పశ్చిమదేశాల విమాన దాడుల్లో లిబియా పౌరుల దుర్మరణం


libya_airstrikes

లిబియాలో తాజా పరిస్ధితి -బిబిసి

పశ్చిమ దేశాల రక్తదాహానికి అంతులేకుండా పోతోంది. ఇరాక్ పై దాడికి ముందుగానే ఆంక్షల పేరుతో లక్షలాది ఇరాకీ పసిపిల్లల ఉసురు పోసుకున్నాయి. పసిపిల్లల పాల డబ్బాల రవాణాపై కూడా ఆంక్షలు విధించడంతో పోషకార లోపంవలన లక్షలాదిమంది ఇరాకీ పిల్లలు చనిపోయారు. సంవత్సరాల తరబడి విచక్షణా రహితంగా బాంబు దాడులు చేసి లక్షలమంది రక్తమాంసాల్ని ఆరగించాయి. ఆఫ్ఘనిస్తాన్ పై దురాక్రమణ దాడి చేసి మిలియన్లమంది పౌరులను చంపిన సంగతి వికీలీక్స్ బైట పెట్టిన ఆఫ్ఘన్ యుద్ధ పత్రాల ద్వారా లోకానికి తెలిసింది. ఇన్ని ఘోరాలు చేసినా ఈ రక్తపిపాసుల దాహం తీరడం లేదు. ఇప్పుడు లిబియాపైబడి పీక్కు తింటున్నాయి.

నిండా అరవై లక్షల జనాభా ఉన్న లిబియాపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు దుర్మార్గంగా విమాన దాదులు చేస్తున్నాయి. శుక్రవారం గడ్డాఫీ బలగాల ఆయుధ వాహనంపై బాంబు దాడి చేయడంతో పెద్ద పేలుడు సంభవించి పక్కనే ఉన్న రెండు ఇళ్ళను ధ్వంసం చేశాయి. ఇళ్ళలో ఉన్న ఏడుగురు పౌరులు చనిపోయారు. చనిపోయిన వారు 12 నుండి 20 సంవత్సరాల మధ్య వయసు గలవారని తెలుస్తోంది. నలుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారనీ, 30 మందికి పైగా గాయపడ్డారనీ, గాయపడిన వారికి వైద్యం అందించిన డాక్టర్ ద్వారా తెలిసింది. ఘోరం ఏంటంటే బ్రిటిష్ వార్తా సంస్ధ బిబిసి ఏడుగురు చనిపోయినా వారి సంబంధీకులకు పశ్చిమ దేశాలపై కోపం రాలేదట. గడ్డాఫీ పౌరులను అడ్డు పెట్టుకుంటున్నాడని వారికి ముందే అవగాహన ఉండడం వలన వారి పిల్లలు చనిపోయినా చంపిన వారి మీద కోపం రాలేదని బిబిసి తెలుపుతోంది. బిబిసి కి సిగ్గెలా లేదో అర్ధం కావడం లేదు. పరాయి దేశంపై దురాక్రమణ చేస్తూ అక్కడ ఒక్క బ్రిటిష్ సైనికుడు చనిపోయినా పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి వార్తలు రాసి చనిపోయిన వారి వీరగాధలు వల్లించే బిబిసి, తమ పిల్లల్ని చంపినా బ్రిటన్ దాడులను లిబియన్లు సమర్ధిస్తున్నారని లోకాన్ని నమ్మించడానికి చూస్తోంది. పైగా ఇలాంటి ఘటనలు ఇంకా జరగాలని లిబియన్లు ఎదురుచూస్తున్నారట!?

ఆయిల్ పట్టణం బ్రెగాకి దగ్గర్లో ఉన్న ‘జావియా ఎల్-అర్గోబే’ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇదిలా ఉండగా లిబియన్ ప్రభుత్వ రాయబారి మహమ్మద్ ఇస్మాయిల్ లండన్ కి వచ్చాడనీ, లిబియా ప్రభుత్వం తరపున చర్చలు జరపడానికి వచ్చాడనీ బిబిసి తెలిపింది. అయితే ఇస్మాయిల్, గడ్డాఫీ పుత్రుడు సైఫ్ కు సలహాదారుడనీ, లండన్లోని తన బంధువుల్ని చూడ్డానికి వచ్చాడనీ, ఆ సందర్భాన్ని వినియోగించుకుని బ్రిటన్ ప్రభుత్వం గడ్డాఫీకి గట్టి హెచ్చరికలు ఆయన ద్వారా పంపిందని రాయిటర్స్ రాసింది. వార్తల్ని పశ్చీమ దేశాలకు అనుకూలంగా మలచడానికి బిబిసి ఎంత దారుణానికయినా ఒడిగడుతుందని దీనితో అర్ధమవుతోంది. లిబియా ప్రభుత్వం లోని గూఢచర్య మంత్రి, ఉప విదేశాంగ మంత్రి, లిబియా పార్లమెంటు స్పీకర్ లు లండన్ రావడానికి ట్యునీషియాలో విమానం కోసం ఎదురు చూస్తున్నారని ఆల్ జజీరా టీవి చెప్పినట్లు కూడా బిబిసి తెలిపింది. ఆయిల్ మంత్రి షుక్రీ ఘానిం తాను లండన్ రావడానికి ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని ఖండించాడు. తాను తన ఆఫీసులోనే ఉన్నాననీ లిబియా ఆయిల వనరులకు నష్టం జరక్కుండా చూడ్డానికి ప్రయత్నిస్తున్నానని ఆయన బిబిసి కి తెలిపాడు.

పశ్చిమ ప్రాంతంలో తిరుగుబాటు దారుల చేతిలో ఉన్న ఏకైక పట్టణం మిస్రాటాని స్వాధీనం చేసుకోవడానికి గడ్డాఫీ బలగాలు భారీ దాడి ప్రారంభించాయి. గడ్డాఫీ బలగాలు తమ ఉత్తమ ఆయుధాల్ని మిస్రాటా స్వాధీనం కోసం వినియోగిస్తున్నాడని మిస్రాటాలోని తిరుగుబాటుదారుల నాయకుడు రాయిటర్స్ కి తెలిపాడు. తిరుగుబాటు బలగాలు సంఘటితంగా, తప్పులు దొర్లకుండా దాడులకు దిగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పౌరుల్ని యుద్ధ రంగం లోకి రాకుండా నిషేధిస్తున్నారు. ఆయుధాలు లేకుండా వస్తున్న ఉత్సాహవంతుల్ని నిరోధిస్తున్నారు. తిరుగుబాటుదారులకు పశ్చిమ దేశాలు మొదటినుండీ ఏదో ఒక రూపంలో సాయం అందిస్తూ వచ్చాయని తెలుస్తోంది. వారు పశ్చిమ దేశాల సాయం కోరడం కోరి కోరి దోపిడీ దారులకు తాళం అప్పగించడమే.

వ్యాఖ్యానించండి