ఇద్దరు పుత్రులతో సహా ముబారక్ ను అరెస్టు చేసిన ఈజిప్టు మిలట్రీ ప్రభుత్వం


Gamal Mubarak and his wife

ముబారక్ తర్వాత గద్దెనెక్కుతాడని భావించిన రెండో కొడుకు గమాల్, అతని భార్య

ఈజిప్టు ప్రజల ఉద్యమం దెబ్బకు గద్దె దిగిన ఈజిప్టు నియంత ముబారక్, అతని ఇద్దరు పుత్రులను ఈజిప్టు తాత్కాలిక సైనిక ప్రభుత్వం బుధవారం నిర్బంధంలోకి తీసుకుంది. ముబారక్ తో పాటు, అతని కుటుంబ సభ్యులు తమ పాలనలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారనీ, వారితో కుమ్మక్కైన సైనిక ప్రభుత్వం విచారణ జరగకుండా కాలం గడుపుతోందనీ ఆరోపిస్తూ ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి కూడలి వద్ద బైఠాయింపు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ప్రజా ఉద్యమం ప్రారంభమైనాక సైనికుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మరణించారు. సైనిక ప్రభుత్వం మంగళవారం ఆందోళనకారులను తాహ్రిరి కూడలనుండి తొలగించింది.

ముబారక్ కుటుంబాన్ని విచారించాలన్న ప్రజల డిమాండ్ మేరకు సైనిక ప్రభుత్వం లోని ఛీఫ్ ప్రాసిక్యూటర్ మంగళవారం ముబారక్ నూ, అతని ఇద్దరు పుత్రులనూ నిర్బంధంలోకి తీసుకోవాలని వారంట్ జారీ చేశాడు. మంగళవారం ఇద్దరు కొడుకులను నిర్భంధంలోకి తీసుకోగా బుధవారం ముబారక్ ను అరెస్టు చేశారు. పదిహేను రోజుల పాటు వారు నిర్భంధంలో ఉంటారని మిలట్రీ ప్రభుత్వం ప్రకటించింది. ముబారక్ గద్దె దిగి ఎర్ర సముద్రంలోఉన్న తన వేసవి విడిదిలో ఉంటున్నాడు. అప్పటినుండీ ఈజిప్టు వదిలి వెళ్ళరాదని ప్రభుత్వం అతని కుటుంబంపై ఆంక్షలు విధించింది. మంగళవారం ముబారక్ కొడుకులను అరెస్టు చేసి పోలీసు కార్యాలయానికి తీసుకెళ్తుండగా తాహ్రిరి కూడలిలో ఉన్న ప్రజలు వారిని తీసుకెళ్తున్న వాహనంపై రాళ్ళు రువ్వారు.

ముబారక్ కి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాక పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 360 మంది చనిపోయినట్లు భావిస్తున్నారు. హక్కుల సంస్ధలు అంతకంటే ఎక్కువమందే చనిపోయినట్లు ఆరోపిస్తున్నాయి. ముబారక్ పాలించిన 30 సంవత్సరాల కాలంలొ అవినీతికి పాల్పడ్డాడనీ, పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనీ ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపైనా విచారణ జరిపి ముబారక్ నూ, అతని భార్యా కొడుకులనూ కూడా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ డిమాండ్లపై ఇప్పటివరకూ సైనిక ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహం చెంది మళ్ళీ ఉద్యమం ప్రారంభించారు. దానితో అరెస్టులు జరిగాయి.

కానీ అమెరికాకి 30 సంవత్సరాల పాటు సేవలందించిన ముబారక్ ను శిక్షించడానికి అమెరికా అంత తేలికగా అంగీకరించదు. ఈజిప్టు ప్రభుత్వం -అది సైనిక ప్రభుత్వం కావచ్చు, ఎన్నికైన ప్రభుత్వం కావచ్చు- అమెరికా అదుపులో ఉన్నంతకాలం ముబారక్ గానీ అతని కుటుంబ సభ్యులకు గానీ శిక్షపడడం అనుమానమే. ముబారక్ తో పాటు, ట్యునీషియా అధ్యక్షుడు బెన్ ఆలీ ల అవినీతి గురించి అమెరికా రాయబారులు తమ ప్రభుత్వానికి పంపిన కేబుళ్ళలో సవివరంగా రాశారు. ఆ కేబుళ్ళను వికీలీక్స్ బయటపెట్టిన విషయం తెలిసిందే. దానితో అమెరికా ప్రభుత్వంగానీ, హిల్లరీ క్లింటన్ లాంటి వారు గానీ ముబారక్, బెన్ ఆలీ లను సమర్ధించలేక పోయారు. వికీలీక్స్ విడుదల చేసిన కేబుళ్ళు చదివిన ఈజిప్టు, ట్యునీషియాల యువత పాత్ర ఆ దేశాల్లో జరిగిన ప్రజాస్వామిక ఉద్యమాల్లో గణనీయంగా ఉంది. వారే ముబారక్ ని శిక్షించాలని మళ్ళీ ఆందోళన ప్రారంభించారు. ముఖ్యంగా ఈజిప్టులో సాకర్ క్లబ్బులు ఆందోళనలో ప్రముఖపాత్ర నిర్వహించాయి.

వ్యాఖ్యానించండి