ఇజ్రాయెల్ గూండా బాంబు దాడుల్లొ ఇద్దరు సూడాన్ కారు ప్రయాణికుల దుర్మరణం


Car destroyed in Sudan in Israel attack

సూడాన్ లో ఇజ్రాయెల్ బాంబు దాడిలో ధ్వంసమైన కారు

మధ్యప్రాచ్యం ప్రాంతంలో ఇజ్రాయెల్ రౌడీ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచ పోలీసు అమెరికాకి అనుంగు మిత్రుడైన ఇజ్రాయెల్ తాజాగా సూడాన్ లో కారులో ప్రయాణిస్తున్న ఇరువురిని పొట్టన బెట్టుకుంది. చనిపోయినవారు ఎవరైందీ ఇంకా గుర్తించలేదు. పాలస్తీనా ప్రాంతం ‘గాజా’ లోని ప్రభుత్వానికి ఇతర దేశాలు గానీ వ్యక్తులు గానీ ఆయుధాలు సరఫరా చేయకుండా ఉండడానికి ఇజ్రాయెల్ కాపలా కాస్తుంటుంది. పశ్చిమాన మధ్యధరా సముద్రంలో, దక్షిణాన ఎర్ర సముద్రంలోనూ ఇజ్రాయెల్ వాయు, నౌకా బలగాలు కాపలా కాస్తూ అనుమానం వచ్చిన వాహనాలపై బాంబు దాడులు చేయడం ఇజ్రాయెల్ తన హక్కుగా భావిస్తుంది. అమెరికా ప్రపంచానికి గూండాగా వ్యవహరిస్తుండగా ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో గూండాగా వ్యవహరిస్తూ అమెరికా ప్రయోజనాలను కాపాడుతుంటుంది.

తాజాగా జరిగిన బాంబు దాడి వెనక ఇజ్రాయెల్ ఉందని సూడాన్ విదేశీ మంత్రి ఆలీ అహ్మద్ కార్తి ఆరోపించాడు. “ఇజ్రాయెల్ ఈ దాడి చేసినట్లుగా సూచనలున్నాయి. అందులో అనుమానమే లేదు” అని ఆయన అన్నాడు. ఎర్ర సముద్రం ఒడ్డున ఉన్న “పోర్ట్ సూడాన్” నగరానికి 15 కి.మీ దూరంలో ప్రయాణంలో ఉన్న కారుపై ఇజ్రాయెల్ దాడి చేసిందని ఆయన చెప్పాడు. ఇజ్రాయెల్ కి చెందిన రెండు అపాచి హెలికాప్టర్లు దాడిలో పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులుగా భావిస్తున్నవారిని ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. కారు విమానాశ్రయం నుండి నగరానికి వస్తుండగా దాడి జరిగిందని సూడాన్ అధికారి ఒకరు తెలిపారు. హ్యుండై సొనాటా కారులో ఎన్ని ఆయుధాలు రవాణా చేయవచ్చో ఇజ్రాయెల్ నే అడగాలి. అమెరికా కూడా టెర్రరిజం పేరుతొ సూడాన్ పై బాంబు దాడులు చేసిన చరిత్ర ఉంది.

2009 సంవత్సరంలో ఆయుధాలు రవాణా చేస్తున్న వాహనాల కాన్వాయ్ పై ఇజ్రాయెల్ విమానాలు దాడి చేసి పేల్చి వేసిన సంఘటనను తాజా ఘటన గుర్తుకు తెస్తోంది. ఇజ్రాయెల్ తానే దాడి చేసానని నేరుగా అంగీకరించనప్పటికీ పరోక్ష సూచనలు అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని యూద్ ఓల్మర్ట్ ఇచ్చాడు. “దగ్గరి ప్రాంతాలైనా సరే, దూర ప్రాంతాలైనా సరే. ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా అక్కడ మా కార్యకలాపాలు ఉంటాయి” అని ఓల్మర్ట్ ప్రకటించి ఇజ్రాయెల్ గూండాయిజాన్ని పచ్చిగా వెళ్ళబుచ్చుకున్నాడు. గాజాలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో “హమాస్” సంస్ధ నెగ్గినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ లు హమాస్ ఏర్పరచిన ప్రభుత్వాన్ని గుర్తించడానికి నిరాకరించాయి. హమాస్ సంస్ధను ఉగ్రవాద సంస్ధగా ముద్రవేసి అవి తమ గూండాయిజాన్ని సమర్ధించుకుంటున్నాయి. వికీలీక్స్ బయటపెట్టిన కేబుల్స్ ద్వారా అమెరికాయే ప్రపంచ దేశాలకు టెర్రరిజాన్ని ఎగుమతి చేస్తున్న విషయం వెల్లడైనప్పటికీ అమెరికాకి సిగ్గూ ఎగ్గూ లేకుండా పోయాయి.

సూడాన్ తూర్పు ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువైనట్లుగా బిబిసి విలేఖరి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అంతర్జాతీయ చట్టాలను గేలి చేస్తూ ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లపై దురాక్రమణ యుద్దం చేయడం పట్ల ఈ బిబిసి విలేఖరులు ఏనాడూ ఆందోళన వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. తాజాగా లిబియా భూభాగంపై వైమానిక దాడులు చేస్తూన్నా, ఆ దాడుల్లో లిబియా పౌరులు చనిపోతున్నా బిబిసి విలేఖరికి ‘లిబియా పౌరులు మరిన్ని దాడులు చేయమని కోరుతుండడమే కనిపిస్తుంది తప్ప అందులోని దుష్టన్యాయం కనిపించదు. పశ్చిమ దేశాల ప్రయోజనాల కోసం బాధ్యతాయుతమైన జర్నలిజం వృత్తిని కూడా తాకట్టు పెట్టడం వీరికి ఆందోళనకరం కాదు.

వ్యాఖ్యానించండి