ఒకరి దారుణాలను మరొకరు ఖండించుకోకుండా అమెరికా, సౌదీ అరేబియాల మధ్య అనైతిక ఒప్పందం సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ నిజం అరబ్ ప్రపంచానికి చెందిన వార్తా సంస్ధలకు ఎప్పుడో ఉప్పందింది. అరబ్, ముస్లిం ప్రపంచంలోని ప్రముఖ బ్లాగర్లు బైట పెట్టే వరకూ ఈ దారుణం ప్రపంచానికి తెలియలేదు. లిబియా పౌరులను గడ్డాఫీ సైన్యాలు చంపుతున్నాయంటూ కాకి గోల చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర పశ్చిమ దేశాలు బహ్రెయిన్, యెమెన్ ల ప్రభుత్వాధిపతులు అక్కడ జరుగుతున్న ఉద్యమాలపై క్రూర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నా పట్టించుకోవడం లేదని అనుకుంటున్నామే గానీ ఇంత దారుణానికి ఒడిగడతాయని ఊహించలేక పోయాం.
లిబియా ఆయిల్, గ్యాస్ వనరులపై కన్నేసిన అమెరికా, యూరప్ దేశాలు గడ్డాఫీని దింపడానికి తిరుగుబాటు పేరుతో ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. గడ్డాఫీ విమానాలు పౌరుల్ని చంపేస్తున్నాయనీ కొన్నాళ్ళూ, గడ్డాఫీ ట్యాంకులు ప్రజల ఇళ్ళపై కాల్పులు జరుపుతున్నాయని ఆ తర్వాతా ప్రచారం చేస్తూ వచ్చిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు ఐక్యరాజ్యసమితి చేత లిబియాపై “నో-ఫ్లై జోన్” అమలు చేయాలనీ, లిబియా పౌరులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలనీ 1973 వ తీర్మానాన్ని ఆమోదింపజేశాయి. ఈ తీర్మానానికి అరబ్ లీగ్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జి.సి.సి) లు సమితిలో ఓట్లు వేసి ఆమోదించాయి. ఖతార్ అయితే తన విమానాల్ని కూడా లిబియాపైకి పంపింది.
అరబ్ దేశమైన లిబియా పై దాడికి అరబ్ లీగ్, జి.సి.సి లు అభ్యంతరం చెప్పకుండా ఉండడానికి అమెరికా వీరితో దారుణమైన అనైతిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం సమితిలో 1973 తీర్మానానికి అరబ్ లీగ్, జి.సి.సి లు మద్దతు తెలుపుతాయి. అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక సంస్కరణల కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమాలపై అక్కడ రాచరిక ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపినా “ప్రజాస్వామ్యం పేరుతో” పశ్చిమ దేశాలు గావు కేకలు పెట్టకూడదు. అంటే పాశ్చాత్య దేశాలు వైమానిక దళాలతో బాంబు దాడులు చేసి లిబియన్లను చంపుతున్నా అరబ్ లీగ్, జి.సి.సి లు నోరు మెదపకుండా ఉంటాయి. బహ్రెయిన్, యెమెన్ తదితర అరబ్బు దేశాల్లొ ప్రజా ఉద్యమాలను అణచి వేయడానికి అక్కడి రాచరిక నియంతలు తమ ప్రజలపై అర్ధరాత్రి దాడులు చేసి చంపినా, ఊరేగింపులు, ప్రదర్శనలపై పోలీసులు విరుచుకుపడి కాల్పుల్లో చంపేసినా, పశ్చిమ దేశాలు కూడా ఈజిప్టు విషయంలో చేసినట్లుగా నామమాత్రపు అభ్యంతరాలేవీ చెప్పకూడదు.
ఒప్పందానికి తగినట్లుగానే బహ్రెయిన్, యెమెన్ దేశాల నియంతలు ప్రజస్వామిక సంస్కరణలను డిమాండ్ చేస్తున్న ప్రజా ప్రదర్శనలపై విచక్షణా రహితంగా పోలీసుల చేత కాల్పులు జరిపిస్తున్నాయి. ఇప్పటికే యెమెన్ లో వందలమంది చనిపోయారు. బహ్రెయిన్ లో ప్రదర్శనల దశ ఎప్పుడో దాటింది. పోలీసులు కూంబింగ్ పేరుతో ఇళ్ళపైబడి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా అరెస్టులు చేసి పట్టుకుపోతున్నారు. అరెస్టు చేసిన పౌరుల జాడ ప్రభుత్వం ఇంతవరకూ చెప్పలేదు. మనామాలో ఆందోళనలకు కేంద్రంగా ఉన్న “పెరల్ రౌండెబౌట్” లో ఉన్న 34 అడుగుల స్మారక చిహ్నాన్ని పోలీసులు మూడు వారాల క్రితం కూల్చి వేశాయి. కొన్ని చెడు విషయాలని గుర్తు చేస్తున్నందున కూల్చి వేశామని ప్రభుత్వం తర్వాత ప్రకటించింది. నిజానికి ఆ స్మారక చిహ్నం జి.సి.సి కూటమిని ప్రతిబింబిస్తూ నిర్మించారు. దానితో పాటు బహ్రెయిన్ ప్రజల పురాతన వృత్తి “సముద్రంలో ముత్యాల వేట” ను ప్రతిబింబించే చిహ్నం అది. ఇప్పటికి స్మారక చిహ్నం శిధిలాలు అక్కడే ఉన్నాయి.
ఇంకా ఘోరం ఏంటంటే సౌదీ అరేబియా, ఖతార్ దేశాలకు చెందిన సైన్యాలు, పోలీసులు బహ్రెయిన్ ఉద్యమాన్ని అణచడానికి పంపించాయి. ఇది పూర్తిగా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైనది. స్వతంత్ర దేశంపై దాడి చేయడంతో సమానం. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర దేశాలు ఇరాక్, అఫ్ఘనిస్తాన్ లపై చేసిన దురాక్రమణ దాడితో సమానం. కాకుంటే సౌదీ, ఖతార్ సైనికులు, పోలీసులను బహ్రెయిన్ అధ్యక్షుడు స్వయంగా ఆహ్వానించాడు. తమ ప్రజల ప్రజాస్వామిక ఉద్యమాలను అణచి వేయడం తమ పోలీసుల వల్లకావడం లేదు కనుక మీ సైనికుల్నీ, పోలీసుల్నీ పంపండి అని బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్-ఖలీఫా పలికిన ఆహ్వానం మేరకు అవి బహ్రెయిన్ లో అడుగు పెట్టాయి.
సౌదీ, ఖతార్ ల పోలీసులపై బహ్రెయిన్ రాజు పెట్టుకున్న నమ్మకాన్ని అవి వమ్ము చేయలేదు. బహ్రెయిన్ ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలందరినీ అరెస్టు చేశాయి. జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, బ్లాగర్లు… ఇలా కొంచెం చురుకుగా ఉంటారు అనుకున్న అందర్నీ అరెస్టు చేశాయి. వారు ఎక్కడుందీ జాడ లేదు. జాడ చెప్పడానికి పోలిసులు, ప్రభుత్వం నిరాకరిస్తున్నాయి. ఇంకా చాలామందిని నిర్బంధించి కాల్చి చంపాయి. అర్ధరాత్రి తీసుకెళ్ళి కొన్ని రోజుల తర్వాత వచ్చి శవం తీసుకెళ్ళండని వారి కుటుంబాలకు కబురు పంపిస్తున్నారు. లిబియాలో ఇలాంటి కార్యక్రమం లోనే ఉన్న గొప్ప ప్రజాస్వామిక దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు ఒప్పందం మేరకు తమ పనిలో నిమగ్నమై ఉన్నాయి.


లిబియాపై యుద్ధం ముమ్మాటికి అన్యాయం. ఇ.యు, అమెరికాల ఆయిలు, ప్రపంచాధిపత్యం ల వ్యూహంలో లిబియాను మరో ఇరాక్ గా చేస్తున్నారు. బహ్రెయిన్ సంఘటన వారి దురంతాలకు ఓ మచ్చు తున్నక. …పి.ఆర్, ఖమ్మం
అవును. ఆల్-ఖైదా ఉనికి పి.పి రాసినంతగా లిబియాలో కనిపించడం లేదు. అమెరికా నాయకత్వం నుండి తప్పుకుని నాటోకి అప్పజెప్పినా వాస్తవంలొ దాని కార్యకలాపాలే లిబియాలో ఫ్రాన్సు, బ్రిటన్ లంటే ఎక్కువగా కనబడుతున్నాయి.