్న మద్దతు అత్యంత కీలకమైనది. ఇరు దేశాల సంబంధాల్లో ఇది చాలా కష్టమైన అంశం. పాకిస్తాన్ మిలట్రీ ఛీఫ్ జనరల్ కయానీ దృష్టికి ఐ.ఎస్.ఐ మద్దతు విషయం తీసుకెళ్తాను” అని ఆయన తెలిపాడు. అయితే ఐ.ఎస్.ఐ సీనియర్ అధికారి ముల్లెన్ ఆరోపణలను తిరస్కరించాడు.

పాకిస్ధాన్ విదేశీ కార్యదర్శి సల్మాన్ బషీర్ గురువారం అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటు అధీకారులతో చర్చలు జరపనున్నాడు. ఆఫ్ఘనిస్ధాన్ పై దురాక్రమణ చేయడమే కాకుండా వేలమంది పౌరులను చంపుతున్న అమెరికా సైనికులను టెర్రరిస్టులు చంపుతున్నారని అమెరికా మిలట్రీ అధికారి ఆరోపించడం, వారికి ఐ.ఎస్.ఐ మద్దతు ఇస్తున్నదని ఆగ్రహించడం అమెరికాకే చెల్లింది. పాకిస్దాన్, ఆఫ్ఘనిస్ధాన్ లు ఇరుగు పొరుగు దేశాలు. అవి కష్ట కాలంలో ఒకరినొకరు సహకరించుకోవడం సహజమైన విషయం. ఎక్కడినుండో వచ్చి ఆఫ్ఘనిస్ధాన్ ని దురాక్రమణ చేసి పౌరులను చంపుతుంటే పొరుగున ఉన్న పాకిస్ధాన్ చేతులు కట్టుకుని ఉండాలని డిమాండ్ చేయడం అమెరికా తెంపరితనం, దుర్మార్గం. అమెరికా దుష్ట దురాక్రమణను పాక్-ఆఫ్ఘన్ ప్రజలు తిప్పికొట్టి అమెరికా సైనికులను అరేబియా సముద్రంలో కలిపే రోజు ఎంతోదూరంలో లేదు.

వ్యాఖ్యానించండి