చైనా మరోసారి రిజర్వు రిక్వైర్ మెంట్ రేటును పెంచింది. ద్రవ్యోల్బణం రికార్టు స్ధాయిలో 5.4 శాతానికి చేరుకోవడంతో చైనా మార్కెట్ల్లొ చలామణీలో ఉన్న డబ్బును నియంత్రించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటివరకు 20 శాతంగా ఉన్న రిజర్వు రిక్వైర్ మెంట్ రేటును (ఆర్.ఆర్.ఆర్) 20.5 శాతానికి పెంచింది. వాణిజ్య బ్యాంకులు తాము సేకరించీన్ డిపాజిట్లలొ రిజర్వు డబ్బుగా అట్టి పెట్టవలసిన డబ్బు శాతాన్ని రిజర్వు రిక్వైర్ మెంటు శాతం అంటారు. ఇండియాలొ దీన్ని సి.ఆర్.ఆర్ (క్యాష్ రిజర్వు రేషియో) అంటారు.
ఆర్.ఆర్.ఆర్ ను అర శాతం పెంచడం ద్వారా 350 బిలియన్ యువాన్ల ధనాన్ని చలామణి నుండి వెనక్కి వస్తుందని చైనా సెంట్రల్ బ్యాంకు అంచనా వేసింది. తద్వారా బ్యాంకులు కస్టమర్లకు అప్పులు ఇవ్వగలిగే డబ్బు తగ్గిపోతుంది. దాని వలన డబ్బు మార్కెట్లో చలామణీ లో లేకుండా చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని కొంతమేరకు అరికట్టవచ్చన్నది చైనా సెంట్రల్ బ్యాంకు ఆలోచన.
ఆహార ధరలు పెరుగుతుండడం వలన చైనాలో ద్రవ్యోల్బణం హద్దులు దాటి పెరుగుతున్నది. మార్చి నెలలో ఆహార ద్రవ్యోల్బణం 11.7 శాతంగా నమోదయ్యింది. చైనాలో రియల్ ఎస్టేట్, ఇళ్ళ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి చైనా ప్రభుత్వం ఇప్పడి వరకు నాలుగు సార్లు బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది.
