ప్రైవేటు బ్యాంకుల నష్టాన్ని చెల్లించడానికి దృఢంగా నిరాకరిస్తున్న ఐస్ లాండ్ ప్రజలు


Icesave logo

Icesave logo

2008 సం. నాటి ద్రవ్య సంక్షోభంలో కుప్పకూలిన ఐస్ లాండ్ ప్రవేటు బ్యాంకుల నష్టాన్ని చెల్లించడానికి ఐస్ లాండ్ ప్రజలు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. గత సంవత్సరం మార్చిలో జరిగిన రిఫరెండంలో 93 శాతం ప్రజలు ఐస్ లాండ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని తిరస్కరించగా ఏప్రిల్ 9, 2011 తేదీన జరిగిన మరో పాక్షిక రెఫరెండంలో సైతం 58 శాతం మంది ప్రవేటు బ్యాంకుల నష్టాన్ని భరించడానికి తిరస్కరించారు. ప్రభుత్వం కుదుర్చుకున్న “ఐస్ సేవ్” ఒప్పందం ప్రకారం ఐస్ లాండ్ లోని ప్రవేటు బ్యాంకు ‘లాండ్స్ బాంకి’ లో డబ్బు దాచుకున్న బ్రిటన్, నెదర్లాండ్స్ దేశ ఖాతాదారులకు ఐస్ లాండ్ ప్రభుత్వం నష్ట పరిహరాన్ని వడ్డీతో సహా చెల్లించాలి. ఈ ఒప్పందం పార్లమెంటులో ఆమోదం పొందినప్పటికీ అధ్యక్షుడు “జొహన్నా సిగుర్డార్ డాట్టిర్” సంతకం చేయకుండా రిఫరెండం కు ప్రతిపాదించాడు. శనివారం జరిగిన రిఫరెండంలొ ఐస్ లాండ్ ప్రజలు ఒప్పందాన్ని తిరస్కరించారు.

లాండ్స్ బాంకి బ్యాంకు ప్రపంద ఆర్ధిక సంక్షోభం దరిమిలా కుప్పకూలిపోయింది. ఆ బ్యాంకు “ఐస్ సేవ్” పేరుతో ఇంగ్లండు. హాలండు దేశస్ధులకు సేవింగ్స్ బ్యాంకు ఎకౌంట్లను నిర్వహించింది. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య ఉండే ద్రవ్య, ఆర్ధిక సంబంధాల దృష్యా ఐస్ లాండ్ ప్రభుత్వం ఇంగ్లండు. హాలండులకు నష్టపరిహారం చెల్లించడానికి అంగీకరించింది. గత సంవత్సరం రూపొందించిన ఒప్పందం ప్రకారం 2016 సంవత్సరం నుండి 2024 సం వరకూ విదేశీ ఐస్ సేవ్ ఖాతాదారుల సొమ్మును 5.5 శాతం వడ్డీతో చెల్లించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందంపై మార్చి 6, 2010 తేదీన రిఫరెండం జరిగింది. ఈ రిఫరెండంలొ 93 శాతం మంది ఒప్పందాన్ని వ్యతిరేకించారు. రిఫరెండం జరగడానికి ముందు ఇంగ్లండు, హాలండు ప్రభుత్వాలు ఐస్ లాండ్ ప్రజలని అనేక రూపాల్లో బెదిరించాయి. “ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో ఐస్ లాండ్ భాగం కాకూడదని నిర్ణయించుకుంటేనే ఐస్ లాండ్ ప్రజలు ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటేస్తారు” అని  ఇంగ్లండు బెదిరించింది.

ఆ తర్వాత తాజాగా మరో ఒప్పందాన్ని సిద్ధం చేశారు. దాని ప్రకారం ఇంగ్లండ్, హాలండ్ దేశాలకు ఐస్ లాండ్ ప్రభుత్వం నష్టపరిహారాన్ని 3.3 శాతం వడ్డీతో చెల్లించాలని ప్రతిపాదించారు. ఈసారి ఒప్పందాన్ని 58 శాతం ప్రజలు తిరస్కరించగా 42 శాతం మంది మద్దతునిచ్చారు. “ఐస్ లాండ్ ప్రజలు అత్యంత చెడ్డ నిర్ణయం తీసుకున్నారు” అని దేశ అధ్యక్షుడు జోహన్నా ప్రకటించాడు. ఇంగ్లండు ట్రెజరీ మంత్రి డేనీ అలెగ్జాండర్, ఐస్ లాండ్ ప్రజల నిర్ణయం చాలా “అసంతృప్తి” కలిగించిందని ప్రకటించాడు. ఇక అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళడం మినహా మరో మార్గం లేదని ఆయన తెలిపాడు. హాలండ్ ఆర్ధిక మంత్రి “జాన్ కీస్ డే జాగర్” తదుపరి తీసుకునే చర్యలను బ్రిటన్ తో సంప్రతించి ప్రకటిస్తామని తెలిపాడు. “ఐస్ లాండ్ ప్రజల నిర్ణయం అసంతృప్తి కలిగించింది. ఇది ఐస్ లాండ్ కు మంచిది కాదు. హాలండ్ కు కూడా మంచిది కాదు. చివరికి అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళవలసి ఉంటుందేమో” అని జాన్ కీస్ అన్నాడు.

ఇంగ్లండు, హాలండు రెండు దేశాల్లో మొత్తం 4 లక్షల మంది ఖాతాదారులు ‘లాండ్స్ బాంకి’ బ్యాంకు కుప్పకూలడం వలన నష్టపోయారని తెలుస్తోంది. వారికి 4 బిలియన్ యూరోలు నష్టపరిహారం చేల్లించాలని తేల్చారు. “లాండ్స్ బాంకి” బ్యాంకు ఆస్తులను వేలం వేస్తే ఆ మొత్త తగ్గుతుందని చెబుతున్నప్పటికీ, అసలు ప్రవేటు బ్యాంకు నష్టాలను తామేందుకు భరించాలని అడుగుతున్న ఐస్ లాండ్ ప్రజల ప్రశ్న న్యాయ సమ్మతం. ప్రవేటు బ్యాంకులు విచ్చలవిడిగా పెట్టిన పెట్టుబడులవలన అవి నష్టపోయాయి. అవి కూలిపోవడానికి కారణం అవి అనుసరించిన వినాశకర విధానాలే. వారు రూపొందించిన వివిధ రకాల సెక్యూరిటీలు, సిడిఓలు, హెడ్జ్ ఫండ్ల పెట్టుబడులు అన్నీ అంతిమంగా చెల్లింపులు లేక కుప్పకూలడంతో అవి విషపూరితమైన పెట్టుబడులుగా మారిపోయాయి.

ప్రధానంగా ఎట్టి సెక్యూరిటీ లేకుందా జారి చేసిన హౌసింగ్ లోన్ల ఆధారంగా రూపొందించిన క్లిష్టమైన, పారదర్శ్కం కాని సెక్యూరిటీలలో ప్రపంచంలోని అనేక బ్యాంకులు నిర్లక్ష్యంగా, వెనకా ముందూ చూసుకోకుండా పెట్టుబడులు పెట్టడంతో రాబడులు లేక ఒకదాని వెంట ఒకటిగా బ్యాంకులు కుప్పకూలిపోయాయి. వాటికి పరిహారాన్ని దేశ ప్రజలపై మోపుతూ పశ్చిమ దేశాల ప్రభుత్వాలు ప్రవేటు బ్యాంకులకు ట్రిలియన్ల డాలర్లను బెయిలౌట్ ప్యాకేజీలుగా ధారపోశాయి. ఐస్ లాండ్ ప్రజలు కూడా ప్రవేటు బ్యాంకు నష్టాలను భరించాలని ఐస్ లాండ్ ప్రభుత్వంతో పాటు ఇంగ్లండు, హాలండ్ ప్రభుత్వాలు కూడా ఒత్తిడి తెస్తున్నాయి. వారి ఒత్తిడిని ఇప్పడివరకు ప్రజలు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. కాని రాను రాను ఐస్ లాండు ప్రభుత్వమ్ చేసుకున్న అవమానకర ఒప్పందంపై వ్యతిరేకత పలచబడుతున్నట్లు రిఫరెండం ఫలితాలు తెలుపుతున్నాయి. ఐస్ లాండ్ దేశం ఇ.యు లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నందున “ఐస్ సేవ్” ఒప్పందాన్ని ఏవిధంగానైనా అంగీకరింప జేయడానికి ఆ దేశ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

వ్యాఖ్యానించండి