ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆయుధ పోటీ -చైనా శ్వేతపత్రం


ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలొ అమెరికా ఆయుధ పోటీ పెంచుతున్నదని చైనా అభిప్రాయపడింది. చైనా ప్రభుత్వం జారీ చేసిన ‘జాతీయ రక్షణ శ్వేత పత్రం’ లో చైనా, దాని చుట్టూ ఉన్న రక్షణ పరిస్ధితులను విశ్లేషించింది. ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిలట్రీ ఉనికి పెరుగుతున్నదని శ్వేత పత్రం తెలిపింది. ఈ ప్రాంతంలోని సైనిక చర్యలు అంతిమంగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడి ఉన్నాయని పత్రం తెలిపింది. భద్రతాంశాలపై చైనా దృక్పధాన్నీ, తన రక్షణ బలగాల గురించిన సమగ్ర దృక్పధాన్ని శ్వేత పత్రం లో పొందు పరిచారు. గురువారం విడుదల చేయబడిన శ్వేత పత్రంలోని అంశాలు ఇంకా ఇలా ఉన్నాయి:

  • ఆసియా-ఫసిఫిక్ వ్యూహాత్మక భూభాగంలొ గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి. సంబంధిత ప్రధాన శక్తులు తమ మిలట్రీ పెట్టుబడులను పెంచుతున్నాయి.
  • అంతర్జాతీయంగా మిలట్రీ పోటీ తీవ్రస్ధాయిలో కొనసాగుతోంది.
  • అమెరికా మిలట్రీ కూటములని ఏర్పరచుకొని, తద్వారా ప్రాంతీయ వ్యవహారాల్లో మరింతగా జోక్యం పెంచుతోంది.
  • విదేశాలు చైనా పట్ల మరింత అనుమానాస్పద ధోరణితో ఉన్నాయి. చైనాకి వ్యతిరేకంగా జోక్యందారీ పద్ధతులనూ, ప్రతికూల కదలికలనూ పెంచుతున్నాయి.
  • గత కొన్ని సంవత్సరాలుగా చైనా, అమెరికాల సంబంధాలు, ముఖ్యంగా మిలట్రీ సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనా ప్రధాని ఈ సంవత్సరం ప్రారంభంలో అమెరికా సందర్శించాక రెండింటి మధ్య ఉన్న ఉద్రిక్తత కొంత చల్లారింది. కానీ అనంగీకారతకు అవకాశం పెరుగుతోంది.
  • చైనా, అమెరికాల సంబంధాలను అస్ధిర పరచే విధంగా అమెరికా తైవాన్ కు ఆయుధ సరఫరా కొనసాగిస్తోంది.
  • చైనాకి చెందిన ప్రజా విముక్తి సైన్యం కేవలం రక్షణ కోసం మాత్రమే. దాన్నుంచి ఎవరికీ భయం అక్కర్లేదు. దాడికి గురైన తర్వాతే దాడి చేసే వ్యూహం మాత్రమే చైనా కలిగి ఉంది.

శ్వేత పత్రాన్ని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ‘జనరల్ గెంగ్ యాంగ్ సెంగ్’ ఆవిష్కరించాడు. అనంతరం పత్రికలతో మాట్లాడుతూ ఆయన, “మా మిలట్రీ సంబంధాలు (అమెరికా, చైనా) కొన్ని కష్టాలను, సవాళ్ళను ఎదుర్కొంటున్నాయన్నది నిజమే. గౌరవం, నమ్మకం, సమానత్వం, పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన అమెరికాతో కలిసి పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అన్నాడు. తైవాన్ ను ఒక దేశంగా గుర్తించి దానికి దశాబ్దాలుగా ఆయుధాల సరఫరా చేయడం చైనాకు మింగుడుపడని విషయం. తైవాన్, చైనాలో భాగం కనుక దానితో ప్రత్యేక సంబంధాలు పెట్టుకోవడాన్ని చైనా వ్యతిరేకిస్తుంది.

వ్యాఖ్యానించండి