లిబియాలో గడ్డాఫీ బలగాలు పౌరులపై క్లస్టర్ బాంబులు ప్రయోగిస్తున్నాయని మానవహక్కుల సంస్ధ హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధ ఆరోపించింది. ఈ ఆరోపణలను లిబియా ప్రభుత్వం తిరస్కరించింది. క్లస్టర్ బాంబులుగా పెర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక కొన్ని ఫోటోలను ప్రచురించింది. పౌరుల నివాస ప్రాంతాల్లో క్లస్టర్ బాంబుల్ని పేల్చడం వలన మానవ నష్టం అపారంగా ఉంటుందనీ, గడ్డాఫీ ఈ బాంబుల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలనీ హక్కుల సంస్ధ డిమాండ్ చేసింది. అయితే న్యూయార్క్ టైమ్స్ విలేఖరికి కనిపించిన బాంబు శిధిలాలు గడ్డాఫీ బలగాలు పేల్చినవే అని నమ్మలేం. మిస్రాటాలో పశ్చిమ దేశాలు కూడా బాంబులు వేస్తున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాల గుంపు దురాక్రమణ దాడి జరిపినప్పుడు క్లస్టర్ బాంబులను విస్తృతంగా వినియోగించారు. అపారమైన ప్రాణ నష్టం వాటివలన సంభవించింది. క్లస్టర్ బాంబులతో పాటు అనేక కొత్త కొత్త ఆయుధాలను అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై ప్రయోగించి వాటి శక్తియుక్తులను ప్రయోగించింది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ప్రయోగించి చూపడం ద్వారా అమెరికా తన ఆయుధ మార్కేట్ ను పెంచుకుంది. క్లస్టర్ బాంబులను ప్రపంచంలో దాదాపు వందకు పైగా దేశాలు నిషేధించాయి.
అమెరికా క్లస్టరు బాంబుల దాడుల్లో జరిగిన అపార ప్రాణనష్టం గురించి ఇంతవరకు ఎవరూ అడిగిన పాపాన పోలేదు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లపై దాడులు చేసి దారుణమైన యుద్ధ నేరాలకు పాల్పడింది. వీటిపై అంతర్జాతీయ న్యాయ స్ధానంలో విచారించవలసి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు గడ్దాఫీ ప్రయోగిస్తున్నాడంటూ బ్రిటన్ కి చెందిన హ్యూమన్ రైట్స్ సంస్ధ యాగీ మొదలు పెట్టింది. పౌరులను ఎవరు చంపినా నేరమే. గడ్దాఫీ, జార్జి బుష్ అని వివక్ష చూపరాదు. కాని అంతర్జాతీయ రాజకీయాల్లో ఉన్నదే వివక్ష.
లిబియా భవిష్యత్తును లిబియా పౌరుల చేతుల్లో ఉంది. వారి చేతుల్లో నుండి లాక్కొని లిబియా భవిష్యత్తు తాము నిర్ణయిస్తామని అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు నిర్ణయించడమే చట్ట వ్యతిరేక చర్య. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పర్యవేక్షించాల్సిన ఐక్యరాజ్యసమితే లిబియాపై దాడులకు అనుమతి ఇవ్వడం ఇక్కడ అత్యంత విషాధం. గడ్దాఫీని గద్దె దింపి అక్కడి ఆయిల్, గ్యాస్ వనరుల్ని కొల్లగొట్టే పధకం మనసులో పెట్టుకొని లిబియా పౌరులు చనిపోతున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాయి పశ్చిమ దేశాలు.
క్లస్టరు బాంబుల ఫోటోలు ప్రచురించిందంటే న్యూయార్క్ టైమ్స్ విలేఖరి మిస్రాటా పట్టణం లోకి వెళ్ళినట్లె అర్ధం. మిస్రాటాలో గడ్దాఫీ బలగాలు పౌరుల ఇళ్ళపై దాడులు చేస్తున్నాయని పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. అటువంటి దాడులకు సంబంధించిన ఫోటోలను ప్రచురిస్తే ప్రపంచాని తెలుస్తోంది కదా. కాని అవి అలా చేయలేక పోతున్నాయంటే గడ్డాఫీపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని భావించాల్సి వస్తోంది. తమకు ఇష్టం లేని వారి మీద కట్టుకధలు చెపుతూ దుష్ప్రచారం చేసే పశ్చిమ దేశాలు గడ్డాఫీ పౌరులను చంపుతున్నాడనడానికి తగిన చిన్న సాక్ష్యం దొరికినా ఊరుకోవు. పెద్ద ఎత్తున యాగీ చేశ్తాయి. ఆ దృశ్యాన్ని అనేక కోణాల్లో ఫోటోలు తీసి అనేక చోట్ల దాడులు జరిగాయని చెప్పగలవు. అలాంటిది ఒక్క సాక్ష్యం కూడా అవి చూపలేక పోతున్నాయంటే, గడ్డాఫీపై పశ్చిమ దేశాలు చేస్తున ఆరోపణలు అవాస్తవమని ఎందుకు తేల్చకూడదు?
