సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒత్తిడితో “2 జి కుంభకోణం” పై సి.బి.ఐ జరుపుతున్న విచారణ పట్ల నార్వే ప్రధాని స్టోల్సెన్ బర్గ్ కలవరపడుతున్నాడు. నార్వే ప్రభుత్వానికి చెందిన టెలినార్ టెలికం కంపెనీపై కూడా సి.బి.ఐ విచారణ జరుపుతుండడమే దీనికి కారణం. కేంద్ర టెలికం శాఖ మంత్రిగా పనిచేసిన ఎ రాజా అరెస్టు అయినప్పటికీ నార్వే ప్రధాని కలవరపడలేదు. రాజా తర్వాత కపిల్ సిబాల్ టెలికం మంత్రిగా రావడంతో టెలినార్ తో పాటు ఇతర ప్రవేటు టెలికం కంపెనీలు కూడా నిశ్చింతగా ఉన్నాయి. కపిల్ సిబాల్ అమెరికా అనుకూల విధానాలకు గట్టి మద్దతుదారు కావడమే వారి నిశ్చింతకు కారణం.
టెలికం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే 2 జి స్కాం లో 176,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోయిందని కాగ్ సంస్ధ చెప్పడంలో వాస్తవం లేదనీ, అదంతా ఉత్తుత్తి ప్రచారమనీ ప్రకటించి కపిల్ సిబాల్, ప్రవేటు టెలికం కంపెనీలను సంతోషపరిచాడు. కానీ సుప్రీం కోర్టు 2 జి విచారణను తన పర్యవేక్షణలో జరపని సిబీఐ ని ఆదేశీంచడం, ప్రత్యేక కోర్టును ప్రతిరోజూ ట్రయల్స్ నిర్వహించాలని కోరడం, కుంభకోణం విచారణపై దాఖలయ్యే పటిషన్లను వేటినీ స్వీకరించవద్దని సుప్రీం కోర్టు చెప్పడంతో విచారణ పర్యవసానాలు అందరికీ అర్ధమవ్వడం ప్రారంభమయ్యింది. సి.బి.ఐ అనేక వేల పేజీలు గల మొదటి ఛార్జి షీటు కూడా దాఖలు చేయడంతో కలవరం మొదలైంది.
2 జి స్పెక్ట్రం కేటాయింపుల్లో అవినీతి ఏమైనా జరిగి ఉన్నట్లయితే అది టెలినార్ కంపెనీ ప్రవేశించకముందే జరిగిందనీ, కనుక తమ కంపెనీకి కుంభకోణంతో సంబంధం లేదనీ నార్వే ప్రధాని జెన్స్ స్టోల్సెన్ బర్గ్ చెప్పుకొచ్చాడు. తనకు సంబందం లేని కుంభకోణానికి టెలినార్ కంపెనీని శిక్షించడం సబబు కాదని ఆయన పత్రికలతో అన్నట్లు రాయిటర్స్ తెలిపింది. టెలినార్ కంపెనీలో నార్వే ప్రభుత్వానికి 54 శాతం మెజారిటీ వాటా ఉంది. టెలినార్ కంపెనీ తరపున లాబియింగ్ చేసిన చరిత్ర నార్వే ప్రధానికి ఉంది. గతంలో టెలినార్ కంపెనీ కోసం ఆయన రష్యా ప్రభుత్వంతో లాబీయింగ్ జరిపాడని రాయిటర్స్ తెలిపింది. టెలినార్ తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్న భారతీయ కంపెనీ యునిటెక్, పోలీసులు శనివారం దాఖలు చేసిన ఛార్జిషీటులో చోటు సంపాదించుకుంది. వాస్తవానికి ఇండియా ప్రవేటు కంపెనీలు అతి తక్కువ ధరలకు 2 జి స్ప్రెక్ట్రం లైసెన్సులను పొందిన తర్వాత విదేశీ కంపెనీలు పోటీపడి ఇండియా కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాయి. భారతీయ ప్రవేటు కంపెనీ రిలయన్స్ టెలికాం సైతం తన బినామీ కంపెనీ స్వాన్ ను ముందు ప్రవేశపెట్టి తక్కువ ధరకు లైసెన్సు పొందాక స్వాన్ లో మెజారిటీ వాటా కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇది తర్వాత డిబి రియాలిటీ సంస్ధగా పేరు మార్చుకున్న సంగతి విదితమే. లైసెన్సులను అతితక్కువ ధరకు పొందిన కంపెనీలు తర్వాత ఇతర విదేశీ ప్రవేట్ కంపెనీలకు అత్యధిక ధరకు వాటాలు అమ్ముకుని వేలకోట్లు సంపాదించాయి. ఈ కుంభకోణంలో యునిటెక్ దోషిగా ఉంది తప్ప దాని టెలినార్ భాగస్వామి యూనినార్ కాదని యునిటేక్ సి.ఇ.ఓ కూడా చెబుతున్నాడు.
“ఇండియాలొ ఇతరులు చేసిన తప్పుకు టెలినార్ ను శిక్షించడం భావ్యం కాదు. భారత అధికారులకు నేను అదే చెప్పాను. భవిష్యత్తులో కూడా నా ప్రయత్నాలను కొనసాగిస్తాను” అని నార్వే రాజధాని ఓస్లో లో ప్రధాని పత్రికలకు చెప్పాడు. టేలినార్ కేసు విషయంలో భారత న్యాయవ్యవస్ధ సక్రమంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నానని కూడా నార్వే ప్రధాని అతికి పోయాడు. టెలినార్ కంపెనీ సక్రమమైన పద్ధతిలొ చూడాలని కోరుతూ ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఉత్తరం కూడా రాశాడు. భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను ప్రవేటీకరించి విదేశీ బహుళజాతి సంస్ధలకు అప్పనంగా అప్పగించడానికి కంకణం కట్టుకున్న భారత ప్రధాని మన్మోహన్ నార్వే ప్రధాని కోరికను నెరవేర్చడానికి శాయశక్తులా కృషి చేస్తాడనడంలో ఎట్టి సందేహం లేదు.
