అనుకున్నంతా అయ్యింది. అమెరికా ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అతిక్రమిస్తూ లిబియా తిరుగుబాటుదారులకు రహస్యంగా ఆయుధాలు అందించడానికి నిర్ణయించాడు. అమెరికా ప్రభుత్వ అధికారులు కొందరిని ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ ఈ వార్త ప్రచురించింది. తిరుగుబాటుదారులకు రహస్యంగా ఆయుధాలు అందించే రహస్య ఉత్తర్వుపై ఒబామా సంతకం చేశాడని ఆ సంస్ధ తెలిపింది. గత కొద్ది వారాల్లో “ప్రెసిడెన్షియల్ ఫైండింగ్’ అని పిలవబడే ఆదేశంపై ఒబామా సంతకం చేశాడు. సీఇఏ చేపట్టే అటువంటి రహస్య కార్యకలాపాలకు చట్టపర ఇబ్బందులు ఎదురు కాకుండ ఉండటానికి అటువంటి ఉత్వర్వులపై అధ్యక్షుడు సంతకం చేయాల్సి ఉంటుంది.
అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి వైట్ హౌస్ ప్రతినిది జే కార్నీ నిరాకరించాడు. “ఈ కార్యాలయానికి, ఇతర అన్ని పాలనా కార్యాలయలకు ఉన్న సాధారణ ఆచరణ సూత్రం ప్రకారం ఇంటలిజెన్స్ విషయాల పట్ల మేమేమీ వ్యాఖ్యానించబోవడం లేదు. మా అధ్యక్షుడు నిన్ని ఏం చెప్పాడో అదే ఇప్పుడూ పునరుద్ఘాటిస్తున్నాం. లిబియాలోని ప్రతిపక్షానికి గానీ మరే ఇతర గ్రూపుకి గానీ ఆయుధాల అందించడానికి నిర్ణయం ఏమీ తీసుకోలేదు” అని కార్నీ అన్నాడు. అవును అని నేరుగా అనలేక ‘నో కామెంట్’ అంటున్నాడని పత్రికా ప్రతినిధులకు బాగానే అర్ధం అయ్యింది. అర్ధం కావాలన్నదే కార్నీ ఉద్దేశ్యం కూడా అని అతని మాటలను బట్టి అర్ధమౌతుంది.
ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి సి.ఐ.ఏ కూడా నిరాకరించింది. గడ్డాఫీ బలగాలపై వైమానిక దాడులు చేయడానికి అవసరమైన గూఢచార సమాచార సేకరణకోసం సి.ఐ.ఏ రహస్యంగా మనుషులను లిబియాలో జొప్పించినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. గడ్డాఫీ బలగాల ఆనుపానులు తెలుసుకొని మధ్యధరా సముద్రంలో ఉన్న అమెరికా వైమానిక దళానికి చేరవేయడమే వారి పని. సి.ఐ.ఏ తో పాటు బ్రిటన్ కి చెందిన ప్రత్యేక అధికారులు, MI6 (బ్రిటన్ కి చెందిన రహస్య గూఢచార విభాగం. జేమ్స్ బాండ్ దీనికి చెందిన వాడే) కి చెందిన గూఢచారులు కూడా లిబియాలో పని చేస్తున్నారని అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది.
ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పశ్చిమ దేశాల యుద్ధ విమానాలు లిబియా గగన తలంపై గడ్డాఫీ విమానాలు ఎగరకుండా చూడాల్సి ఉంది. గడ్డాఫీ వైమానిక దాడుల ద్వారా తనను వ్యతిరేకిస్తున్న ప్రజలను కూడా చంపుతున్నాడన్న ప్రచారం జరిపి పశ్చిమ దేశాలు సమితి చేత తీర్మానం చేయించాయి. ఇప్పుడు దాన్ని అతిక్రమించి రహస్యంగా ఆయుధాలు తిరుగుబాటు బలగాలకు ఇవ్వడానికి ఒబామా ఆదేశించాడు. గడ్డాఫీని గద్దె దింపడమే తమ లక్ష్యమని చెబుతూనే అది తమ ఉద్దేశ్యం కాదని అమెరికా అధికారులు చెబుతున్నారు. గడ్డాఫీ బలగాలపై దాడులు చేయడానికీ, ఆయుధ సాయం చేయడానికీ అనుమతి లేదని రష్యా, టర్కీలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అమెరికా తాను చేయదలచుకున్నది చేస్తూనే ఉంది.