ఐవరీకోస్టులో కొనసాగుతున్న శాంతిదళాల అక్రమ ఆక్రమణ


అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఐవరీకోస్టు దేశంలో ఐక్యరాజ్యసమితి, ఫ్రాన్సులకు చెందిన శాంతి దళాల అక్రమ దాడులు కొనసాగుతున్నాయి. ఐవరికోస్టు ప్రజల రక్షణ పేరుతో అడుగుపెట్టిన సమితి శాంతి దళాలు, ఫ్రాన్సు తన ప్రయోజనాల కోసం తలపెట్టిన మిలట్రీ చర్యకు మద్దతుగా అధ్యక్షుడి నివాస భవనాన్ని చుట్టుముట్టాయి. సోమవారం సమితి, ఫ్రాన్సుల సైన్యాల మద్దతుతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచానంటున్న ‘అలస్సానె ఒట్టోరా’ బలగాలు “అంతిమ దాడి” పేరుతో చేసిన దాడిని అధ్యక్షుడు జిబాగ్బో సైన్యాలు తిప్పికొట్టాయి. ప్రస్తుతం సమితి, ఫ్రాన్సుల శాంతి దళాలు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టి ఉన్నాయి. ఏ క్షణంలో నైనా అవి మరో “అంతిమ దాడి” (!) చేయవచ్చునని తెలుస్తోంది.

రెండు దేశాలుగా ఉన్న ఐవరీకోస్టు విలీనం అయ్యే దిశగా నవంబరులో జరిగిన రెండో విడత ఎన్నికల్లో తాను గెలిచానని అధ్యక్షుడు జిబాగ్బో చెబుతున్నాడు. ఐ,ఎం.ఎఫ్ లో ఆర్ధిక వేత్తగా పని చేసిన “అలెసానె ఒట్టోరా”, కూడా తాను ఎన్నికల్లో విజయం సాధించానని చెబుతున్నాడు. మొదటి విడత జరిగిన ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. అలా జరిగిన రెండో విడత ఎన్నికలో తనకు మెజారిటీ ఓట్లు వచ్చాయని చెప్పినప్పటికీ ఐక్యరాజ్యసమితి బృందం ఒట్టోరా గెలిచినట్లు సర్టిఫై చేసి అతనికి అధికారం అప్పగించడానికి ఫ్రాన్సుతో కలిసి అధ్యక్షుడి పై యుద్ధానికి తెగబడింది.

అధ్యక్ధుడు జిబాగ్బోకు మద్దతుగా ఉన్న సైన్యాలు వెయ్యికి తగ్గిపోయిందని ఫ్రాన్సు రక్షణ మంత్రి గెరార్డో లాంగెట్ గురువారం తెలిపాడు. అధ్యక్షభవనం దగ్గర 200 మందీ, మిగిలిన వారు ఇతర చోట్ల ఉన్నారని ఆయన వార్తా సంస్ధలకు చెప్పాడు. బిబాగ్బో వైపు ఉన్న మిలట్రీ అధికారులను ఫ్రాన్సు ప్రలోభపెట్టి తన వైపుకి తిప్పుకుంటోంది. జిబాగ్బో పతన ఖాయమనీ, అది జరిగాక విచారణనుండి మినహాయింపు ఉంటుందంటూ ఆశ చూపి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది.

ఇదిలా ఉండగా తమ రాయబారిని ఐవరీ కోస్టు నుండి బైటకు పంపడానికి సాయం చేయాలని ఇజ్రాయెల్, ఫ్రాన్సును కోరింది. రెండ్రోజుల క్రితం జపాన్ రాయబారిని దేశం నుండి ఫ్రాన్సు సైన్యాలు బైటకు తరలించాయి. ఒట్టోరా తనను చంపమని ఆదేశాలిచ్చాడని జిబాగ్బో ఆరోపించగా, లేదు లేదు జిబాగ్బోను సజీవంగా పట్టుకోమని ఆదేశాలిచ్చాం అని ఒట్టోరా ప్రకటించాడు.

వ్యాఖ్యానించండి