అమెరికాలో ఖురాన్ తగలబెట్టడంపై ఆఫ్ఘనిస్తాన్ లో విస్తరిస్తున్న హింసాత్మక నిరసనలు


Christian pastors Terry Jones and Wyne Sapp

క్రైస్తవ మత మూర్ఖ పాస్టర్లు టెర్రీ జోన్స్, వేన్ సాప్

మార్చి 20 తేదీన అమెరికాలోని ఫ్లోరిడాలో క్రైస్తవ మత మూర్ఖుడు పాస్టర్ ‘టెర్రీ జోన్స్ ‘ ముస్లిం మత పవిత్ర గ్రంధం “ఖురాన్”ను తగలబెట్టడాన్ని నిరసిస్తూ ఆఫ్ఘనిస్తాన్లో హింసాత్మక నిరసనలు దేశమంతటా విస్తరిస్తున్నాయి. కాందహార్, జలాలాబాద్ పట్టణాల్లో వందలమంది ఆఫ్ఘన్లు నిరసన ప్రదర్శనలు జరిపారు. ఉత్తర ఆఫ్గనిస్తాన్ లోని మజార్-ఎ-షరీఫ్ పట్టణంలో గత శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శనల అనంతరం జరిగిన హింసలొ 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఏడుగురు ఐక్యరాజ్యసమితి ఉద్యోగులు. కాందహార్ లో శనివారం నిరసన ప్రదర్శనల అనంతరం జరిగిన హింసలో పది మంది మరణించారు. ఆదివారం కాందహార్ లో జరిగిన మరో నిరసన ప్రదర్శన సందర్భంగా చెలరేగిన హింసలొ మరొక వ్యక్తి మరణించాడు.

అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఖురాన్ తగలబెట్టడాన్ని, అనంతరం ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన హింసనూ రెండింటినీ ఖండిస్తున్నట్లు ప్రకటించాడు. ఖురాన్ తగలబెట్టడాన్ని మతసహనం లేకపోవడాన్ని సూచిస్తున్నదని అంటూ, దాన్ని సాకుగా చూపి మానవ సంస్కారానికీ, నాగరికతకూ వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ అమాయకులను చంపడం ఘోరమని ఒబామా ఆవేడన వ్యక్తం చేశాడు. స్వేచ్ఛ పేరుతో ఖురాన్ తగలబెట్టడాన్ని అనుమతించడం అమెరికా చేసిన ఘోరమైన తప్పు. తాము అత్యంత పవిత్రంగా భావించుకునే మత గ్రంధాన్ని తగలబెట్టాక ముస్లింలు సంస్కారంతో, నాగరికతతో ప్రవర్తించాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఒక సారి మతసామరస్యాన్ని భంగపరిచాక తర్వాత జరిగే పరిణామాలు ఒకరి ఆధీనంలో ఉండజాలవు. మతపూరితమైన టెర్రరిస్టు సంస్ధగా ముద్రవేసిన తాలిబాన్ సంస్ధ పలుకుబడి ఉన్నచోట్ల అటువంటి ప్రవర్తనను ఒబామా ఆశించడం ఆశ్చర్యకరం.

Protests in Jalalabad against Kuran burning

కొరాన్ తగలబెట్టడంపై జలాలాబాద్ లో నిరసన ప్రదర్శన

అమెరికాలోని ప్రొటెస్టెంట్ పాస్టరు టెర్రీ జోన్స్, గత సంవత్సరం, సెప్టెంబరు 11 టెర్రరిస్టు దాడులు జరిగి పది సంవత్సరాలు పూర్తియిన సందర్భంగా ఖురాన్ బర్నింగ్ డే జరపాలని విస్తృతంగా ప్రచారం చేశాడు. ప్రపంచం అంతటా క్రైస్తవ, ముస్లిం ప్రపంచంలో తీవ్రమైన ఉద్రిక్తతలను ఈ ప్రచారం రేకెత్తించింది. చివరకు అమెరికా అధ్యక్షుడు ఒబామా జోక్యంతో టెర్రీ జోన్స్ ఆఖరి నిమిషంలో ఖురాన్ తగలబెట్టడాన్ని విరమించుకున్నాడు. కానీ ఆ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జోన్స్ జరిపిన ప్రచారం పుణ్యమాని అమెరికాలో అనేక చోట్ల ఖురాన్ గ్రంధాన్ని తగలబెట్టారు. తగలబెట్టిన సంఘటన జరగని చోట్లకూడా తగలబెట్టినట్లు వార్తలు వచ్చాయి. దానితో కొన్నిచొట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇప్పుడు అదే పాస్టరు ఉన్నట్లుండి మార్చి 20 తేదీన ఫ్లోరిడా నగరంలో ఖురాన్ తగలబెట్టిన సంఘటన వెల్లడయ్యింది. దానితో ముస్లింలు అగ్రహోదగ్రులయ్యారు.

మార్చి 20 తేదీన పాస్టర్ టెర్రీ జోన్స్ ఆధ్వర్యంలో మరో పాస్టర్ వేన్ సాప్ ఒక విచారణ తంతు నిర్వహించాడు. అందులో ఖురాన్ ను, మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడినందుకు దోషిగా నిర్ధారించారు. అందుకు శిక్షగా వేన్ సాప్ ఖురాన్ గ్రంధాన్ని కిరోసిన్ పోసి తగలబెట్టారు. ఈ సంఘటనను నివారించడంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గానీ, అమెరికా ప్రభుత్వంగానీ విఫలమయ్యాయి. ఆదివారం కాందహార్లో ఆఫ్ఘన్లు ప్రధాన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంపైకి ప్రదర్శనగా వెళ్ళారు. అక్కడ ట్రాఫిక్ పోలిసుల వద్ద ఉన్న టియర్ గ్యాస్ కేనిస్టర్ ను పేల్చివేయడంతో ఒకరు మరణించారు. కాందహార్, మజార్-ఎ-షరీఫ్ లలో జరిగిన హింసకు తాలిబాన్ బాధ్యురాలిగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తప్పుబట్టింది. అయితే తాలిబాన్ ఆ ఆరోపణను తిరస్కరించింది. ఐక్యరాజ్యసమితిపై దాడి జరగడానికి తాము కారణమని భావించడం లేదని మూర్ఖ పాస్టర్లు ఇరువురూ సగర్వంగా ప్రకటించారు.

కాందహార్ లోని నిరసన ప్రదర్శనలో పాల్గొన్నవారు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ని విడిచె వెళ్ళాలని డిమాండ్ చేయడం విశేషం. ఐక్యరాజ్యసమితి తరఫున ఆఫ్ఘనిస్తాన్ లో రాయబారిగా ఉన్న ‘స్టాఫన్ దే మిస్తురా’ దాడికి ఫ్లోరిడా పాస్టరే కారణమని ప్రకటించాడు. “సమితిపై దాడికి ఆఫ్ఘన్లు బాధ్యులని నేను భావించడం లేదు. ఖురాన్ ను తగలబెట్టారన్న వార్తకు జన్మనిచ్చిన ఫ్లోరిడా పాస్టరే ఇందులో దోషి. స్వేచ్ఛగా మాట్లాడే హక్కుకు అర్ధం ఇతరుల సంస్కృతి, మతం, సంప్రదాయాలను గాయపరచడం కాదు” అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నాడు.

 

2 thoughts on “అమెరికాలో ఖురాన్ తగలబెట్టడంపై ఆఫ్ఘనిస్తాన్ లో విస్తరిస్తున్న హింసాత్మక నిరసనలు

  1. ఆఫ్ఘన్లో మాత్రమే ఎందుకు నిరసనలు జరుగుతున్నాయి? ఇస్లామిక్ దేశాల్లో నిరసనలు జరిగినట్లు వార్తలు లేవు. ఎందుకని?

  2. భాస్కర్, అమెరికాలో జరిగిన ఘటనకు మీడియా గానీ, ముస్లిం మత సంస్ధలు గానీ ప్రాధాన్యం ఇవ్వలేదు. దానికి ప్రాధాన్యత ఇస్తే జవాబు చెప్పుకోవాల్సింది పశ్చిమ దేశాలే. ముస్లిం మతం హింసాత్మకమైంది, అనాగరికమైంది అని క్రైస్తవ మతాధిపత్య పశ్చిమ దేశాలు పరోక్షంగా చేస్తున్న ప్రచారానికి ఈ ఘటన గండికొడుతుంది. అందుకే దానికి ప్రాచుర్యం ఇవ్వకూడదని నిర్ణయించుకొని ఉండవచ్చు.

    ఆఫ్ఘనిస్తాన్లో ఐక్యరాజ్యసమితి సిబ్బందిని ఏడుగుర్ని చంపడంతొ ఆ వార్తకు ప్రాధాన్యం దొరికింది. ఇతర ముస్లిం దేశాల్లో నిరసనలు జరిగినా హింసాత్మక రూపం తీసుకోలేదు. ఖురాన్ ని తగలబెట్టినంత మాత్రాన ఆఫ్ఘనిస్తాన్లో అమాయకుల్ని చంపేశారని ప్రచారం చేయవచ్చు. ఆ విధంగా ముస్లిం మతంపై చేస్తున్న దుష్ప్రచారానికి ఆఫ్ఘన్ ఘటన ఋజువు చేస్తుందని చెప్పిఏ అవకాశం దొరికింది. టెర్రీ జోన్స్ ఆమాట అన్నాడు కూడా. ముస్లిం మతం హింసాత్మకం అని నేను చెప్పింది ఆఫ్ఘన్ ఘటనే ఋజువు అని అన్నాడు తప్ప తాను ఖురాన్ ని తగలబెట్టిన తర్వాతే హింస జరిగిన విషయాన్ని నిరాకరించాడు.

    ఇతర ముస్లిం దేశాల్లో నిరసన జరిగినా దాన్ని మీడియా పట్టించుకోదలచలేదు. అక్కడా క్రైస్తవుల్ని ఎవర్నయినా చంపితే మీడియాలో వచ్చే అవకాశం ఉండవచ్చు.

    ఇక్కడ అంతర్జాతీయ పరిణామాలపై స్టడీ సర్కిల్ నిర్వహించారు.

వ్యాఖ్యానించండి