పాకిస్తాన్ ప్రభుత్వం, ఐ.ఎస్.ఐ ల ఆదేశంతోనే ముంబై దాడులు -అమెరికా కోర్టులో హేడ్లీ, రాణాలు – 1


Tahawwur Hussain Rana

తహవ్వూర్ హుస్సేన్ రాణా

ముంబై లోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టు దాడులు పాకిస్తాన్ ప్రభుత్వం, దాని గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ ల ఆదేశమ్ మేరకే చేశామని అమెరికా కోర్టులో నిందితులు హేడ్లీ, రాణాలు సాక్ష్యం ఇచ్చినట్లు బయటపడడంతో సంచలనానికి తెర లేచింది. ముంబై టెర్రరిస్టు దాడుల్లో తాజ్ హోటల్ లో బస చేసిన దేశ, విదేశీ అతిధులు 200 మంది వరకూ మరణించిన సంగతి విదితమే. ముంబై దాడుల్లో పట్టుబడ్డ పాకిస్తాన్ యువకుడు కసబ్ కి కోర్టు మరనశిక్ష విధించింది. ముంబై దాడులకు పధక రచన చేసి, దాడులకు ముందు రెక్కీ నిర్వహించారని భావిస్తున్న హేడ్లీ రాణా లు వారిని విచారిస్తున్న వాషింగ్టన్ కోర్టులో ఈ సంచలన సాక్ష్యం చెప్పినట్లు బుధవారం బయటపడిన కోర్టు డాక్యుమెంట్ల ద్వారా వెల్లడయ్యింది. దీనితో పొరుగు దేశాలైన దాయాదుల మధ్య సంబంధాలు మరింత క్షీణించడం ఖాయం. క్రికెట్ వరల్డ్ కప్ పుణ్యమాని, క్రికెట్ దౌత్యం ఫలితంగా మెరుగుపడుతున్నట్లు కనిపించిన ఇండియా, పాకిస్తాన్ సంబంధాలు ఈ దెబ్బతో మఠాష్. దాడులకు కారణమని భావిస్తున్న లష్కర్-ఎ-తొయిబా కు దాడులతో సంబంధం లేదని రాణా చెప్పడం ఈ కధకు కొసమెరుపు.

కసబ్ అసలు పాకీస్తాన్ దేశస్ధుడే కాదని పాకిస్తాన్ మొదట తప్పించుకో జూచింది. అమెరికా ఒత్తిడితో ముంబై దాడులపై విచారణకు పాకిస్తాన్ అయిష్టంగానే ఒప్పుకుంది. ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే టెర్రరిస్టు దాడులకు ఆదేశాలిచ్చిందని నిందితులు చెప్పడం వలన అమెరికా, పాకిస్తాన్, ఇండియా లమధ్య సంబంధాల్లో తీవ్రమైన మార్పులు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేము. తహవ్వూర్ హుస్సేన్ రాణా ముంబై దాడులకు అవసరమైన మందుగుండు సమకూర్చాడని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. చికాగో కోర్టులో తదుపరి ట్రయల్ జరగనున్న నేపధ్యంలో ఇల్లినాయిస్ ట్రయల్ కోర్టులో హేడ్లీ, రాణాలు ఇచ్చిన సాక్ష్యానికి సంబంధించిన పత్రాల్లోని సమాచారం పరోక్షంగా వెల్లడయ్యింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశం మేరకు ముంబై దాడులు జరిగాయి కనక, ఇండియాలో పాకిస్తాన్ ప్రయోజనాలు పరిరక్షించుకునే హక్కు ఐ.ఎస్.ఐ కి ఉంది కనుక తనకు భారత దేశ చట్టాలనుండి మినాయింపు ఇవ్వాలని రాణా డిఫెన్సు వాదన ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దేశస్ధుడు హేడ్లీ కూడా తనను విచారిస్తున్న సందర్భంగా ఐ.ఎస్.ఐ ఆదేశం మేరకు తాను రెక్కీలో పాల్గొన్నట్లు గ్రాండ్ జ్యూరీ ముందు సాక్ష్యం ఇచ్చాడు.

పాకిస్తాన్ లో సి.ఐ.ఏ సిబ్బందిని గణనీయంగా తగ్గించాలన్న పాకిస్తాన్ ఆర్మీ అధిపతి డిమాండ్ ను అమెరికా ప్రభుత్వానికి తెలియజేయడానికి వచ్చిన ఐ.ఎస్.ఐ అధిపతి అహమ్మద్ షుజా పాషా, కోర్టు డాక్యుమెంట్లు వెల్లడయిన విషయం తెలుసుకుని హడావుడిగా పాకిస్తాన్ వెళ్ళే విమానం ఎక్కేశాడని వార్తా సంస్ధలు తెలుపుతున్నాయి. హేడ్లీ తాను లష్కర్-ఎ-తొయిబా కార్యకర్త సాజద్ ని కలిసిన సంగతీ, ఐ.ఎస్.ఐ తరపున గూఢచర్యంలో పాల్గొన్న సంగతీ రాణాకు చెప్పినట్లు కోర్టులో చెప్పాడు. హేడ్లీ చెప్పిన సాక్ష్యాన్ని కూడా తన వాదనకు మద్దతుగా రాణా కోర్టులో పలికిన సాక్ష్యంలో పేర్కొన్నాడు. తాజా వివరాలతో టెర్రరిజానికి పాకిస్తాన్ ప్రభుత్వ మద్దతుందని చాలాకాలంగా ఆరోపిస్తున్న ఇండియా వాదనకు బలం చేకూరినట్లయ్యింది.

వ్యాఖ్యానించండి