గడ్డాఫీపై అమెరికా రాయబారి రాసింది కరెక్టు కాదు -ఉక్రెయిన్ నర్సు


Galyna Kolotnytska

గాలినా కొలోట్నిట్స్కా

గడ్డాఫీ తనకు సేవచేసిన ఐదుగురు ఉక్రెయిన్ నర్సులలో ఒకరితో ప్రత్యేక సంబంధం ఉందంటూ లిబియాలోని అమెరికా రాయబారి రాసింది కరెక్టు కాదని ఐదుగురిలో ఒకరైన “ఒక్సానా బాలిన్స్కాయా” రష్యా పత్రికకు తెలిపింది. గడ్డాఫీ ఆనారోగ్యంతో ఉండగా ఉక్రెయిన్ కి చెందిన అయిదుగురు నర్సులు నర్సింగ్ సేవలు అందించారు. వారిలో ఒకరైన “గాలినా కొలోట్నిట్స్కా” తో గడ్డాఫీకి ప్రత్యేక సంబంధం ఉందనీ, ఆమే లేకుండా గడ్డాఫీ ఒక్క క్షణం కూడా ఉండలేడనీ 68 సంవత్సరాల వయసుగల గడ్డాఫీ గురించి అమెరికా రాయబారి, అమెరికా ప్రభుత్వానికి సెప్టెంబరు 29, 2009 తేదీన రాసినట్లుగా వికీలీక్స్ వెల్లడించిన కేబుల్ ద్వారా తెలిసింది. గాలినా ను అమెరికా రాయబారి “భోగలాలసురాలయిన బ్లాండ్” గా అభివర్ణించి తన కుసంస్కారాన్ని బయట పెట్టుకున్నాడు.

గడ్డాఫీని అతని ఆంతరంగిక సిబ్బంది ‘పాపా’ అని సంబోధిస్తారనీ, మిగతా నర్సుల్లాగే గాలినాకి కూడా అవే డ్యూటీ ఉంటుందనీ, కాకపోతే మిగిలిన వారి కంటే గాలినాకు నర్సుగా ఎక్కువ అనుభవం ఉందని ఒక్సానా తెలిపింది. గడ్డాఫీ 38 మెట్లకంటే ఎక్కువ మెట్లు ఎక్కలేడని అమెరికా రాయబారి రాసినదంతా కట్టుకధేనని ఒక్సానా తేల్చింది. గడ్డాఫీ తన ఆంతరంగిక సిబ్బందికి ప్రతి సంవత్సరం ఇటలీలో తయారైన రిస్ట్ వాచిలు బహుమతిగా ఇస్తాడనీ ఆమె తెలిపింది. గడ్డాఫీ తన అవసరాలను తానే చూసుకుంటాడనీ ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం నర్సుల సేవలను వినియోగించుకునే వాడని తెలిపింది.

విదేశాల్లో నియమించబడ్డ అమెరికా రాయబారులు ఎన్ని అనైతిక పనులు చేసేదీ వికీలీక్స్ ద్వారా బయటపడిన డిప్లొమేటిక్ కేబుల్స్ ద్వారా వెల్లడైంది. వివిధ దేశాల ప్రభుత్వాధిపతులనూ, మంత్రులనూ, అధికారులనూ అమెరికా పట్ల వారు వ్యవహరించే పద్దతిని బట్టి వివిధ రకాలుగా పేర్లు పెడుతూ కేబుల్స్ రాయడం వారి కుసంస్కారాన్ని, అనైతికతనూ, నాగరికతా రాహిత్యాన్నీ పట్టిస్తుంది.

వ్యాఖ్యానించండి