
బినాయక్ సేన్ జైలు శిక్షకు వ్యతిరేకంగా శాన్ ఫ్రాన్సిస్కో (కాలిఫోర్నియా, అమెరికా) లోని ఇండియా రాయబార కార్యాలయం ముందు ఆందోళనకారుల ప్రదర్శన
సెడిషన్ ఆరోపణలపై యావజ్జీవ శిక్షను ఎదుర్కొంటున్న డాక్టర్ బినాయక్ సేన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ పై విడుదల చేసింది. “మనది ప్రజాస్వామ్య వ్యవస్ధ. ఆయన మావోయిస్టులకు సానుభాతిపరుడు మాత్రమే. అంతమాత్రాన ఆయనను సెడిషన్ ఆరోపణల కింద దోషిగా నిర్ధారించలేము. సానుభూతిపరుడు తప్ప అంతకంటే ఏమీకాదు” అని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కోంది. బినాయక్ సేన్ విడుదల వార్త తెలిస్తే ఆయన వైద్య సేవ చేసిన చత్తీస్ ఘడ్ లోని గిరిజన తెగల ప్రజలు పండగ చేసుకుంటారు.
బినాయక్ సేన్ కేవలం వృత్తిరీత్యా వైద్యుడు మాత్రమే కాదు. చత్తిస్ ఘడ్ గిరిజన ప్రజలతో పాటు నివసిస్తూ వారి సాధకబాధలను పట్టించుకున్న సామాజిక వైద్యుడు కూడా. మెడిసిన్ చదివినవారు కోర్సు ముగిశాక రెండు సంవత్సరాలపాటు గ్రామాల్లో వైద్యం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిబంధన పెడితే మెడికల్ విద్యార్ధులు ఆందోళన నిర్వహించిన నేపధ్యంలో జీవితమంతా నాగరికత అంతగా తెలియని గిరిజనుల మధ్య గడుపుతున్న బినాయక్ సేన్, వైద్యులందరికీ మార్గ దర్శకుడు. వైద్య వృత్తి పరమార్ధాన్ని తెలియజేసిన గొప్ప దార్శనికుడు.
అటువంటి బినాయక్ సేన్, జైల్లో ఉన్న మావోయిస్టుల నాయకుడు నారాయణ్ సన్యాల్ ఇచ్చిన ఉత్తరాలను బైట ఉన్న మావోయిస్టు పార్టీ నాయకులకు చేరవేస్తున్నాడన్న ఒకే ఒక్క సాకు చూపి, ప్రజలను రెచ్చగొడుతున్నాడన్న నేరారోపణ మోపి ఛత్తిస్ ఘఢ్ లోని కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఆయనకు యావజ్జీవ శిక్ష విధించారని తెలిసి భారత దేశం యావత్తూ నివ్వెరపోయిందనడంలో ఆశ్చర్యం లేదు. నారాయణ్ సన్యాల్ ఇచ్చిన ఉత్తరం వేరే వ్యక్తికి ఇవ్వమని ఇచ్చినదే. ఆయన నిజానికి ఆజ్గ్నాత జీవితం గడుపుతున్న వ్యక్తి కాదు. కాకుంటే బినాయక్ సేన్ కి ఇచ్చిన కవర్ లో మరో ఉత్తరం ఉంది. అది లోపల ఉన్న సంగతి తెలిసే అవకాశం బినాయక్ సేన్ కు లేదు. కేవలం ఆ ఒక్క సాక్ష్యం ఆధారం చేసుకుని ఆయనపై మోపిన రాజద్రోహం నేరాన్ని ధృవీకరిస్తూ ఇచ్చిన కింది కోర్టు తీర్పుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
ప్రపంచ వ్యాపితంగా అనేక మానవహక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు తీర్పుని తీవ్రంగా వ్యతిరేకించాయి. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. గిరిజనులకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ప్రపంచ స్ధాయి అవార్డు కూడా ఆయనకి ఇచ్చిన సంగతిని గుర్తు చేశాయి. తీర్పుపై
హైకోర్టు లో అప్పీలు చేసాక అక్కడ కింది కోర్టు చేసిన తప్పు సవరించబడుతుందని అందరూ భావించారు. కానీ బి.జె.పి కింద ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు అందుకు భిన్నంగా ఉండడంతో హైకోర్టు కూడా యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. హైకోర్టు లో హియరింగ్ కి వచ్చినపుడు ప్రపంచ వ్యాపితంగా అనేక సంఘాలు తమ ప్రతినిధులను పరిశీలకులుగా పంపించాయి. తీర్పు విన్నాక యావత్ప్రపంచమూ నిర్ఘాంతపోయింది.
భారత దేశంలోని కోర్టులు నిజాయితీగా ప్రజా సేవ చేసే వారి పట్ల కనబరిచే దృక్పధాన్ని బినాయక్ సేన్ ఉదంతం పట్టి చూపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కపాడియా వ్యక్తిగతంగా ఉన్నత విలువలకు కట్టుబడిన వాడు. ఆ నేపధ్యంలో బినాయక్ సేన్ కు బెయిల్ లభించందనే భావించాలి. ప్రజలకు చెందిన వనరులను ప్రవేటు కంపెనీలకు అప్పజెప్పడమే కాక కోర్టులో ప్రజల వనరులను కాజేసే విదేశీ బహుళజాతి సంస్ధల తరపున వాదించే వ్యక్తి హోం మంత్రిగా ఉన్న నేపధ్యంలో బినాయక్ సేన్ లాంటి వారిని జైలుకి పంపించడం ప్రజలు, అభ్యుదవాదుల దృష్టిలో అసాధారణం కావచ్చు గానీ, పాలకుల దృష్టిలో సాధారణ విషయమే.
బినాయక్ సేన్ గిరిజనులకు సేవ చేస్తున్న క్రమంలో బి.జె.పి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తున్న సల్వా జుడుం అనే నరహంతక సంస్ధ ఆకృత్యాలను వ్యతిరేకించాడు. మావోయిస్టులకు సానుభూతిపరుడుగా ఆయన సల్వా జుడుంను వ్యతిరేకించలేదు. అది గిరిజన ప్రజలపై సాగిస్తున్న హంతక చర్యలను చూసి తీవ్రంగా వ్యతిరేకించి దానికి వ్యతిరేకంగా తనకు తెలిసిన పద్ధతుల్లో పని చేశాడు. అదే బి.జె.పి నాయకత్వంలోని స్ధానిక భూస్వాములకూ, వారు చెప్పినట్లు నడిచే రాష్ట్ర ప్రభుత్వానికీ నచ్చలేదు. ఫలితంగానె బినాయక్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. గిరిజనుల తరపున ఎవరో ఒకరు పనిచేస్తుండగానే వారి పరిస్ధితులు ఇంత ఘోరంగా ఉన్నపుడు, ఎవరూ లేనప్పుడు వారు అనుభవించే కష్ట నష్టాలను ఊహించవలసిందే తప్ప రాయలేము.

బినాయక్ సేన్ కు సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడం సంతోషం. డెమొక్రటిక్ రైట్స్ కోసం పోరాడుతున్నవారు కోర్టు దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాల్సి రావడం బాధాకరం. మాఫియాలకు, దేశ ద్రోహులకు ఇది లైసెన్స్ రాజ్ అయ్యింది. డెమొక్రట్స్ కి డిక్టేటర్ షిప్ కంట్రీ అయ్యింది. …పిఆర్
అవును. ఛీఫ్ జస్టిస్ వ్యక్తిగతంగా కొన్ని నిబద్ధతలు ఉన్న వ్యక్తి. అందువలనే 2జి దర్యాప్తు సిబీఐకీ, ప్రభుత్వానికీ అప్పజెప్పకుండా సిబీఐ విచారణ సుప్రీం కోర్టు ఆధ్వర్యంలొ జరిగేటట్లు నిర్ణయించాడు. ఈ విచారణ జరగకుండా ఉండటానికి మంత్రులు తీవ్రంగా ప్రయత్నించినా కపాడియా పట్టుదలవలన నడుస్తోంది. ఆయన పోతే మళ్లీ ఇంకో కపాడియా వచ్చేదాకా మామూలు పరిస్ధితి ఏర్పడుతుంది. కామన్వెల్తు విచారణ, నల్లడబ్బు విచారణలో చిన్న కదలిక ఆయన వల్లనే.