బుధవారం (ఏప్రిల్ 6) టి.ఆర్.ఎస్ కార్యవర్గం సమావేశమై ఏప్రిల్ 10 నుండి “తెలంగాణ ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు” నిర్వహించాలని నిర్ణయించిందని ఆ పార్టీ నాయకుడు కే.సి.ఆర్ ప్రకటించాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ 10 నాటికి టి.ఆర్.ఎస్ పార్టీ స్ధాపించి పది సంవత్సరాలు గడిచిందనీ ఆ సందర్భంగా ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు జరపాలని నిశ్చయించామని ఆయన సెలవిచ్చారు.
పార్టీ పెట్టి పది సంవత్సారాలు అయ్యింది గనక టి.ఆర్.ఎస్ దశాబ్ది ఉత్సావాలు జరపడంలొ అభ్యంతరం లేదు. కానీ “ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు” జరపడమే అర్ధం కాకుండా ఉంది. టి.ఆర్.ఎస్ పార్టీని ఉద్యమ పార్టీ అని కే.సి.ఆర్ అనడమే తప్ప మొదటి ఆరేడు సంవత్సరాలు ఉద్యమాల జోలికే పోలేదు. ఎక్కువ సీట్లు సాధించి అసెంబ్లీ, పార్లమెంటుల్లో పొలిటికల్ లాబీయింగ్ ద్వారా తెలంగాణా సాధించవచ్చని కే.సి.ఆరే చెప్పి పూర్తిగా లాబీయింగ్ లోనే గడిపాడు. కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రి పదవులు సంపాదించడమే తప్ప ఉద్యమాలు చేసిన పాపాన పోలేదు. కేంద్రంలొ మంత్రి పదవి సంపాదించిన కే.సి.ఆర్ కనీసం ఆ మంత్రి పదవికి కూడా న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఆయన చెప్పిన పొలిటికల్ లాబీయింగు మంత్రి పదవుల సాధనకా లేక తెలంగాణ సాధనకా అన్న అనుమానాలు మిగలడం తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేకపోయింది.
రాజశేఖర రెడ్డి ఉన్నన్నాళ్ళూ తెలంగాణ ఉద్యమం తరవాత సంగతి అసలు తెలంగాణకు సంబంధించిన డిమాండును కూడా అసెంబ్లీ, పార్లమెంటుల్లో ప్రస్తావించడానికి అవకాశాలు దొరకబుచ్చుకోలేక పోయారు. అదేమంటే, కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టో లో రాశారనీ, రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపరిచారనీ అదే పనిగా చెప్పుకున్నారు. యు.పి.ఏ ప్రభుత్వం మొదటి విడత మేనిఫెస్టో, రాష్ట్రపతి ప్రసంగాల్లో చోటు సంపాదించుకున్న తెలంగాణ ప్రస్తావన రెండో విడత ప్రభుత్వం వచ్చేసరికి పత్తా లేకుండా పోయింది. రాష్ట్రపతి ప్రసంగంలో రెండు సంవత్సరాలూ చోటు దొరకలేదు. అది కూడా తెలంగాణ ఉద్యమం ఓ పక్క ఉవ్వెత్తున కొనసాగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేర సమానమైన నిర్లక్ష్యాన్నీ, లెక్కలేనితనాన్ని ప్రదర్శించాయి.
విద్యార్దులూ, లాయర్ల ఉద్యమాల పుణ్యమైతేనేమీ, అర్ధంతరంగా రాజశేఖర రేడ్డి తనువు చాలించడం వల్లనైతేనేమి, కే.సి.ఆర్ కి రాజకీయ ప్రాణం దక్కింది. టి.ఆర్.ఎస్ గానీ, కే.సి.ఆర్ గానీ స్వయంగా పూనుకుని, పధక రచన చేసి ఉద్యమాలు నిర్మించడం వలన టి.ఆర్.ఎస్, కే.సి.ఆర్ లకు పలుకుబడి పెరగలేదు. విద్యార్ధులూ, లాయర్ల ఉద్యమాలతొ పాటు యువకులు, విద్యార్ధులు తెలంగాణ కావాలన్న ఆకాంక్షతో తమను తాము నిలువునా దహించుకొని చేసిన ఆత్మ త్యాగాలే టి.ఆర్.ఎస్, కే.సి.ఆర్ ల దింపుడు కళ్ళెం ఆశలకు ఉద్యమ ఊపిరులూదాయి. ఆ ఊపిరిలతోనే టి.ఆర్.ఎస్ ఎం.ఎల్.ఏ లు అత్యధీక మెజారిటీతో మళ్ళీ ఎన్నిక కాగలిగారు.
జూన్ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గురించి ఆలోచించే పరిస్ధితి లేదని కే.సి.ఆర్ కి కాంగ్రెస్ వాళ్ళు చెవిలో ఊదగానే ఉద్యమ ఉత్సాహం అంతా న్యూఢిల్లీలో పార్లమెంటు పక్కన జమ్మి చెట్టుపై దాచి వచ్చిన కే.సి.ఆర్, ఈ రోజు ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు జరపాలని నిర్ణయించడం ఎంత హాస్యాస్పదం! ఉద్యమాల లక్ష్యం నెరవేరాక మాత్రమే ఉద్యమ ఉత్సవాలు ఎవరైన నిర్వహించాలని అనుకుంటారు. అదేం చిత్రమో, తెలంగాణ రాష్ట్రం కనీసం కనుచూపు మేరలొ నైనా లేదు, ఉత్సవాలట! 1947 ఆగష్టు 15 కు ముందు భారత దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజుని “జాతీయోద్యమ దశాబ్ది, వివిధ జూబ్లీల ఉత్సవాలు జరుపుకుంటే ఒక్కసారి ఊహించుకుంటే ఎలా ఉంటుంది? నవ్వొస్తుంది. పరాచికం ఆడినట్లుంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాకారం కాకుండానే టి.ఆర్.ఎస్ ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలనుకోవడం కూడా అలాగే ఉంది మరి.
అసలు ఉద్యమం అంటే ఎలాగుండాలి? లక్ష్యం సాధించే వరకు ఉద్యమ విశ్రాంతి తీసుకోదు. ఉద్యమ లక్ష్యం ఎవరి చేతిలోనో పెట్టి వారికి తీరిక లేదు గనక అందాకా ఆగి చూద్దామని ఉద్యమం (అది ఉద్యమమే అయితే) ఎన్నడూ భావించదు. లక్ష్యాన్ని ఒకరి దయాదాక్షిణ్యాలకి అప్పగించినట్లయితే అది ఇంకేమన్నా అవుతుంది గాని ఉద్యమం మాత్రం కాదు. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాన్ని తక్కువ చేసి చూడడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. జరుగుతున్న ఉద్యమానికి, ఆ ఉద్యమం కోసమే పుట్టానంటున్న టి.ఆర్.ఎస్. ఇస్తున్న విలువా, గౌరవాలే ఏ స్ధాయిలో ఉన్నాయో చర్చించడమే ఇక్కడ ఉద్దేశ్యం. ఇవ్వాళ ఉద్యమం హైద్రాబాదులోని టి.ఆర్.ఎస్ కార్యాలయంలో గాని, కే.సి.ఆర్ ఇంట్లో గాని, లేదా వాళ్ళ ఎం.ఎల్.ఏ ల ఇళ్ళ వసారాల్లో ఉన్నట్లుగా భావించినపుడే ఈ ఉత్సవాల ఆలోచలను పుట్టుకొస్తాయి.
అలా కాక ఉద్యమం తెలంగాణ పల్లెల్లో, పల్లెల్లొ నీటి చుక్క కోసం ఎదురుచూస్తున్న రైతుకూలీల కళ్ళల్లో, డిగ్రీలు పీజీలు చదివి కాసింత బువ్వపెట్టె చిరుద్యోగాల కోసం చూస్తున్న కోటిన్నొక్క నిరుద్యోగుల ఆశల్లో, తెలంగాణొస్తే నోట్లో నాలుగేళ్ళూ పోయేందుకు నాలుగ్గుంటల భూమయినా దక్కకపోతుందా అని చూస్తున్న నిస్పృహల చూపుల్లో, దళిత జనాల ఆకలి దప్పుల నిట్టూర్పుల్లో, పొయిలో పిల్లిని లేపాలని కలలు గంటున్న తెలంగాణ ఆడపడుచుల బాధల గాధల్లో ఉందని భావిస్తే గనక ఇప్పుడు ఉత్సవాలు నిర్వహించే దిక్కుమాలిన ఐడియాలు రావు, రాజాలవు.
టి.ఆర్.ఎస్ ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నా, అది పక్కా బూర్జువా పార్టీ. తెలంగాణ సాధన కంటె, వోటింగ్ టాక్టిక్స్, మూవ్ మెంట్ ని లాబీయింగ్ కు ఉపయోవించుకోవడం టి.ఆర్.ఎస్ అసలు లక్ష్యం.
అవును
!!!
అర్ధం కాలే.