ఆఫ్రికాలో ఫ్రాన్సు కండకావరానికి మరో దేశం బలయ్యింది. ఐవరీకోస్టు దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన అధ్యక్షుడు లారెంట్ జిబాగ్బోను శాంతి పరిరక్షణ పేరుతో దేశంలొ తిష్ట వేసిన ఫ్రాన్సు సైన్యాలు అరెస్టు చేశాయి. ఫ్రాన్సు సేనలు అధ్యక్షుడి ఇంటిపైకి తమ ట్యాంకులను నడిపించాయి. ఇంటి ప్రహరీగోడను కూల్చివేస్తూ లోపలికి చొచ్చుకెళ్ళి అధ్యక్షుడు జిబాగ్బోను అరెస్టు చేసినట్లుగా అతని సహాయకుడు వార్తా సంస్ధలకు తెలిపాడు.అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో లారెంట్ జిబాగ్బో గెలిచినట్లు ఆ దేశ రాజ్యాంగ కౌన్సిల్ ప్రకటించింది. అయినప్పటికీ ఐవరీ కోస్టులో సంవత్సరాలబడి శాంతి పేరుతో సైన్యంతో సహా తిష్ట వేసిన ఐక్యరాజ్యసమితి అతని ప్రత్యర్ధి, ఐ.ఎం.ఎఫ్ మాజీ ఆర్ధికవేత్త, ఫ్రాన్సుకు నమ్మినబంటు అయిన ఒట్టోరా గెలిచినట్లు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చింది. ఫ్రాన్సు సైన్యాలు కూడా శాంతి పేరుతో అనేక సంవత్సరాల నుండి ఐవరీ కోస్టులొ తిష్ట వేసి ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి, ఫ్రాన్సు కలిసి అధ్యక్షుడు జిబాగ్బోకి వ్యతిరేకంగా ఒట్టోరా సైనికులకు సహాయం చేస్తూ అంతర్యుద్ధానికి ఆజ్యం పోశాయి. సమితి చేత తన నమ్మిన బంటు ఒట్టోరా గెలిచినట్లు సర్టిఫికెట్ ఇప్పించి ప్రజలెన్నుకన్న జిబాగ్బోను అరెస్టు చేశాయి. అధ్యక్షుడు జిబాగ్బోను ప్రత్యర్ధికి అప్పజెప్పినట్లు వార్తా సంస్ధలు తెలిపాయి.
జిబాగ్బో దేశ ప్రజలపై దాడులు చేస్తున్నాడని సమితి ఆరోపిస్తున్నప్పటికీ, ఇటీవలి కాలంలొ ఒట్టోరా సేనలు ప్రజలపై సాగించిన అకృత్యాలు బైటపడడంతో వారి ఆరోపణల్లో సత్యం లేదని తెలుస్తోంది. అమెరికాకి చెందిన “హ్యూమన్ రైట్స్ వాచ్” సంస్ధ ఒట్టోరా సేనలు అనేక మంది మహిళలను రేప్ చేశాయనీ, కొన్ని వందలమంది పౌరులను ఊచకోత కోశాయని ప్రకటించింది. అయినప్పటికే ఒట్టోరాని ఐవరీకోస్టు గద్దెపై కూర్చోబెట్టి ఆ దేశంలోని కోకోవా పంటను అదుపులో పెట్టుకోవాలన్న ఫ్రాన్సు కోరికను నెరవేర్చడానికి సమితి సిద్ధపడింది. ఐక్యరాజ్యసమితి పశ్చిమ రాజ్యాల తరపున పనిచేసే సంస్ధతప్ప సభ్య దేశాలన్నింటి పట్లా నిష్పాక్షికంగా వ్యవరించే సంస్ధ కాదని మరోసారి ఋజువయ్యింది.
ప్రపంచంలో కోకోవా అత్యధికంగా పండే దేశం ఐవరికోస్ట్. ఐవరీ కోస్టు ప్రభుత్వాన్ని తనకు నమ్మకస్తుడైన ఒట్టోరాకు కట్టబెట్టడానికే ఫ్రాన్సు ఇంతటి దారుణానికి తెగించింది. ఫ్రాన్సు అనేక శతాబ్దాలనుండి ఆఫ్రికా దేశాలను వలసలుగా పాలించిన దేశం. ఆఫ్రికా దేశాలకు నామమాత్రపు స్వతంత్రం కట్టబెట్టి తనకు నమ్మకస్ధులను ప్రభుత్వాధిపతులుగా ప్రతిష్టించి తన వ్యాపార ప్రయోజనాలను నెరవేర్చుకుంటూ వస్తున్నది. అధ్యక్షుడు జిబాగ్బో చాలా కాలంగా నియంతృత్వ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక వ్యవస్ధ కోసం పోరాడిన వ్యక్తి. అందుకే ఐవరీకోస్టు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా, వారు ఎన్నుకున్న జిబాగ్బోను ఆ ప్రజల పేరుతోనే నిర్బందించింది.
