ఇరాక్ తరహాలో లిబియా దురాక్రమణకు ఏర్పాట్లు చేసుకుంటున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు


అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు ల త్రయం తమ ఉద్దేశాలను మెల్ల మెల్లగా బైట పెట్టుకుంటున్నాయి. లిబియా తిరుగుబాటుదారులకు మిలట్రి సలదారులను పంపించడానికి బ్రిటన్ నిర్ణయించింది. గడ్డాఫీకి ఆయుధాలు అందకుండా చేయడానికి మొదట ‘అయుధ సరఫరా’ పై నిషేధం విధించారు. ఆర్ధిక వనరులు అందకుండా లిబియా ప్రభుత్వానికి అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను స్తంభింప జేశారు. గడ్డాఫీ విమానదాడులనుండి లిబియా ప్రజలను రక్షించచే పేరుతో “నో-ఫ్లై జోన్” అన్నారు. ఆ పేరుతో లిబియా తీర ప్రాంతాన్ని విమానవాహక నౌకలతో కట్టడి చేశారు. అమెరికా, యూరప్ దేశాల సబ్ మెరైన్లు, యుద్ధ నౌకలు, ఫైటర్ విమానాల నుండి బాంబులు, మిస్సైళ్ళతో దాడులు జరిపారు. లిబియా ప్రభుత్వ మిలట్రీ స్ధావరాలు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, పోర్టులు, ఆయిల్ డిపోలు, ట్యాంకులు, ఆయుధ వాహనాలు, విమానాలు మొదలైనవాటిని చాలా వరకు నాశనం చేశారు. స్వతంత్రత, సార్వభౌధికారం కలిగిన లిబియా ప్రభుత్వ సైనికులపైన బాంబు దాడులు జరిపారు. అయినా అమెరికా-బ్రిటన్-ఫ్రాన్సుల దుష్టకూటమి ప్రవేశపెట్టిన తిరుగుబాటుదారులు ముందుకెళ్ళలేక కాలికి బుద్ది చెబుతూనె ఉన్నారు.

దానితో ఒబామా-సర్కోజీ-కామెరూన్ ల కూటమి ఇతర మార్గాలను వెతుకుతున్నారు. దానిలో భాగంగా అమెరికా సి.ఐ.ఏ గుంపును లిబియాలొ దించింది. బ్రిటన్ ఎం.ఐ-6 గుంపుని దించినా అరెస్టయ్యి అవమానకరంగా తిరిగి వచ్చారు. “ఆయుధాలు అందిస్తామని చెప్పడం లేదు. అలాగని ఆ అవకాశాన్ని తిరస్కరించడం లేదు” అని ఒబామా జార్జి బుష్ ని మించిపోయే దిక్కుమాలిన లాజిక్ లు చెప్పాడు. అమెరికా మనుషులు లిబియాలో దింపామని చెప్పకనే చెప్పాడు. వాయు, జల బలగాలతో సహాయం చేస్తున్నా లిబియా తిరుగుబాటుదారులు ముందడుగు వేయలేక పోతున్నారు. వారికి ఆయుధాలు అందించడానికి ఇతర దేశాలను ఒప్పించడానికి ఖతార్ దేశ రాజధాని “దోహా” లో పాతిక దేశాలతో కాన్ఫరెన్సు నిర్వహించారు. అయినా ఆయుధ సరఫరాకి ఏకాభిప్రాయం రాలేదు. జర్మనీ, టర్కీ, రష్యా, చైనా లను ఒప్పించి జర్మనీ బలగాలతో కూడా దాడులు చేయించడానికి బెర్లిన్ లో సమావేశం జరిపినా అవి ఒప్పుకోలేదు. అవి “నో-ఫ్లై జోన్” అమలుకి మీంచి ఒక్కడుగు వేసినా సమితి తీర్మానానికి వ్యతిరేకమని హెచ్చరించాయి.

ఇక ఇప్పుడు ఏకపక్షంగా తమ తమ సైనికులను లిబియా భూభాగంపై దించడానికి పధకాలు పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇరాక్ పై దురాక్రమణకు ముందు ఎన్ని అబద్ధాలు చెప్పాయో, తమ దేశాల ప్రజలను మోసం చేస్తూ ఎన్ని వంచనలకు పూనుకున్నాయో ఇప్పుడు వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పైకి తీస్తున్నాయి. లిబియా తిరుగుబాటుదారులకు సలహాలివ్వడానికి మాత్రమే తమ మిలట్రీ సలహాదారులను పంపిస్తున్నామనీ, లిబియా పౌరులను రక్షించడానికి అది అవసరమనీ బ్రిటన్ విదేశాంగ మంత్రి “విలియం హేగ్” నిస్సిగ్గుగా ప్రకటించాడు. ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే, దూడ మేతక’ న్నట్లుగా అతకని అబద్ధం చెప్పడానికి సైతం సిద్ధమయ్యాడు. గడ్డాఫీ బలగాలు లిబియా పౌరులను చంపుతున్నాయని ప్రచారం చేస్తున్న దుష్ట కూటమి వాస్తవానికి లిబియా తిరుగుబాటు బలగాలే పౌరులపై అరాచకాలకు పాల్పడుతున్న విషయాన్ని దాచిపెడుతున్నాయి. నలభై సంవత్సరాల పాటు అధికారం చెలాయించిన గడ్డాఫీపై అసంతృప్తి ఉన్నప్పటికీ పశ్చిమ దేశాల వరస వైమానిక దాడులతో లిబియా ప్రజానీకం అంతా గడ్డాఫీ వెనక నిలిచిన విషయాన్ని దాచిపెడుతున్నాయి. దేశంలో ఉండి పోరుచేస్తున్న గడ్డాఫీ కంటే విదేశీ సైనిక శక్తిని ఆహ్వానిస్తున్న తిరుగుబాటు బలగాలు దేశానికి ఎంత ప్రమాదకరమైనవో గ్రహించిన లిబియా పౌరులు వారిని ఈసడించుకుంటున్న సంగతిని దాచిపెడుతున్నాయి.

ఆయుధ సరఫరాలో భాగంగా బ్రిటన్ 400 బాడీ తొడుగులు, 400 శాటిలైట్ ఫోన్లు లిబియా తిరుగుబాటుదారులకు సరఫరా చేసింది. అత్యాధునిక ఆయుధాలు కూడా అందుతున్నాయని తిరుగుబాటు బలగాలు చెబుతున్నాయి. ఇప్పుడు గడ్డాఫీ వద్ద ఉన్న ఆయుధాలకు ధీటుగా తిరుగుబాటుదారులకు ఆధునిక అయుధాలున్నప్పటికీ వారు ఒక్క అడుగు సైతం ముందుకు వేయలేక పోతున్నారు. దానిక్కారణం గడ్డాఫీకి ప్రజలిస్తున్న మద్దతే. మహిళలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా గడ్డాఫీ బలగాలకు ఏదొ ఒక రూపంలో సహకారం అందిస్తున్నాయి. ఆయుధాల సరఫరా చేయడానికి కారణంగా తిరుగుబాటు దారుల వద్ద గడ్డాఫీ బలగాల ఆయుధాలకు తగిన ఆయుధాలు లేకపోవడంగా చెబుతున్నారు. కాని అనేక అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల జెట్లు, యుద్ధనౌకలు, సబ్ మెరైన్లు, అవి ప్రతిరోజూ జరుపుతున్న వందల దాడులు, వదులుతున్న వేల బాంబులు తిరుగుబాటుదారుల తరపునే చేస్తున్న సంగతిని అవి మర్చిపోయాయో, జనాల్ని మర్చిపొమ్మంటున్నాయో అర్ధం కాని విషయం.

ఇప్పటికే ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లు ఈ యుద్ధ పిశాచులకు గట్టి గుణపాఠం చెప్పాయి. ఇంకా చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధం గెలిచేది కాదని అమెరికా సైన్యమే అనేక సార్లు చెప్పినా బుద్ధి రావడం లేదు. ఈ సామ్రాజ్యవాద యుద్ధ పిపాసులకు మరో దెబ్బ లిబియా ప్రజలనుండి ఎదురుకాక తప్పదు.

వ్యాఖ్యానించండి