ముదిరిన పోర్చుగల్ అప్పు సంక్షోభం


Amid Euro's remains

యూరో శిధిలాల మధ్య ఇ.యు జెండాను ఎత్తలేక అవస్ధలు

గత సంవత్సరమ్ గ్రీసు, ఐర్లండులను బలి తీసుకున్న యూరప్ అప్పు సంక్షోభం తాజాగా పోర్చుగల్ ను బలి తీసుకుంది. అప్పు కోసం ఇ.యు, ఐం.ఎ.ఎఫ్ లను దేబిరించడానికి వ్యతిరేకిస్తూ పోర్చుగల్ ప్రధాని, పొదుపు చర్యలతో ప్రతిపాదించిన నూతన బడ్జెట్ పార్లమెంటులో ఓడిపోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. మే నెలలో ఎన్నికలు ముగిసే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్న ప్రధాని జోస్ సోక్రటీసు గురువారం అనివార్యంగా ఇ.యు, ఐం.ఎం.ఎఫ్ లు రూపొందించిన బెయిల్-అవుట్ ప్యాకేజీ నుండి సహాయం అర్ధించవలసి వచ్చింది. ప్రధాని బడ్జెట్ లో ప్రతిపాదించిన పొదుపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల నుండి బెయిల్-అవుట్ ప్యాకేజీని పొందటానికి తిరిగి అవే పొదుపు చర్యలను అంగీకరించాల్సి ఉంది.

పోర్చుగల్ బెయిలౌట్ ప్యాకేజీ పొందాలంటే పోర్చుగల్ లోని పార్టీలన్నీ పొదుపు చర్యలపై అంగీకారానికి రావాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు అందుకు నిరాకరించినట్లయితే నిధుల కోసం బహిరంగ మార్కెట్ లో సావరిన్ బాండ్లు జారీ చేసి అప్పు సేకరించాల్సి ఉంటుంది. కానీ పోర్చుగల్ దేశ సావరిన్ బాండ్లకు మార్కెట్ లొ అధిక వడ్డీని మదుపరులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అప్పు కొండలా పేరుకుపోయిన నేపధ్యంలొ అధిక వడ్డీ చెల్లించే పరిస్దితిలో పోర్చుగల్ లేదు. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల బెయిల్ అవుట్ ప్యాకేజీ ద్వారా అందే సాయం (అప్పు) వస్తూ వస్తూ అనేక విషమ షరతులను, కఠినమైన పొదుపు చర్యలను వెంట తెస్తుంది. అవి పోర్చుగల్ ప్రజల మూల్గులను పిప్పి చేయడం ఖాయం. ముందు నుయ్యి, వెనక గొయ్యి.

మార్కెట్ అప్పు, ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల అప్పులకు అతీతంగా ఆలోచించే దమ్ము, తెగువ పోర్చుగల్ పాలకులకు లేవు. చివరికి వారం, పది రోజుల క్రితం వద్దనుకున్న పొదుపు చర్యలను ఇప్పుడు పోర్చుగల్ పాలక పార్టీలన్నీ అంగీకరించబోతున్నాయి. పోర్చుగల్ కు 80 బిలియన్ యూరోలు (110 బిలియన్ డాలర్లు) సాయంగా ఇవ్వాల్సి ఉంటుందని యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అంచనా వేస్తోంది. గ్రీసు గత సంవత్సరం మే నెలలో 110 బిలియన్ యూరోల ($150 బిలియన్లు) ప్యాకేజీ పొందగా, ఐర్లండు 85 బిలియన్ యూరోల ప్యాకేజీ పొందింది. ఐర్లండు లాగే పోర్చుగల్ కూడా 5.8 శాతం వడ్డీ తాను పొందే ప్యాకేజీ పై చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్ లో పోర్చుగల్ సావరిన బాండ్లకు 8 శాతం పైగా వడ్డీని డిమాండ్ చేస్తున్నారు. అయితే పోర్చుగల్ 5.8 వడ్డీకి ప్యాకేజి పొందినా అది పాటించవలసిన పొదుపు చర్యల ఖరీదు 8 శాతం వడ్డీని మించిపోతుంది. ఏతా వాతా తేలేదేమంటే అప్పు సంక్షోభంలో ఉన్న సభ్య దేశాల స్ధితిని యూరోపియన్ యూనియన్, ఐ.ఎం.ఎఫ్ లు సొమ్ము చేసుకుంటున్నాయన్నమాట. బెయిల్-అవుట్ ప్యాకేజీలో మూడో వంతు యూరోపియన్ యూనియన్, మూడో వంతు యూరోజోన్, మరో మూడో వంతు ఐ.ఎం.ఎఫ్ లు చెల్లిస్తాయి.

హంగెరీలో శుక్రవారం (ఏప్రిల్ 8) ఇ.యు దేశాల ఆర్ధిక మంత్రుల సమావేశం జరిగింది. పోర్చుగల్ కు బెయిల్ అవుట్ ప్యాకేజీ మొదటి విడత సొమ్మును మే నెలలో ఇవ్వడానికి నిర్ణయించామని ఈ సమావేశం అనంతరం ఇ.యు కమిషనర్ ఒల్లి రెన్ తెలిపాడు. మే నెల వరకు తలెత్తే అవసరాలకు పోర్చుగల్ స్వయంగా వనరుల్ని సమకూర్చుకోగలదన్న నమ్మకం ఉందని ఆయన అన్నాడు. సహాయం పొందాలంటే పోర్చుగల్ పార్లమెంటులో ఓడిపోయిన పోదుపు చర్యలతోనే సంస్కరణలను ప్రారంభించాల్సి ఉంటుందని రెన్, అసలు గుట్టు విప్పాడు. ప్రవేటీకరణ కార్యక్రమాన్ని పోర్చుగల్ చేపట్టాల్సి ఉంటుందని రెన్ వివరించాడు. పోర్చుగల్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టీ స్పెయిన్ పై పడింది. అయితే స్పెయిన్ కి ఇ.యు, ఐం.ఎం.ఎఫ్ ల సహాయం అడిగే పరిస్ధితి రాదని స్పెయిన ఆర్ధిక మంత్రిణి ఎలెనా సల్గాడో ధీమా వ్యక్తం చేసింది.

గ్రీసు, ఐర్లండులు కూడా ఇలాగే మొదట ధీమా వ్యక్తం చేశాయి. కాని ఆ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు బలహీనపడ్డాయంటూ రేటింగ్ సంస్ధలు వాటి సావరిన్ అప్పుల రేటింగ్ తగ్గించుకుంటూ పోవడం, మదుపుదారులు సావరిన్ అప్పుపై డిమాండ్ చేసే వడ్డీ రేటు పెరుతూ పోవడంతో అవి మార్కెట్ లో అప్పును సేకరించలేక పోయాయి. దాంతో అనివార్యంగా ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల ప్యాకేజీ తలుపు తట్టవలసి వచ్చింది. పోర్చుగల్ పాలకులు అధికారులు కూడా వారం క్రితం వరకు ఏం ఫర్లేదంటూ వచ్చినప్పటికీ గురువారం చేయిచాచక తప్పలేదు. ఇక పోర్చుగల్ ప్రజలపై దెబ్బ మీద దెబ్బ పడబోతున్నాయి. జీతాల్లో కోత లేదా స్తంభన, వివిధ సంస్కరణ పధకాల రద్దు, పెన్షన్ కోత, బోనస్ ల రద్దు, కార్మిక హక్కుల రద్దు ఇత్యాదిగా గల కోత, రద్దు చర్యలు ప్రారంభవుతాయి. ఇప్పటికే రెండు విడతలుగా పొదుపు చర్యలను పోర్చుగల్ ప్రభుత్వం ప్రజలపై రుద్దింది. ఆర్ధిక సంక్షోభానికి గానీ, అప్పు సంక్షోభానికి గానీ ప్రజల పాత్ర ఏమీ లేకపోయినా వాటి ఫలితం మాత్రం అంతిమంగా ప్రజలే ఎదుర్కోవలసి రావడం పెట్టుబడిదారీ ఆర్ధిక సూత్రాల లక్షణం.

సంక్షోభాలను ప్రజల నెత్తిన రుద్దిన బహుళజాతి కంపెనీలు, బ్యాంకులూ ఇన్సూరెన్స్ సంస్ధలలాంటి ద్రవ్య సంస్ధలపైన బాధ్యత మోపడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తూ ప్రజల గోళ్ళు ఊడగొట్టడానికి మాత్రం ఉత్సాహంగా రెడీ ఐపోతున్నాయి. పైగా దేశ ఆర్ధిక వ్యవస్ధలు ఒడ్డున పడాలంటే త్యాగాలు తప్పవని పనికిమాలిన బోధలు, సూత్రాలూ వల్లిస్తాయి. త్యాగాలు చేసేవారు ఎప్పుడు ప్రజలే కాగా సంక్షోభాలను రుద్దిన పెట్టుబడిదారీ రాక్షస సంస్ధలకు మాత్రం వందల బిలియన్ల డాలర్లను బెయిలౌట్ గా ప్రభుత్వాలు ధారపోశాయి. ప్రవేటు సంస్ధలకు ఇచ్చిన బెయిలౌట్ ల భారం కూడా అంతిమంగా ప్రజల నెత్తినే ప్రభుత్వాలు మోపుతున్నాయి. ప్రజల ఓపిక కృశించి, నశించే వరకూ ఇది కొనసాగుతూనే ఉంటుంది.

వ్యాఖ్యానించండి