ఈజిప్టు ప్రజల్లొ సైనిక ప్రభుత్వంపై రోజు రోజుకీ ఆగ్రహం పెరుగుతోంది. తాము మూడు వారాల పాటు ఉద్యమించి నియంత ముబారక్ ను గద్దె దింపినప్పటికీ ముబారక్ పాలన అంతం కాలేదన్న అసంతృప్తి వారి ఆగ్రహానికి కారణం. ముబారక్ పాలనలో వ్యవహారాలు నడిపినవారే ముబారక్ ను సాగనంపిన తర్వాత కూడా కొనసాగుతుండడం, వారే ఇంకా నిర్ణయాలు తీసుకునే స్ధానంలొ కొనసాగడం వారికి మింగుడుపడడం లేదు. తాము సాధించామనుకున్న విప్లవం, మార్పు నామమాత్రంగా మిగిలిపోతున్న సూచనలు కనిపిస్తుండడంతో ఈజిప్టు ప్రజల్లో తాము మోసపోయామని గ్రహించడం ప్రారంభించారు. ముబారక్ గద్దె దిగి రెండు నెలలు కావస్తున్నా సైనిక ప్రభుత్వం ప్రజాస్వామిక సంస్కరణలవైపుగా తీసుకుంటున్న చర్యలు అతి నెమ్మదిగా కొనసాగడాన్ని ఆందోళన కారులు జీర్ణించుకోలేక పోయారు. దాని ఫలితమే శుక్రవారం కైరో లోని ‘విమోచనా కూడలి ‘ మళ్ళీ జనసంద్రంగా మారింది.
సైనిక ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే అతి నెమ్మదిగా అడుగులు వేస్తోందని ఈజిప్టు ప్రజలు నమ్ముతున్నారు. ఈజిప్టు ఆర్ధిక వ్యవస్ధలో ముబారక్ ను నడిపించిన శక్తులే సైనిక ప్రభుత్వాన్నీ నడిపిస్తున్నాయని వారు భావిస్తున్నారు. “ఈ మిలట్రీ ప్రభుత్వం ముబారక్ కాలం నాటి అవినీతి పాలనలో అంతర్భాగం. ముప్ఫై సంవత్సరాలపాటు ఈజిప్టు ప్రజలను దోచుకున్న ముబారక్ ద్వారా ఫలితం పొందిన సైనికాధికారులే ఈ ప్రభుత్వంలో పెత్తనం చేస్తున్నారు” అని 45 సంవత్సరాల నిరసనకారుడు రాయిటర్స్ విలేఖరితో అన్నాడు. సైనిక ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నా వాస్తవం మాత్రం అదే. వేకువ ఝాము 2 గం నుండి 5 గం వరకూ కర్ఫ్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఆందోళనల్లో పాల్గొన్నవారిలో కొన్ని వందలమంది కూడలిలో బైఠాయింపు కొనసాగించారు.
శనివారం వేకువ ఝామున కర్ఫ్యూ సమయంలో ఆందోళనకారులను తొలగించేందుకు సైనికాధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. లాఠీలు, ఇతర బెత్తాలతో వారిని కొట్టడం ప్రారంభించారు. బైఠాయింపు కొనసాగడంతో కాల్పులు ప్రారంభించారు. కాల్పుల్లో ఇద్దరు చనిపోయినప్పటికీ ప్రభుత్వం తాము కాల్పులు జరపలేదని బుకాయిస్తోంది. డెబ్భై మందికి పైగా గాయపడగా వారిలొ పదిహేడుమందికి బులెట్ గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. కాల్పుల మోతతో విమోచనా కూడలి దద్దరిల్లింది. తాము కాల్పులు జరపక పోయినా బులెట్ గాయాలతో ఇద్దరు మరణించడం, గాయపడటం ఎలా జరిగిందో ప్రభుత్వం వివరించలేదు.
శుక్రవారం రాత్రి కొన్ని వందల మంది కూడలిలో బైఠాయించగా శనివారం ఉదయానికల్లా వేలకు చేరింది. సైనికులు తమను ఎందుకు కొడుతున్నారని వారు నినాదాల రూపంలో ప్రశ్నించారు. వారి ప్రశ్నలు రాత్రంతా కొనసాగుతూనే ఉన్నాయని ఓ ప్రత్యక్షసాక్షి చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. అధికారం చెలాయిస్తున్న మిలట్రీ కౌన్సిల్ తప్పుకుని పౌర కౌన్సిల్ కు అధికారం అప్పగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. “ముబారక్, గమాల్ (ముబారక్ పుత్రుడు) తదితరులను ఫీల్డ్ మార్షల్ తంతావి అరెస్టు విచారణ ప్రారంభించాలి. అది చేతకాక పోతే తప్పుకుని చేతనైన వారికి అధికారం అప్పగించాలి. మెల్లగా చర్యలు తీసుకుంటామంటే కుదరదు. సైనిక ప్రభుత్వం ముబారక్ తో కుమ్మక్కు అయిందన్న అనుమానాలు పెరుతున్నాయి” అని 36 ఏళ్ళ అష్రఫ్ అబ్దెల్-అజీజ్ అన్నాడు.
సైనిక ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహానిక గుర్తుగా వారు తగలబెట్టిన రెండు సైనిక ట్రక్కులు కూడలిలొ ఉన్నాయి. ట్రక్కులను తగలబెట్టడాన్ని అల్లర్లు గా సైనికాధికారులు ప్రస్తావిస్తున్నారు. ముబారక్ మద్దతుదారులు కూడలి వద్దకు చేరుకుని సైనికులపై తమ కోపం తీర్చుకుంటున్నట్లు అనుమాలున్నాయని వారు చెప్పారు. ఈ ఎత్తుగడల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆందోళనకారులు సైనిక వాహనాలపై రాళ్ళు రువ్వారు. “ప్రజా విప్లవం చేసిన డిమాండ్లను నెరవేర్చడంలో నెమ్మదిగా ఉన్న మిలట్రీ కౌన్సిల్ విధానాన్ని మేం ఖండిస్తున్నాం. ముబారక్, అతని అనుచరులను అరెస్టు చేసి విచారణ చేసే వరకు తిరిగి తాహ్రిరి స్క్వేర్ వద్దకు రావాలని కోరుతున్నాం” అని ముబారక్ వ్యతిరేక ఆందోళనలకు నాయకత్వం వహించిన యువజన సంఘాల గ్రూపు పిలుపిచ్చింది.
ముబారక్, అతని కుటుంబ సభ్యులు ఈజిప్టు వదిలి వెళ్ళరాదని సైనిక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కాని ఆందోళనకారుల డిమాండ్ మేరకు వారిని అరెస్టు చేసి విచారించే సూచనలేమీ కనిపించడం లేదు. ప్రధాన డిమాండ్లు సాధించుకోవడానికి ఈజిప్టు ప్రజలు తిరిగి ఆందోళనా పధం చేపట్టడం హర్షణీయం. కాని అమెరికన్ సామ్రాజ్యవాదం అంత తేలికగా ఈజిప్టును చేజార్చుకోదు. తన అనుంగు మిత్రుడు ఇజ్రాయెల్ కు హాని జరగకుండా ఉండటానికీ, మధ్యప్రాచ్యంలొ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంతటి దారుణానికైనా తెగిస్తుంది. ప్రజల డిమాండ్లకు సరితూగగల సైద్ధాంతిక ఆయుధం ఆందోళనకారులవద్ద కొరవడడం పెద్ద లోపం. ప్రపంచ వ్యాపితంగా ప్రజా ఉద్యమాలపై అణచివేత చర్యల్ని కొనసాగిస్తున్న సామ్రాజ్యవాదులు, వారి అనుచరులు మునుముందు ఈజిప్టులో కూడా అణిచివేత చర్యలతో విరుచుకుపడే అవకాశం ఉంది. వాటిని తిప్పికొట్టడానికి ఈజిప్టు ప్రజలు తగిన విధంగా సిద్ధమైతే తప్ప వారు కోరుకుంటున్న ప్రజాస్వామ్యం సిద్ధించదు.
