లిబియా ప్రభుత్వ సైనికులుగా పొరబడి తిరుగుబాటు సైనికులను చంపినందుకు క్షమాపణ చెప్పడానికి నాటొ దళాల రియర్ ఆడ్మిరల్ రస్ హార్డింగ్ నిరాకరించాడు. గురువారం అజ్దాబియా, బ్రెగా పట్టణాల మధ్య జరుగుతున్న యుద్దంలో పాల్గొనటానికి తిరుగుబాటు బలగాలు తీసుకెళ్తున్న ట్యాంకుల కాన్వాయ్ పై నాటో వైమానిక దాడులు జరపడంతో పదమూడు మంది మరణించిన సంగతి విదితమే. “గడ్డాఫీ బలగాలకు చెందిన ట్యాంకులు మిస్రాటా పట్టణంలొ పౌరులపై నేరుగా కాల్పులు జరుపుతున్నాయి. పౌరులను రక్షించడానికే మేం ప్రయత్నిస్తున్నాము. గురువారం నాటి ఘటన జరిగే వరకూ తిరుగుబాటు బలగాలు ట్యాంకులను వాడుతున్న సంగతి తెలియదు. మేమేమీ వారికి క్షమాపణ చెప్పాలని అనుకోవడం లేదు” అని హార్డింగ్ తెలిపాడు.
అయితే మిస్రాటా పట్టణం లిబియా పశ్చిమ ప్రాంతంలో ఉన్న పట్టణం. మిస్రాటాకీ, అజ్దాబియాకి మద్య కొన్ని వందల కిలో మీటర్ల దూరం ఉంది. మిస్రాటాలొని పౌరుల మీద దాడి చేస్తున్న గడ్డాఫీ బలగాల ట్యాంకులను నిరోధించడానికి తూర్పుభాగంలొ ఉన్న అజ్దాబియా పట్టణం వద్ద వైమానిక దాడులు ఎందుకు చేయవలసి వచ్చిందో అర్ధం కాని విషయం. పైగా మిస్రాటా పట్టణంలో వారాల తరబడి జరుగుతున్న గడ్డాఫీ బలగాల దాడులకు తట్టుకోలేక పశ్చిమ దేశాలను ఏదో ఒకటి చేయాలని అక్కడి తిరుగుబాటుదారులు కోరుతున్నారు. లేనట్లయితే తామిక తిరుగుబాటు చేయడం మానేస్తామని కూడా వారు పరోక్షంగా హెచ్చరించారు. మిస్రాటా దగ్గర సాయం చేయడం మాని అజ్దాబియా వద్ద దాడులు చేయడం తోటే తిరుగుబాటు బలగాల ట్యాంకులు ధ్వంసం అవడంతో పాటు సైనిక నష్టం కూడా జరిగింది.
ఫ్రెండ్లీ ఫైర్ కి సంబంధించి తిరుగుబాటుదారుల కమాండర్ చెప్తున్నదానికీ, నాటో చెపుతున్నదానికీ పొంతన కుదరడం లేదు. తిరుగుబాటు బలగాల కమాండర్ జనరల్ అబ్దెల్ ఫతా యూనిస్ ప్రకారం వారు ట్యాంకులను ఫ్రంట్ లైన్ వద్దకు తీసుకెళ్తున్న సంగతి పై నాటో కు సమాచారం ఇచ్చారు. తమ ట్యాంకులు రోడ్డు మీదకు వస్తున్నాయని తెలుపుతూ, ఆ ప్రాంతానికి సంబంధించి కో-ఆర్డినేట్స్ కూడా నాటోకు అందించామని యూనిస్ చెబుతున్నాడు. నాటో దళాలు తనకు నేరుగా కాకపోయినా ఇతరులకు క్షమాపణ కూడా చెప్పాయని యూనిస్ చెప్పాడు. “తిరుగుబాటు బలగాలపై దాడులు చేయడానికి నాటో నమ్మదగిన కారణం చెప్పాలి” అని యూనిస్ కోరాడు. అయితే ఈ ఘటన వలన నాటోకూ తమకూ మధ్య సంబంధాలు చెడిపోయే అవకాశం లేదని యూనిస్ చెప్పాడు.
నాటో బలగాల వైమానిక దాడుల్లో నలుగురు తిరుగుబాటు సైనికులు చనిపోయారని తిరుగుబాటు దారుల ప్రతినిధి చెప్పగా, 13 మంది చనిపోయారని గాయపడినవారికి వైద్యం చేసిన డాక్టరు చెప్పాడు. మిగిలిన తొమ్మిది మంది బహుశా పౌరులు కావచ్చు. పౌరులను రక్షించడానికే దాడులు చేస్తున్నామంటున్న నాటో దళాలు కొన్ని రోజుల క్రితం జరిపిన దాడిలో ఏడుగురు పౌరులు చనిపోయారు. ఈ దాడులకు కారణం చెప్పకపోగా క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని హుంకరించడానికి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఏ భాష్యం చేబుతాడో!? ఐవరీ కోస్టు అధ్యక్ష భవనంపై సమితికి చెందిన శాంతి బలగాలు దాడి చేయడానికి కారణం అక్కడి పౌరులను రక్షించడం కోసమే అని బాన్ గురువారం సమర్ధించుకున్నాడు. అధ్యక్ష భవనంపై బాంబులు కురిపిస్తే పౌరులు ఏ విధంగా రక్షింపబడతారో ఆయన చెప్పలేదు.
