విక్టర్ నీటో వెనిజులాకి చెందిన కార్టూనిస్టు. ఈ కార్టూను మొదట ఆయన బ్లాగులోనూ, తర్వాత మంత్లీ రివ్యూ పత్రిక ఇండియా ఎడిషన్ లోనూ ప్రచురితమయ్యింది.
సాధారణంగా ఏదైనా దేశంలో విప్లవాలు సంభవిస్తే వాటికి ప్రజల చొరవ ప్రధానంగా ఉంటుంది. అలా ప్రజల చొరవ ఉంటేనే ఏ విప్లవమైనా విప్లవం అనిపించుకుంటుంది. కానీ లిబియాలో గడ్డాఫీకి వ్యతిరేకంగా చెలరేగిందని చెబుతున్న విప్లవానికి సామ్రాజ్యవాద దేశాలయిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు నాయకత్వం వహిస్తున్నాయి. లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ సేనలు పౌరుల ఇళ్ళపైనా, ఆసుపత్రులపైనా బాంబులు కురిపిస్తున్నాయంటూ సామ్యాజ్యవాద దేశాలు చేస్తున్న ఆరోపణలకు ఒక్క సాక్ష్యం కూడా ఇంతవరకూ చూపలేదు, ఆ దేశాల ప్రభుత్వాధిపతుల చొప్పదంటు ప్రకటనలు తప్ప. గడ్డాఫీ బలగాలు తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న మిస్రాటా పట్టణాన్ని చుట్టుముట్టి ఇళ్ళమీదికి మోర్టార్లతో, ట్యాంకులతో దాడులు చేస్తున్నయని లేటెస్టుగా హిల్లరీ క్లింటన్ ప్రకటించి బాధపడింది. పనిలో పనిగా గడ్డాఫీని దించే వరకూ నిద్రపోయేది లేదని ప్రతిన కూడా పూనింది.
ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో ప్రజల చొరవతో ప్రారంభమైన విప్లవాలను పక్కదారి పట్టించడానికి జోక్యం చేసుకున్న సామ్రాజ్యవాద దేశాలు ఈజిప్టులో మాత్రం లేని తిరుగుబాటును సృష్టించడానికీ, తాము దింపిన కిరాయి విప్లవకారులు, ప్రభుత్వ సేనల దెబ్బకు పరారవుతుండడాన్ని తట్టుకోలేకా రంగం లోకి దిగాయి. కుట్ర, కుతంత్రాల పుట్ట అయిన సి.ఐ.ఏ ని అమెరికా రంగంలోకి దింపితే, లిబియాపై మరిన్ని దాడులు చేయాలని ఫ్రాన్సు, బ్రిటన్ లు కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతూ ఇతర దేశాలను బ్రతిమాలుతున్నాయి. యెమెన్, బహ్రెయిన్ ల నియంతలు అమానుషంగా ఉద్యమిస్తున్న ప్రజలను కాల్చి చంపుతుంటే వారిని పట్టించుకోకుండా లిబియా నేత గడ్డాఫీ లిబియా పౌరులను చంపుతున్నాడని నమ్మించడానికి నానా తంటాలు పడుతున్నాయి.
ట్యునీషియా, ఈజిప్టుల్లో ప్రజలు చీ కొట్టిన వారినే మళ్ళీ గద్దెపై కూర్చోబెట్టిన అమెరికా, ఫ్రాన్సులు లిబీయాలో కూడా తాము ఛీ అంటున్న గడ్డాఫీ తో కలిసి నిన్న మొన్నదాకా అధికారం పంచుకున్న మంత్రులనే లిబియా విప్లవ నాయకులుగా ముందుకు నెడుతున్నాయి. వారికి కావలసింది లిబియా ఆయిలూ, గ్యాసు తప్ప లిబియా పౌరుల క్షేమం ఎంతమాత్రం కాదు. సమితి తీర్మానం మెరకు నిషిద్ధ గగన తలం అమలు చేయడమే తమ పని అని లిబియా గగన తలంలోకి ప్రవేశించిన సామ్రాజ్యవాద దేశాల యుద్ధ విమానాలు ఆ పనిని దాటి లిబియా ప్రభుత్వ సైనికులపైనా, వారి అయుధ గిడ్డంగులపైనా దాడులు చేయడమే అందుకు తార్కాణం. మొదలు పెడ్డడంతోనె గడ్డాఫీ అధ్యక్ష నివాస భవనం పై దాడులతో ప్రారంబీంచిన అమెరికా విమానాలు గడ్డాఫీని చంపడం తమ లక్ష్యంకాదని ప్రకటించడం కన్నంలో వేలుతో దొరికినవాడి వ్యర్ధ ప్రేలాపనలే. ఆనక తాము సాయం చేయబోయిన సోకాల్డ్ తిరుగుబాటు సైనికుల వాహనాలపైనే దాడులు చేసి చంపి క్షమాపణ నిరాకరించడం వారి సామ్రాజ్యవాద అహంభావానికి పరాకాష్ట.
సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను సంరక్షించడమే తమ లక్ష్యం అన్న సంగతి ఐక్యరాజ్యసమితి లోని భద్రతా సమితి లిబియాపై దాడులకు అనుమతించడం ద్వారా మరోసారి నిరూపించుకుంది. ఐవరీ కోస్టు అధ్యక్ష భవనంపై దాడులు చేసి ఐవరీ కోస్టు ప్రజలనూ, లిబియా అధ్యక్ష భవనం పై దాడులు చేసి లిబియా ప్రజలనూ రక్షించడం ఎలా సాధ్యమో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఇంతవరకు వివరించలేదు. వివరిస్తాడన్న ఆశా అనవసరం. సామ్యాజ్యవాదుల ఆయిలు దాహం తీరడం అంటే బ్లాక్ హోల్ లోకి గ్రహాలు, పాల పుంతలనూ నెట్టడమే కదా! సామ్రజ్యవాద దేశాల అకృత్యాలను అంతం చేసే రోజు ఎప్పుడొస్తుందో కదా?
