పౌరుల రక్షణ పేరుతో ఐవరీకోస్ట్ అధ్యక్షుడి నివాసంపై దాడి చేసిన సమితి, ఫ్రాన్సు సైన్యాలు


ప్రతి సభ్య దేశం పట్ల నిష్పాక్షింగా వ్యవహరించాల్సిన ఐక్యరాజ్యసమితి నిజానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర పశ్చిమ దేశాల జేబు సంస్ధ అని మరో సారి రుజువయ్యింది. ఐవరీ కోస్టు దేశ అధ్యక్షుడి భవనంపై ఐక్యరాజ్యసమితికి చెందిన శాంతి స్ధాపనా సైనికులు, ఫ్రాన్సుకి చెందిన సైనికులు సోమవారం బాంబు దాడులు నిర్వహించాయి. అధ్యక్షుడు లారెంట్ జిబాగ్బో నివాస భవనం, ప్రభుత్వ టెలివిజన్ ప్రధాన కార్యాలయం, రిపబ్లికన్ గార్డుల భవనం, పారామిలిటరీ కార్యాలయం లపై ఫ్రాన్సు, సమితి సైన్యాలు బాంబుల వర్షం కురిపించాయి.

పౌరులను రక్షించడం కోసమే జిబాగ్బో భవనాలపైనా, అతడి మిలట్రీ కార్యాలయాలపైనా దాడులు చేయాల్సి వచ్చిందని స్వయంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్-కీ-మూన్ చెప్పడం గమనార్హం. ఐక్యరాజ్యసమితి శాంతి సైనికుల అధిపతి అలైన్ లె రాయి, అధ్యక్ష భవనంపైనా, అతడి మిలట్రీ ఆఫీసులపైనా దాడి చేసే అధికారం సమితి తీర్మానం కల్పించిందని సెలవిచ్చాడు.”ఐక్యరాజ్యసమితి శాంతి సైనికులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సమితి సూత్రాలు చెబుతున్నాయి. కాని ఐవరీ కోస్టులోని సమితి సైనికుల మిలట్రీ చర్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి” అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ విమర్శించాడు.

కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడు జిబాగ్బో పైన పోటి చేసిన అలస్సేన్ ఒట్టారా గెలిచాడని సమితి చెబుతోంది. కాని ఎన్నికల ఫలితాలను రిగ్గింగ్ చేశారని అధ్యక్షుడు ఆరోపించాడు. సమితి గెలిచాడంటున్న ఒట్టారా పూర్వాశ్రమంలొ ఐ.ఎం.ఎఫ్ లో ఆర్ధీకవేత్తగా పని చేసి ఉండడం గమనార్హం. 1960 లో ఫ్రాన్సు నుండి ఐవరీ కోస్టు స్వాతంత్ర్యం పొందిందని చెబుతున్నప్పటికీ ఫ్రాన్షు సైన్యాలు శాంతి స్ధాపన పేరుతో దేశంలోనే తిష్ట వేశాయి. ఫ్రాన్సు ప్రయోజనాలను అధ్యక్షుడు జిబాగ్బో వ్యతిరేకించడంతో ఫ్రాన్సు బలప్రయోగం ద్వారా తనకు అనుకూల ప్రభుత్వాన్ని స్ధాపించడానికి నడుం కట్టింది. దానికి ఐక్యరాజ్యసమితి మద్దతు పలకడమే కాకుండా తన శాంతి సైన్యాలను అధ్యక్షుడిపై దాడికి వినియోగిస్తోంది. తద్వారా ఐవరీకోస్టు ప్రజల ప్రయోజనాలను తుంగలో తొక్కుతోంది.

వ్యాఖ్యానించండి