పెట్రోలు దాహంలో చైనాతో పోటీ పడుతున్న ఇండియా


Anand Sharma an Mynbayev discuss agreement

ఇండియా, కజకిస్ధాన్ ల వాణిజ్య మంత్రుల సమావేశం (ఆనంద్ శర్మ, మిన్బాయెవ్)

అమెరికాతో  పెట్రోలు వనరుల కోసం చైనా పోటిపడడం ఇప్పటివరకూ తెలుసు. తాజాగా ఇండియా చైనాతో పోటీ పడుతున్న పరిస్ధితి నెమ్మదిగానే అయినా స్ధిరంగా తలెత్తుతోంది. అమెరికా దురాక్రమణ యుద్ధాలు చేస్తూ పెట్రోలు కోసం తెగబడుతుంటే, చైనా వాణిజ్య ఒప్పందాల ద్వారా, పెట్టుబడుల ద్వారా పోటీ పడుతోంది. ఇప్పుడు చైనా పద్ధతుల్లోనే ఇండియా కూడా ఆయిల్, గ్యాస్ వనరుల కోసం పరుగులు పెట్టడం మొదలు పెట్టింది.

తాజాగా కజకిస్ధాన్ ఆధీనంలోని పెట్రోల్ బావిలో భారత ప్రభుత్వం సంస్ధ ఓ.ఎన్.జి.సి పెట్రోలు వెలికి తీయడానికి కజకిస్తాన్ ప్రభుత్వ సంస్ధ కాజ్ మునై గ్యాస్ (కె.ఎం.జి) తో ఒప్పందం కుదుర్చుకుంది. కాస్పియన్ సముద్రంలొని సత్పాయెవ్ అనే ఒక పెట్రోల్ బ్లాకులొ నాలుగో వంతు వాటాను ఓ.ఎన్.జి.సి విదేశీ విభాగం ఓ.ఎన్.జి.సి విదేశీ లిమిటేడ్ (ఓ.వి.ఎల్) కొనుగోలు చేసింది. ఒప్పందం భారత ప్రధాని మన్మోహన్ కజక్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బయేవ్ లు పర్యవేక్షణలో జరిగినట్లు హిందూస్ధాన్ టైమ్స్ పత్రిక తెలిపింది. ఒప్పందం ప్రకారం సత్పాయెవ్ బ్లాకులొ ఆయిల్ వెతుకులాటకు అయ్యే ఖర్చంతా ఇండియా భరిస్తుంది. సంతకాల బోనస్ గా 80 మిలియన్ డాలర్లు (దాదాపు రు.370 కోట్లకు సమానం) కె.ఎం.జి కి ఇండియా చెల్లిస్తుంది. ఒప్పందం మొత్తం విలువ ఎంతో వెల్లడించలేదు.

కజకిస్ధాన్ ప్రధానంగా ముస్లిం దేశం. కోటి ఆరవై లక్షల జనాభా. భూభాగం జనాభా తో పోలిస్తే చాలా ఎక్కువ. ఫ్రాన్సు భూభాగం కంటే 5 రెట్లు ఎక్కువ. ప్రపంచ ఆయిల్ నిల్వల్లో దాదాపు 3 శాతం కజకిస్తాన్ లో ఉందని అంచనా వేశారు. కజకిస్ధాన్ ఉత్పత్తి చేస్తున్న ఆయిల్ లో పాతిక భాగం ఇప్పటికె చైనా కొనేసింది. ఇండియా కేవలం ఒక బ్లాకులో పాతిక భాగం కొన్నది. గతంలో ఇరాన్ నుండి ఆయిల్, గ్యాసులను పైపు లైన్ ద్వారా సరఫరా జరిగడానికి ఒప్పందం కుదిరినా, అమెరికా ఒత్తిడితో ఇండియా ప్రధాని మన్మోహన్ దాన్ని రద్దు చేసుకున్నాడు. పాకిస్తాన్ మీదుగా ఆ పైపు లైను వేయాలనుకున్నారు.

చైనా ఆయిలే కాకుండా ఇంకా చాలా సహజ వనరులను ప్రపంచ వ్యాపితంగా కొనుగోలు చేయడంలో దూకుడుగా ఉంది. ముఖ్యంగా ఆఫ్రికాలో ఇనుము, ఆయిలు లాంటి వనరులను కొని పెట్టుకుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే చైనా తన భూభాగంలో ఉన్న ఖనిజ వనరులను అట్టే పెట్టుకుని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టి వెలికితీయడం, కోనుగోలు చేయడం కోసం ఒప్పందాలు కుదుర్చుకుంది. లిబియాలో కూడా ఆయిల్ వనరుల వెలికితీతకు ఒప్పందాలు కుదుర్చుకుంది. అందుకే లిబియాపై దాడి ఖండించింది. కానీ లిబియాపై దాడి నిర్ణయం తీసుకునేటప్పుడు వీటో అధికారాన్ని వినియోగించలేక పోయింది. పశ్చిమ దేశాలతో ఉన్న విస్తృత వ్యాపార సంబంధాలే దానికి కారణం.

కజకిస్ధాన్ లో ఇండియా కొన్న బావిలో 250 మిలియన్ టన్నుల తో సమానమైన ఆయిల్ దొరుకుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక అంచనా తెలియలేదు. కజకిస్ధాన్ లో ఇంకా ఆయిల్ ఎక్స్ ప్లొరేషన్, అభివృద్ధి, ప్రాసెసింగ్ లలో మరింతగా సహకారం పెంపొందించడానికి ఇరుపక్షాలూ అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంటే మరిన్ని బ్లాకుల్ని ఇండియా కొనుగోలు చేసే అవకాశం ఉంది. దానితో పాటు అణు విద్యుత్ పై ఇండియా కేంద్రీకరించిన నేపధ్యంలో యురేనియం ఇంధనం అమ్మకం పై ఒప్పందం కుదిరే దశలో ఉన్నట్లు కజకిస్ధాన్ ప్రభుత్వం తెలిపింది.

కజకిస్ధాన్ లో యురేనియం అత్యధికంగా ఉత్పత్తి దేశం. ఇండియా విద్యుత్ ఉత్పత్తికోసం యురేనియం అమ్మకానికి గూడా ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నట్లు కజక్ అధ్యక్షుడు తెలిపాడు.. ఇండియా అణు విద్యుత్ ఉత్పత్తిని ఐదు రెట్లు పెంచాలనుకుంటోందని కజకిస్ధాన్ అధ్యక్షుడు నజర్బయేవ్ చెప్పడాన్ని బట్టి అలా భావించవచ్చు. 2014 సంవత్సరం లోపు సంవత్సరానికి 2000 టన్నుల యురేనియం ఇండియా కొనుగోలు చేస్తుందని నజర్బయేవ్ సూచించాడు. వాడిన ఇంధనాన్ని మళ్ళీ వాడే టెక్నాలజీపై త్వరలో ఒప్పందం జరుగుతుందని ఆయన చెప్పాడు.

వ్యాఖ్యానించండి